Begin typing your search above and press return to search.

400 కేజీల గోల్డ్ దోపిడీ.. 'పాజెక్ట్ 24కే' లో బిగ్ అప్ డేట్..!

స్విట్జర్లాండ్‌ లోని జూరిచ్ నుంచి 2023 ఏప్రిల్ 17వ తేదీన ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది.

By:  Raja Ch   |   13 Jan 2026 4:00 PM IST
400 కేజీల  గోల్డ్  దోపిడీ.. పాజెక్ట్ 24కే లో బిగ్  అప్  డేట్..!
X

స్విట్జర్లాండ్‌ లోని జూరిచ్ నుంచి 2023 ఏప్రిల్ 17వ తేదీన ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది. అందులో సుమారు 400 కిలోల స్వచ్ఛమైన బంగారం, $2.5 మిలియన్స్ విదేశీ కరెన్సీ ఉన్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక సురక్షిత ప్రాంతానికి ఈ మొత్తాన్ని తరలించిన కొద్దిసేపటికే అది అదృశ్యం అయింది. ఎయిర్ కెనడా వ్యవస్థలను మోసం చేసి, నకిలీ పత్రాల ద్వారా పలువురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పుడో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... కెనడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా జరిగిన ఈ 400 కేజీల బంగారు దోపిడీ కేసు సంచలనంగా మారగా.. తాజాగా ఆ దేశ పోలీసులు ఈ కేసులో ఓ కీలక విజయాన్ని అందుకున్నారు. ఇందులో భాగంగా... 'ప్రాజెక్ట్ 24కే' పేరుతో జరుగుతున్న ఈ దర్యాప్తులో భాగంగా.. అరెసలాన్ చౌదరి (43)ని పీల్ రీజినల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్న సమయంలో.. టొరంటో పియర్సన్ ఎయిర్ పోర్ట్ లోకి అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే.. ఈ కేసు దర్యాప్తు వ్యవహారం భారత్ వరకూ పాకింది. ఇందులో భాగంగా... ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (33) ప్రస్తుతం భారత్‌ లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన ప్రీత్ పనేసర్.. ఎయిర్‌ లైన్ సిస్టమ్స్‌ ను మార్చడం ద్వారా ఈ కార్గో షిప్‌ మెంట్‌ ను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో అతడు భారత్ లోనే ఉన్నాడని కెనడా పోలీసులు నమ్ముతున్నారు.

వాస్తవానికి గతేడాది ఇతడిని చండీగఢ్ శివార్లలోని ఒక ఫ్లాట్‌ లో గుర్తించినప్పటికీ.. అతడు తప్పించుకుని పారిపోయాడు. ఈ భారీ దోపిడీకి సంబంధించి ఇప్పటి వరకు పది మందిపై ఆరోపణలు రాగా వారిలో ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. 2024 మేలో భారత్ నుంచి కెనడాకు వస్తుండగా అర్చిత్ గ్రోవర్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే సమయంలో.. పరంపాల్ సిద్ధూ, అమిత్ జలోటా, ప్రసాత్ పరమలింగం, అలీ రజా తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు.

ఈ సందర్భంగా స్పందించిన పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప.. ప్రాజెక్ట్ 24కే అనేది అంతర్జాతీయ నేర ముఠాలను ఎలా అణిచివేయొచ్చో చెప్పడానికి ఒక ఉదాహరణ అని.. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఎక్కడ దాక్కున్నా, ఎంత దూరంలో ఉన్నా.. వెతికి పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.