బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. షాద్ నగర్ టు తిరుమల, ఎందుకంటే?
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Political Desk | 10 Jan 2026 4:47 PM ISTప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీత్యా సినిమా రంగంలో కొనసాగుతున్న బండ్ల గణేష్.. రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న ఈ పాదయాత్రకు ఓ ప్రత్యేకత ఉన్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ తరఫున తెలంగాణలో క్రియాశీల రాజకీయాలు చేస్తున్న బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తిరుమల పాదయాత్ర చేస్తుండటం విశేషంగా చెబుతున్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు. 56 రోజుల పాటు జైలులో నిర్బంధించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక బండ్ల గణేష్ అప్పట్లో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమంగా విడుదలైతే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ అప్పట్లో మొక్కుకున్నారు. చంద్రబాబు విడుదలై ఏపీలో రికార్డు స్థాయి విజయం సాధించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా 19 నెలలుగా పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు.
ఈ నెల 19న బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. సాధారణంగా చాలా మంది భక్తులు పాదయాత్రగా తిరుమలకు వెళుతుంటారు. అదేవిధంగా బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నా, ఆయన నడక రాజకీయ సంచలన చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో బీజేపీతో కలిసి సాగుతున్న చంద్రబాబు అభిమానిగా బండ్ల గణేష్ పాదయాత్ర చేయడం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమానిగా చెబుతున్నారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో బండ్ల గణేష్ హైదరబాద్ తోపాటు ఏపీలో నిర్వహించిన పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చంద్రబాబు గొప్పతనాన్ని చాటిచెప్పిన బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైప్ అమాంతం పెంచేశారు. సెలబ్రెటీ హోదాలో ఆయన పాదయాత్ర చేయనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షాద్ నగర్ నుంచి తిరుమలకు సుమారు 460 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని ఆయన ఎన్నిరోజుల్లో చేరుకుంటారు? ఆయన ఒక్కరే పాదయాత్ర చేస్తారా? ఆయనకు మద్దతుగా ఇంకెవరైనా పాదయాత్ర చేస్తారా? అన్నది చూడాల్సివుంది. బండ్ల గణేష్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనేది కూడా రాజకీయ చర్చకు తావిస్తోందని అంటున్నారు.
