వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి అతి తెలిస్తే అవాక్కే
చేతిలో కూసింత అధికారం ఉంటే చాలు చెలరేగిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.
By: Garuda Media | 6 Feb 2026 12:00 PM ISTచేతిలో కూసింత అధికారం ఉంటే చాలు చెలరేగిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. తాను కోరింది ఇవ్వని చిరు వ్యాపారి మీద ఒక మున్సిపల్ ఉద్యోగి చేసిన రచ్చ గురించి తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఈ మాత్రం దానికి ఇంత చేస్తారా? అన్న విస్మయానికి గురి కాకుండా ఉండలేం. ప్రొద్దుటూరు పట్టణంలోని మొయిన్ రోడ్డులో ఉన్న ఒక హోటల్ వద్దకు వెళ్లాడో మున్సిపల్ అధికారి. వన్ బై త్రీ కాఫీ ఇవ్వాలని కోరాడు. అందుకు.. అలాంటి ఆప్షన్ తమ వద్ద లేదని హోటల్ యజమాని చెప్పాడు.
తాను అడిగినట్లు వన్ బై త్రీ కాఫీ ఇవ్వని హోటల్ యజమాని మీద తన దాష్టీకాన్ని మొదలు పెట్టాడు ఆ మున్సిపల్ ఉద్యోగి. ఫోన్ చేసి పదిహేను నిమిషాల వ్యవధిలో ప్రొక్లెయిన్ తెప్పించిన అతను.. హోటల్ ఎదురుగా ఉన్నడ్రెయిన్ మీద ర్యాంప్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు హోటల్ ఉద్యోగి.. తన షాపు ఎదురు మాదిరి పట్టణంలో చాలానే ర్యాంపులు ఉన్నాయని.. వాటిని వదిలేసి తన ఒక్క హోటల్ మీదనే ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ సదరు అధికారి తన మకుంపట్టుతో ర్యాంప్ ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో సదరు హోటల్ యజమాని రోడ్డు మీద పడుకొని.. తన మీదుగా ప్రొక్లెయిన్ ను పోనిచ్చి ర్యాంప్ ను తొలగించాలంటూ నిరసనకు దిగారు. ఈ వివాదాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. అది కాస్తా వైరల్ గా మారటంతో పై అధికారులు స్పందించారు. దీంతో.. వన్ బై త్రీ కాఫీకి ఆర్డర్ ఇచ్చిన నో చెప్పించుకున్న అధికారి కాస్త దిగివచ్చి.. తొలగింపు ప్రక్రియను విరమించారు.ప్రొద్దుటూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా.. హాట్ టాపిక్ గా మారింది. సదరు మున్సిపల్ ఉద్యోగి అతి చర్చనీయాంశంగా మారింది.
