జెన్ జీ అంటే బీజేపీకి వ్యతిరేకమా...నిజమెంత ?
జెన్ జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన తరం. వారు ఆధునిక సాంకేతిక విజ్ఞానం మధ్య పెరిగారు.
By: Satya P | 30 July 2026 11:45 PM ISTజెన్ జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన తరం. వారు ఆధునిక సాంకేతిక విజ్ఞానం మధ్య పెరిగారు. సోషల్ మీడియా యుగంలో కాలం గడుపుతున్నారు. వారంతా ఎక్కువగా టెక్నాలజీ స్రవంతిలో నడుస్తున్నారు. వారి ఆలోచనలు భావోద్వేగాలు వేరుగా ఉంటాయని విశ్లేషిస్తారు. దూకుడు స్వభావం వారి సొంతం. తాము ఏది అనుకుంటే అది తొందరగా జరిపోవాలని భావిస్తారని అంటారు. ఇక పాతకాలం ఆలోచనలు సిద్ధాంతాలకు వారు వ్యతిరేకం అన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తూంటారు. ఈ రోజున దేశంలో 20 శాతం దాకా జెన్ జీ జనాభా ఉంది. అంటే మొత్తం దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే దాదాపుగా ముప్పయి కోట్లు దాకా జనాభా పాతికేళ్ళ ఏజ్ కలిగిన వారే అని గణాంకాలు నివేదిస్తున్నాయి.
బీజేపీ మీదకు అలా :
ఇక కేంద్రంలో అధికారంలో ఈ రోజున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ మీద యువత భగ్గుమంది అంతే పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగాయి. దాంతో వారంతా సహజంగానే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. ఆగ్రహం ప్రదర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాని మీద కేంద్రం కూడా దిగి వచ్చి చర్యలు తీసుకుంది. ఇందులో జెన్ జీ యువత ఎక్కువగా పాల్గొన్నారు కాబట్టి వారంతా బీజేపీకి వ్యతిరేకం అన్న అభిప్రాయం వ్యాప్తి అవుతోంది. నిజంగానే అలా ఉందా అంటే దాని మీద లోతిన చర్చ సాగుతోందిపుడు.
ప్రియాంకా ఏమన్నారంటే :
లోక్‌సభలో నీట్ పేపర్ లీక్, నిరుద్యోగంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేవలం కెమెరా కోణాలు మార్చి జెన్ జీ యువతను ఆకట్టుకోలేరని బీజేపీ పెద్దల తీరు మీద వ్యాఖ్యానించారు. జెన్ జీ అంటే బీజేపీకి ప్రత్యక్షంగా వ్యతిరేకం కాదని ఆమె అంటూనే మోసాలను గుర్తించగల ఈ యువత నమ్మకాన్ని పొందాలంటే ప్రధాని మోదీ తన హృదయ కోణాన్ని మార్చుకోవాలని ఆమె సూచించారు. సోషల్ మీడియా రీల్స్ కోసం కెమెరా యాంగిల్స్ మార్చడం ద్వారా యువత విశ్వాసాన్ని తిరిగి పొందలేరని ప్రియాంకా గాంధీ సెటైర్లు వేశారు. ఇటీవల కాలంలో మోడీ ఎక్కువగా వీడియోలు పెడుతున్నారు. దాని మీద ఆమె ఈ రకంగా కామెంట్స్ చేశారు అన్న మాట. విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా నిలదీశారు. జెన్ జీ తరానికి ప్రభుత్వ లోపాలు స్పష్టంగా తెలుసని అందువల్ల కేవలం ఆర్భాటపు ప్రచారాలు పనిచేయవని ప్రియాంకా గాంధీ విమర్శించారు.
కాషాయ జెర్సీపై వివాదం :
మరో వైపు భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో ప్రపంచకప్ కోసం కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపైన కూడా ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. జెర్సీ మార్పు ఒక్కటే కాదని చరిత్రను మార్చే ప్రయత్నాలు ఎన్ని జరిగినా దేశ యువత తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని రకాలుగా మార్పులు చేసినా దేశ ఆత్మను మాత్రం మార్చలేరని అన్నారు. ఇదే సందర్భంలో ఆమె మరోసారి జెన్ జీ యువత అభిప్రాయాలు ఏంటో చెప్పారు. జంతర్‌మంతర్‌లో యువత వ్యక్తం చేసిన అభిప్రాయాలే దేశ స్వరమని చెప్పారు. ఇలా ప్రియాంక రెండు వేరు వేరు సందర్భాలలో జెన్ జీ యువత భావాలు ఇవీ అంటూ చేసిన కామెంట్స్ బీజేపీకి వ్యతిరేకం అన్నట్లుగానే వ్యాప్తి చెందుతున్నాయి.
దేశ భక్తి దైవ భక్తి :
జెన్ జీ తరం అయినా మరో తరం అయినా ఈ దేశంలో కాలంతో పాటు ఎపుడూ కొత్త తరం అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. అంత మాత్రం చేత దేశ భక్తి దైవ భక్తి వారిలో లేవని అర్ధమా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఎక్కువ ఆస్తికత్వం కొత్త తరం యువతలోనే కనిపిస్తోందని దానికి గుళ్ళూ గోపురాలు సాక్ష్యమని కూడా ఉదహరిస్తున్నారు. అంతే కాదు దేశం కోసం ఎక్కువగా నినదించే గొంతుకలు కూడా వారే అని కూడా గుర్తు చేస్తున్నారు. జెన్ జీ తరం అన్యాయాన్ని అక్రమాన్ని సహించేదిగా ఉండదని అది ఈ రోజున అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, రేపటి రోజున కాంగ్రెస్ వచ్చినా వారి తిరుగుబాటు ఇదే తీరున దూకుడుగా ఉంటుందని అంటున్నారు.
