ప్రియాంక గాంధీ ఇంట సందడి.. కుమారుడి నిశ్చితార్ధం ఎవరితో అంటే..!
అవును... ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
By: Raja Ch | 30 Dec 2025 4:19 PM ISTదేశ రాజధానిలో రసవత్తరమైన రాజకీయ సందడి నడుస్తోన్న నడుమ.. ఒక ప్రైవేటు ఫ్యామిలీ వేడుకకు నిశ్శబ్ధంగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రాకు నిశ్చితార్ధం జరిగిందనే విషయం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇన్ స్టా లోని ఓ పోస్ట్ ఈ విషయాన్ని దాదాపు కన్ ఫాం చేసిందని అంటున్నారు.
అవును... ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... తన స్నేహితురాలు అవీవా బేగ్ తో రెహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ దిగిన ఫొటోను అవీవా తన ఇన్ స్టా స్టోరీస్ లో పంచుకుంటూ.. అదే ఫొటోను హైలైట్స్ సెక్షన్ లో ఉంచడం దీనికొక సంకేతం అని అంటున్నారు.
ఈ క్రమంలో.. రెహాన్ - అవీవా ఏడేళ్లుగా స్నేహితులని.. ఈ క్రమంలో ఇటీవల అవీవా ముందు రెహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చారని.. అందుకు ఆమెతో పాటు ఇరు కుటుంబాలు అంగీకరించాయని.. ఈ నేపథ్యంలోనే నిశ్చితార్ధం జరిగిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై అటు గాంధీ, ఇటు వాద్రా కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకూ రాలేదు!
న్యూఇయర్ వేడుకలతో పాటు నిశ్చితార్ధం!:
మరోవైపు రెహాన్ - అవీవా వివాహం చేసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని.. అయితే వారికి ఇంకా నిశ్చితార్ధం జరగలేదని.. గాంధీ కుటుంబంతో చాలా కాలంగా అనుబంధం ఉన్న రాజస్థాన్ లో ఈ నిశ్చితార్థం రెండు నుండి మూడు రోజుల పాటు నిరాడంబరంగా.. నూతన సంవత్సరంలో జరిగే అవకాశం ఉందనే వెర్షన్ కథనాలు కూడా జాతీయ మీడియాలో వస్తున్నాయి.
అయితే.. ఫ్యామిలీ షెడ్యూల్ లకు అనుగుణంగా తేదీలను ఖరారు చేస్తారని.. ఈ సమయంలో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో ఢిల్లీ నుండి సవాయి మాధోపూర్ చేరుకున్నారని.. అక్కడ నూతన సంవత్సర వేడుకలతో పాటు అవివా – రెహన్ నిశ్చితార్థానికి సంబంధించిన వేడుకలు జరగనున్నాయని అంటున్నారు.
జంట గురించి కొన్ని విషయాలు!:
రెహాన్ వాద్రా.. వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్ లో 'డార్క్ పర్సెప్షన్' పేరుతో తన తొలి ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇదే క్రమంలో... అవీవా కూడా ఫొటోగ్రాఫరే కావడం గమనార్హం. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసిన ఆమె.. ఓ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ తొలుత ప్రొఫెషనల్ సర్కిల్స్ లో కలుసుకున్నట్లు చెబుతున్నారు.
