ముగిసిన సస్పెన్స్: ఒక్కటైన చిన్ననాటి స్నేహితులు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా తన కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం వేడుకను అధికారికంగా ధ్రువీకరించారు.
By: A.N.Kumar | 3 Jan 2026 3:25 PM ISTకాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా తన కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం వేడుకను అధికారికంగా ధ్రువీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తను పంచుకుంటూ.. రేహాన్, అవీవాలు చిన్నప్పటి నుంచే ప్రాణమిత్రులని, ఆ స్నేహమే ఇప్పుడు పెళ్లి బంధంగా మారుతోందని పేర్కొన్నారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రియాంకా గాంధీ తనయుడు రేహాన్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను నిజం చేస్తూ రేహాన్ తన చిన్ననాటి స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రకటించారు.
ఈ వేడుక రాజస్థాన్‌లోని ప్రసిద్ధ రణతంబోర్‌లో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. హంగూ ఆర్భాటాలకు దూరంగా, కేవలం ఇరు కుటుంబాల మధ్యే ఈ ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా సహా గాంధీ కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం రేహాన్, అవీవా గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పరిచయం మాత్రం చిన్నప్పటి నుంచే ఉంది. ఇటీవల రేహాన్ తన ప్రేమను వ్యక్తపరచగా.. అవీవా వెంటనే అంగీకరించింది. మరో కొన్ని నెలల్లోనే వీరి వివాహం ఘనంగా జరగనుంది.
ఈ జంట మధ్య మరో ఆసక్తికరమైన సామీప్యం ఉంది. ఇద్దరికీ విజువల్ ఆర్ట్స్ , ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఈయన ఒక ప్రతిభావంతమైన విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్ , కమర్షియల్ ఫొటోగ్రఫీలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అవీవా కూడా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ఆమె ఒక ఫొటోగ్రఫిక్ స్టూడియోతో పాటు, ఒక ప్రొడక్షన్ కంపెనీకి కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.
తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను రేహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. "చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు జీవిత భాగస్వాములు కాబోతుండటం చాలా ముచ్చటగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట వివాహ వేడుక వచ్చే ఏడాది వేసవిలో లేదా చివరలో జరిగే అవకాశం ఉందని సమాచారం.
