రాహుల్ ప్లేస్ తీసుకోవమ్మా: ప్రియాంకకు నెటిజన్ల మద్దతు
కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు.. పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరు .. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు.. అదేసమయంలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్న తీరు వంటివి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
By: Garuda Media | 17 Dec 2025 12:00 AM ISTకాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు.. పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరు .. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు.. అదేసమయంలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్న తీరు వంటివి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే.. రాహుల్, సోనియా గాంధీలే అన్నట్టుగా పార్టీలో చర్చ ఉంది. ఇక, పార్లమెంటులోనూ వారే మాట్లాడుతున్నారు. అయితే.. కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ప్రియాంక గాంధీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న తీరు, లేవనెత్తుతున్న అంశాలు.. ప్రధాని నరేంద్ర మోడీపై సూటిగా చేస్తున్న విమర్శలు వంటివి పెద్ద ఎత్తున తటస్థులను కూడా ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా.. పార్లమెంటులో జరిగే చర్చల్లో ఆవేశం, ఆగ్రహం వంటివి ప్రతిపక్ష సభ్యు ల్లో కామన్. రాహుల్‌గాంధీ ప్రసంగించినప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ప్రియాంక గాంధీ తాజా సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరు.. బీజేపీ నాయకుల్లోనే చర్చకుదారితీసేలా ఉండడం గమనార్హం.
ఆమెను కూడా రెచ్చగొట్టేందుకు కొందరు బీజేపీ ఎంపీలు ప్రయత్నించి విఫలమయ్యారు. అదేసమయం లో తన ముత్తాత(నెహ్రూ) నుంచి నాయనమ్మ(ఇందిర) , తండ్రి (రాజీవ్) వరకు ప్రదాని మోడీ విమర్శించి నప్పుడు కూడా ప్రియాంక సంయమనం కోల్పోకుండా.. ఎదురు దాడి చేశారు.
``మీరు ఏ ఉద్దేశంతో ఈ చర్చ పెట్టారో.. మాకేకాదు.. ఈ దేశానికి కూడా తెలుసు. మీరు మా ముత్తాతను, నానమ్మను.. నా తండ్రిని కూడా తిట్టాలని అనుకున్నారు. తిట్టండి. మీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయో.. అన్నీ అనండి. ఈ రోజు సమయం చాలకపోతే.. మరో రోజు కూడా ఈ చర్చ పొడిగించండి. అనంతరం.. ప్రజల సమస్యలపై చర్చించండి.`` అని ప్రియాంక చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఇదొక్కటే కాదు.. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడంపైనా అంతే సంయమనంగా చురకలు అంటిం చారు. ఇక, రాంలీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలోనూ ఆచితూచి విమర్శలు గుప్పించారు తప్ప.. ఎక్కడా పరుషంగా ఒక్క మాట కూడా అనలేదు. మొత్తంగా.. ప్రియాంక వ్యవహార శైలిపై నెటిజన్లు, తటస్థ నాయకులు , మేధావులు కూడా అచ్చరువొందుతున్నారు. రాహుల్ బాధ్యతలను ప్రియాంకకు ఇవ్వాలని కొందరు నెటిజన్లు సూచించడం గమనార్హం.
