మోడీ, అమిత్ షాలపై ప్రియాంక విమర్శల తుపాన్.. ఇది వేరే లెవెల్!
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో రెండో రోజు మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది.
By: Raja Ch | 30 July 2025 1:06 AM ISTఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో రెండో రోజు మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన స్టేట్ మెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అవును... ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... రక్షణ మంత్రి గంటసేపు మాట్లాడారని.. అధికార పార్టీ ఎంపీలూ మాట్లాడారని.. ప్రతిదాని గురించి మాట్లాడారని.. అయితే, 2025 ఏప్రిల్ 22న వారి కుటుంబ సభ్యుల ముందే 26 మంది మరణించినప్పుడు, ఈ దాడి ఎలా జరిగింది? అనేది మాత్రం చెప్పలేదని మొదలుపెట్టారు.
భద్రతా లేదు.. ప్రథమచికిత్సా లేదు!:
అనంతరం... పర్యాటక ప్రాంతంలో ఒక్క సైనికుడిని కూడా ఎందుకు మోహరించలేదు.. ? ప్రతి రోజూ 1,000 - 1,500 మంది అక్కడికి వెళతారని ప్రభుత్వానికి తెలియదా..? ప్రజలు అక్కడికి ప్రభుత్వాన్ని నమ్మిన తర్వాత వెళ్ళారు.. అయితే, ప్రభుత్వం మాత్రం వారిని దేవుని దయకు వదిలివేసింది.. అక్కడ భద్రతా లేదు, ప్రథమచికిత్సా లేదు అంటూ వయనాడ్ ఎంపీ విరుచుకుపడ్డారు.
ఇదే సమయంలో... దాడికి రెండు వారాల ముందు, హోం మంత్రి కాశ్మీర్ కు వెళ్లి ఉగ్రవాదం ఓడిపోయిందని చెప్పారని.. అయితే, దాడి జరిగిన మూడు నెలల తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ... బైసారన్ లోయలో భద్రతా లోపానికి తాను బాధ్యత వహిస్తానని చెబుతున్నారని.. అంటే... ఆ విషయం అక్కడితో ముగిసింది. ఇక ఎవరూ దానిపై ప్రశ్నించొద్దనా అని నిలదీశారు!
26/11 ఘటనలో ఆ విషయాలు మరిచారా?:
ఈ సందర్భంగా... అధికార పార్టీ నాయకులు ముంబైలో జరిగిన 2008 దాడుల (26/11) గురించి మాట్లాడారని.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారని మొదలుపెట్టిన ప్రియాంక... ఆ రోజు ఒకరిని తప్ప మిగతా ఉగ్రవాదులందరినీ కాల్చి చంపారనే విషయం తెలియాలని.. మిగిలిన ఉగ్రవాదిని 2012లో ఉరితీశారని గుర్తు చేశారు.
అదేవిధంగా... 26/11 ఘటనకు బాధ్యత వహిస్తూ... మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేశారని.. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేశారని.. నాడు వారంతా ఈ దేశ ప్రజల పట్ల జవాబుదారీతనం కలిగి ఉన్నారని ప్రియాంక స్పష్టం చేశారు.
క్రెడిట్ మాత్రమే కాదు.. బాధ్యత కూడా తీసుకోవాలి!:
ఇదే క్రమంలో.. ఏప్రిల్ 22న ఏం జరిగిందో దేశం తెలుసుకోవాలనుకుంటోందని చెప్పిన ప్రియాంక గాంధీ... ప్రభుత్వ పెద్దలు మాత్రం భుజాలు తట్టుకోవడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేసింది. మన దేశంపై దాడి జరిగితే.. ఈ సభలోని ప్రతి ఒక్కరూ, ఏ పార్టీ వారైనా, ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా... ధైర్యంగా పోరాడినందుకు మన దళాలను చూసి తాము గర్విస్తున్నామని అన్నారు. అయితే... ఆపరేషన్ సిందూర్ క్రెడిట్ ను ప్రధానమంత్రి తీసుకోవాలని కోరుకుంటున్నారని.. నాయకత్వం అంటే కేవలం క్రెడిట్ తీసుకోవడం మాత్రమే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా... ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, మణిపూర్ కాలిపోయిందని తెలిపారు.
ట్రంప్ ప్రకటన.. మోడీ బాధ్యతారాహిత్యానికి సంకేతం!:
మరోవైపు... ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముందుగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రియాంక ప్రస్థావించారు. ఈ సందర్భంగా... ప్రధానమంత్రి బాధ్యతారాహిత్యానికి ఇది అతిపెద్ద సంకేతం అని అన్నారు.
అసలు యుద్ధాన్ని ఎందుకు ఆపారు?:
ఈ సందర్భంగా... జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల విషయాలతోపాటు తన తల్లి సోనియా గాంధీ కన్నీరు పెట్టిన విషయంపై అమిత్ షా మాట్లాడారని చెప్పిన ప్రియాంక గాంధీ... శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో మాత్రం ఆయన చెప్పలేదని అన్నారు. ఇలా ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారని తెలిపారు.
ఈ ప్రభుత్వానిది రాజకీయ పిరికితనం!:
ఇదే సమయంలో... ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని.. అది రాజకీయ పిరికితనమని.. వారికి ప్రజల పట్ల జవాబుదారీతనం లేదని.. వారిది అంతా రాజకీయమే అని నిప్పులు చెరిగిన ప్రియాంక... పహల్గాంలో జరిగినది అందరినీ బాధించిందని, అందరితోనూ కన్నీరు పెట్టించిందని తెలిపారు.
ఇక... ఈ సభలోని ప్రతి ఒక్కరికీ భద్రత ఉందని.. మనం ఎక్కడికి వెళ్ళినా భద్రతా సిబ్బంది మనతో పాటు వస్తారని.. కానీ, ఆ రోజు 26 మంది తండ్రులు, భర్తలు, కుమారులు మరణించారని.. వారిలో ఎవరికీ ఎటువంటి భద్రత లేదని చెప్పిన ప్రియాంక గాంధీ.. మీరు ఎన్ని ఆపరేషన్లు చేసినా.. దాన్ని మార్చలేరు, వారిని రక్షించలేదు అని అన్నారు.
