ప్రియాచౌదరీని ఇకపై మాస్క్ లేకుండా చూడలేమా..?
ప్రియాచౌదరి ఫ్యామిలీలో అంతా జేడీయూలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో భాగంగా... ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి.. జేడీయూ పార్టీ మాజీ శాసనసభ్యుడు కాగా.. ఆమె తాత ఉమాకాంత్ చౌదరీ.. నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు.
By: Raja Ch | 15 Nov 2025 4:00 AM ISTసాధారణంగా దేశంలో ఎన్నికల వేళ సవాళ్లు, ప్రతి సవాళ్లు. ప్రతిజ్ఞలు కామన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ సారి ఓటమి పాలైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఒకరంటే.. ఎన్నికల్లో గెలిచే వరకూ గడ్డం తీయనని మరొకరు.. ఇలా రకరకాల స్టేట్ మెంట్లు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఫ్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియాచౌదరి వ్యవహారం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది! మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచేవరకూ ఫేస్ మాస్క్ తీయనని చెప్పిన పుష్పమ్ ప్రియాచౌదరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.
దర్భంగా నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె.. ఎనిమిదో స్థానానికి పరిమితమైన పరిస్థితి. దీంతో... ఆమె అన్నమాట ప్రకారం ఇకపై నిత్యం మాస్క్ లోనే కనిపిస్తారా.. లేక, మాట తీసి గట్టున పెడతారా అనేది వేచి చూడాలి.
ఫ్యామిలీ అంతా జేడీయూలో.. ఆమె మాత్రం ప్రత్యేకం!:
ప్రియాచౌదరి ఫ్యామిలీలో అంతా జేడీయూలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో భాగంగా... ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి.. జేడీయూ పార్టీ మాజీ శాసనసభ్యుడు కాగా.. ఆమె తాత ఉమాకాంత్ చౌదరీ.. నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు. ఇదే క్రమంలో ఆమె అంకుల్ వినయ్ కుమార్ కూడా జేడీయూలోనే ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బేణిపూర్ నుంచి గెలిచారు. అయితే ఈమె మాత్రం ప్రత్యేకంగా పార్టీని స్థాపించారు.
ఇందులో భాగంగా... 2020లో "ద ఫ్లూరల్స్ పార్టీ" ని స్థాపించిన ప్రియా చౌదరి.. విజిల్ గుర్తుపై 243 నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. రెగ్యులర్ గా బ్లాక్ డ్రెస్, బ్లాక్ మాస్క్ లో కనిపించే ఆమె.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు! 2020 ఎన్నికల్లోనూ ఆమె పార్టీ నుంచి 148 స్థానాల్లో పోటీ చేసి, ఓటమి పాలయ్యారు.
ఎనిమిదో స్థానానికి పరిమితం!:
బీహార్ లోని దర్భంగా స్థానం నుంచి ప్రియాచౌదరి పోటీ చేశారు. అయితే ఈ స్థానం నుంచి బీజేపీకి చెందిన సంజయ్ సరోగి 97,453 ఓట్లతో విజయం సాధించగా... ఆ తర్వాత స్థానంలో వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ఉమేష్ సహానీ 72,860 ఓట్లతో నిలిచారు. ఇక.. ప్రియాచౌదరి కేవలం 1,403 ఓట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు!
