ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల భద్రత.. మానవహక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు
దేశంలో ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్న ప్రైవేటు బస్సు ప్రమాదాలపై జాతీయ మానవహక్కుల వేదిక తీవ్రంగా స్పందించింది.
By: Tupaki Political Desk | 29 Nov 2025 5:59 PM ISTదేశంలో ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్న ప్రైవేటు బస్సు ప్రమాదాలపై జాతీయ మానవహక్కుల వేదిక తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. సుదూర ప్రాంతాల మధ్య తిరుగుతున్న బస్సులలో భద్రతా చర్యలకు పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదని మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో బస్సు దహనమైన తర్వాత వరుసగా అలాంటి ప్రమాదాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్లీపర్ బస్సులను తక్షణం పక్కన పెట్టాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మానవహక్కుల కమిషన ఆదేశాలు జారీ చేసింది.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇటీవల ఘోర ప్రమాదాలు సంభవించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం, అత్యవసర ద్వారాలను మూసేసి అగ్నిప్రమాదం జరిగితే నియంత్రించే పరికరాలు లేకుండా ఇష్టానుసారం బస్సులను మార్చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా అధికారులు నివేదికలు రూపొందించారు. దీంతో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం సురక్షితం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే, దాదాపు వెయ్యి వరకు బస్సులు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.
దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. ఏపీ, తెలంగాణయే కాకుండా దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను తక్షణం నిలిపేయాలని సూచించింది. ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో 50 శాతానికి పైగా స్లీపర్ ఏసీ బస్సులు ఉంటున్నాయి. వీటి లోపల మార్గం ఇరుగ్గా ఉంటోంది. అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయకు వచ్చే అవకాశం ఉండటం లేదు. అదేవిధంగా బస్సుల్లో ఉండాల్సిన ఫైర్ ఫైటర్ సామగ్రి ఉండటం లేదని అంటున్నారు.
ట్రావెల్ సంస్థలకు చెందిన బస్సులపై అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఇష్టం వచ్చినట్లు బస్సుల్లో మార్పులు చేస్తున్నారు. అత్యావసర ద్వారాన్ని సైతం మూసేసి సీట్లు పెడుతుండటం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ఏమాత్రం భద్రత ఉండటం లేదు. ఇదే సమయంలో స్లీపర్ బస్సులో లగేజీ క్యారియర్ బస్సు దిగువ భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రమాదకర, అగ్గి రాజుకోడానికి కారణమయ్యే సరకులను రవాణా చేస్తున్నారు. దీనివల్ల ఏ చిన్న ప్రమాదం జరిగినా నష్టం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మానవహక్కుల కమిషన్ సూచనలతో నిబంధనలను ఉల్లంఘించిన బస్సులు అన్నీ తక్షణం నిలిపివేయాల్సి ఉంటుందని అంటున్నారు.
