సె*క్స్ కుంభకోణం.. ఆ యువరాజు జీవితాన్ని ఇలా మార్చింది!
అవును... అమెరికాలో తీవ్ర సంచలనంగా మారిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఇటీవల బయటకువచ్చిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 18 Oct 2025 12:14 PM ISTఅమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో తనకున్న సంబంధాల గురించి మరిన్ని విషయాలు వెల్లడైన నేపథ్యంలో.. తన సోదరుడు కింగ్ చార్లెస్ ఒత్తిడితో యూకే ప్రిన్స్ ఆండ్రూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... రాయల్ టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్' ను వదులుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అవును... అమెరికాలో తీవ్ర సంచలనంగా మారిన సె*క్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఇటీవల బయటకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదులుకున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ - 3 ఒత్తిడి మేరకు ఆయన తన బిరుదును వదులుకున్నట్లు కథనాలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఇకపై తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనని తెలిపారు. బ్రిటన్ రాజు చార్లెస్ తోనూ, తమ కుటుంబసభ్యులతోనూ చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తనపై వస్తున్న ఆరోపణల వల్ల రాజ కుటుంబ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం అని వెల్లడించారు.
ఇదే సమయంలో తాను ఎప్పటిలాగే, నా కుటుంబం, నా దేశం పట్ల నా కర్తవ్యాన్ని మొదటి స్థానంలో ఉంచాలని నిర్ణయించుకున్నాను అని బకింగ్ హామ్ ప్యాలెస్ పంపిన ఒక ప్రకటనలో ఆండ్రూ అన్నారు. ఇదే సమయంలో తనపై వచ్చిన, కొనసాగుతున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఎప్ స్టీన్ కుంభకోణం మధ్య 2019లో ప్రజా జీవితం నుండి వైదొలిగిన ఆండ్రూ.. దివంగత రాణి ఎలిజబెత్ - 2 రెండవ కుమారుడు అయినందువల్ల యువరాజుగానే కొనసాగుతారు. కానీ ఆమె అతనికి ప్రదానం చేసిన 'డ్యూక్ ఆఫ్ యార్క్' బిరుదును మాత్రం ఇకపై కలిగి ఉండడు. 1348 నాటి బ్రిటిష్ గౌరవ వ్యవస్థలో అత్యంత సీనియర్ నైట్ హుడ్ అయిన ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది గార్టర్' సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు... ఆండ్రూ మాజీ భార్య సారా ఫెర్గూసన్ కూడా ఇకపై 'డచెస్ ఆఫ్ యార్క్' బిరుదును ఉపయోగించరు, అయినప్పటికీ అతని కుమార్తెలు బీట్రైస్, యూజీని యువరాణులుగా కొనసాగుతారని యూకే మీడియా నివేధించింది!
కాగా... ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. అతడు.. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసు పత్రాలలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా సుమారు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి!
