రాష్ట్రపతి కోసం రైల్ కాన్వాయ్.. ఒడిశాలో ప్రెసిడెంట్ స్పెషల్ ట్రీట్
మొత్తం పది బోగీలు ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక రైలుకు ముందు ఒక ట్రైన్, వెనుక మరో ట్రైన్ (పైలట్ ట్రైన్స్) ఎస్కార్ట్‌గా నడిపారు.
By: Tupaki Political Desk | 5 Aug 2026 3:02 PM ISTరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో చేపట్టిన రైలు ప్రయాణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా దేశాధ్యక్షులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాలు లేదా ప్రత్యేక హెలికాప్టర్లను ఆశ్రయించడం ఆనవాయితీ. కానీ, అందుకు భిన్నంగా రాష్ట్రపతి కేవలం 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రత్యేక రైలును ఎంచుకోవడమే చర్చనీయాంశం అవుతోంది. ఇక రాష్ట్రపతి భద్రత కోసం రైలుకు ముందు, వెనుక మరో రెండు పైలట్ (ఎస్కార్ట్) ట్రైన్లు నడపడంతో తాజా పర్యటన విశేషంగా చెబుతున్నారు. ఇదే సమయంలో 'ప్రెసిడెంట్ స్పెషల్' రైలు విశేషాలపై నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
వర్షం తెచ్చిన మార్పు
మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన స్వస్థలమైన ఒడిశాకు వెళ్లారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భువనేశ్వర్ నుంచి బెర్హంపూర్‌కు ఆమె విమానంలో వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు, భారీ వర్షాల సూచన కారణంగా ఆఖరి నిమిషంలో విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి కోసం ఒక ప్రత్యేక లగ్జరీ రైలును ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రయాణంలో రాష్ట్రపతితో పాటు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ కూడా ఉన్నారు. భువనేశ్వర్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఈ ప్రత్యేక రైలు రెండు గంటల్లో, అంటే ఉదయం 11 గంటలకు బెర్హంపూర్‌కు చేరుకుంది.
ఏంటీ 'ప్రెసిడెంట్ స్పెషల్' ప్రత్యేకతలు?
రాష్ట్రపతి ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు సాధారణమైనది కాదని చెబుతున్నారు. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ రైలు బోగీ. ఇందులో అత్యాధునిక ఏసీ బెడ్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్-కమ్-డైనింగ్ రూమ్, ప్రత్యేక వంటగది వంటి సకల వసతులు ఉన్నాయి. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ప్లాట్‌ఫాం నుంచి నేరుగా కోచ్ వరకు రైల్వే అధికారులు ఎర్రటి కార్పెట్ పరిచి ఘన స్వాగతం పలికారు. ఇక దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రయాణించడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
మొత్తం పది బోగీలు ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక రైలుకు ముందు ఒక ట్రైన్, వెనుక మరో ట్రైన్ (పైలట్ ట్రైన్స్) ఎస్కార్ట్‌గా నడిపారు. అంతేకాకుండా రాష్ట్రపతి ప్రయాణించే సమయంలో ఆ మార్గంలో మరే ఇతర సాధారణ రైళ్లను అనుమతించలేదని చెబుతున్నారు. ఇక భువనేశ్వర్, బెర్హంపూర్ రైల్వే స్టేషన్లలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, జాగిలాలతో తీవ్ర తనిఖీలు చేపట్టారు. జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాల కమాండోలు కూడా ఈ రైలులో ప్రయాణించారు. రెండు స్టేషన్ల పరిధిలో సుమారు 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది తొలిసారా?
రాష్ట్రపతి హోదాలో ముర్ము రైలు ప్రయాణం చేయడం ఇదేం మొదటిసారి కాదని చెబుతున్నారు. గతంలో 2025 సెప్టెంబర్ లోనూ ఆమె ఢిల్లీ నుంచి బృందావన్‌లోని ప్రసిద్ధ బంకే బిహారీ ఆలయాన్ని దర్శించేందుకు 'మహారాజా ఎక్స్‌ప్రెస్' లగ్జరీ రైలులో ప్రయాణించారని చెబుతున్నారు. అప్పట్లో 18 బోగీలున్న ఆ విలాసవంతమైన రైలులో 12 కోచ్‌లను రాష్ట్రపతి సిబ్బంది కోసం కేటాయించారు. అంతకుముందు, నవంబర్ 2023లో తన సొంత జిల్లా మయూర్‌భంజ్‌లోని బాదాంపహాడ్ రైల్వే స్టేషన్ నుంచి కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించి, ఉదరబెడా సమీపంలోని రైరాంగ్‌పూర్ వరకు స్వయంగా రైలు ప్రయాణం చేశారు.
దేశ తొలి అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ సైతం తన తొలి రోజుల్లో రైలు ప్రయాణాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారని చెబుతున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ద్రౌపది ముర్ము అప్పుడప్పుడు ఇలా రైలు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇక ఒడిశాలో రాష్ట్రపతి ప్రయాణించిన ఈ రైలు మార్గంలో సుమారు 100 కిలోమీటర్ల మేర ఉన్న సెక్షన్ బ్రిటిష్ కాలం నాటిదని చెబుతున్నారు. 1896లో ఇక్కడ రైల్వే నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రఖ్యాత చిలకా సరస్సు మీదుగా సాగే ఈ సుందరమైన మార్గంలో ప్రయాణించడం ప్రయాణికులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.
