Begin typing your search above and press return to search.

మొన్న గ్యాసు.. నేడు పెట్రోల్‌.. బాదుడు!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం ప్ర‌భావం.. భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. వంట గ్యాస్ స‌మ‌స్య లు వెంటాడుతూనే ఉన్నాయి

By:  Garuda Media   |   20 March 2026 10:56 PM IST
మొన్న గ్యాసు.. నేడు పెట్రోల్‌.. బాదుడు!
X

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం ప్ర‌భావం.. భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. వంట గ్యాస్ స‌మ‌స్య లు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గృహ వినియోగ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను ఇటీవ‌ల రూ.60 చొప్పు న పెంచారు. ఇక‌, వాణిజ్య సిలిండ‌ర్ల స‌మ‌స్య‌లు.. ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో ప‌లు హోట‌ళ్లు ఇంకా మూత లోనే ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధ‌ర‌లు కూడా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇది ప్రీమియం పెట్రోల్‌కే ప్ర‌స్తుతం ప‌రిమితం చేశారు.

ప్రీమియం పెట్రోల్ ధ‌ర‌ల‌ను లీట‌రుకు 2 రూపాయ‌ల 10 పైస‌ల‌ నుంచి 2 రూపాయ‌ల 35 పైస‌ల వ‌ర‌కు పెంచారు. దీనికి వ్యాట్ అద‌నం. సో.. మొత్తంగా లీట‌రు పెట్రోలుకు 2 రూపాయ‌ల 50 పైస‌లు చొప్పున పెర‌గ‌నుంది. ఇక‌, సాధార‌ణ పెట్రోలుకు ఈ ధ‌ర‌లు వ‌ర్తించ‌వని పెట్రోలియం సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఇక‌, ప్రీమియం డీజిల్ ఏకంగా లీట‌రుకు 22 రూపాయ‌లు పెంచారు. ఈ ప్ర‌భావం అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌పైనా ప‌డ‌నుంది. త‌ద‌నుగుణంగా ప్ర‌జ‌లు వినియోగించే వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

ప్రీమియం వాడేది 42 శాతం!

ఇక‌, ప్రీమియం పెట్రోలేక‌దా.. ధ‌ర‌లు పెంచారు.. అని అనుకుంటే పొర‌పాటే. ఇక్క‌డే అస‌లైన గిమ్మిక్కు ఉంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 42 శాతం మంది బైకులు.. కార్ల య‌జమానులు ఇంజ‌న్ల మ‌న్నిక‌, మైలేజీ ఎక్కువ‌గా వ‌స్తుంద‌న్న కార‌ణంగా.. ప్రీమియం పెట్రోల్‌నే వినియోగిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం వీరిపై భారం ప‌డుతుంది. అయితే.. ఇక్క‌డ మ‌రో గిమ్మిక్కు ఏంటంటే.. పెరిగిన ప్రీమియం పెట్రోల్‌నే బంకుల య‌జ‌మానులు ఆర్డ‌ర్ ఇవ్వ‌నున్నారు.

త‌ద్వారా సాధార‌ణ పెట్రోల్ స్థానంలో ప్రీమియంనే వినియోగించ‌నున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా సాధార‌ణ పెట్రోల్ బ్లాక్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి ప్రీమియం పెట్రోలు మాత్ర‌మే ఉంది.. అన్న బోర్డులు బంకుల ముందు వేలాడే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు క్రూడాయిల్ దేశానికి చేరుకున్నా.. రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉంటాయి కాబ‌ట్టి.. సాధార‌ణ పెట్రోల్ ధ‌ర‌లుకూడా సుమారు 2-3 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.