అప్పుడు ఏపీ నుంచి వెళ్లగొడితే.. ఇప్పుడు తెలంగాణ నుంచి రాబడుతున్నారు!
పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో ఒకప్పుడు ఏపీ ముందుండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా.. ఈ హవా కోనసాగింది.
By: Garuda Media | 8 Nov 2025 4:53 PM ISTపెట్టుబడులు, పరిశ్రమల విషయంలో ఒకప్పుడు ఏపీ ముందుండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా.. ఈ హవా కోనసాగింది. అయితే.. ఇది 2014-19 వరకు మాత్రమే పరిమితమైంది. తర్వాత.. వచ్చిన వైసీపీ పెట్టుబడుల పై పెద్దగా దృష్టి పెట్టలేదు. `వారే రావాలి..` అన్నట్టుగా పారిశ్రామిక వేత్తలను కించ పరిచేలా వ్యవహరించిందన్న విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు.. అప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు అవకాశం ఇవ్వలేదు.
పైగా అనేక నిబంధనలు పెట్టి.. పారిశ్రామిక వేత్తలను వేధించారన్న వాదనను బలపడేలా చేశారు. ఇక, కియా వంటి సంస్థలను అప్పటి ఎంపీ ఒకరు వేధించారన్న వాదన ఉంది. దీంతో కియా విస్తరణ ప్లాంటు.. తమిళనాడుకు తరలిపోయింది. అదేవిధంగా అమరరాజా బ్యాటరీస్(టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన సంస్థ) కూడా విస్తరణకు ప్రతిపాదించినప్పుడు పెద్ద ఎత్తున వివాదం ఏర్పడింది. చివరకు.. అప్పట్లో తెలంగాణకు వెళ్లిపోయింది. విడతల వారీగా 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.
అయితే.. ఇప్పుడు ఏపీలో సర్కారు మారడంతో పరిస్థితులు కూడా మారాయి. ఒకప్పుడు ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు అదే ఏపీనివెతుక్కుని వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 5950 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట పారిశ్రామిక వాడలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 5 గిగావాట్ల సిలికాన్ ఇంగోట్, 4 గిగావాట్ల సోలార్ టాప్ కాన్ సెల్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా స్థానికంగా 1000 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నట్టు మంత్రి వివరించారు. అయితే.. ఒకప్పుడు ఏపీ నుంచి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడమే తెలిసినా.. ఇప్పుడు వస్తుండడం మాత్రం కూటమి పాలనకు అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
