తమిళ రాజకీయాలు.. కెప్టెన్ భార్య అడుగులు ఎటువైపు?
పొరుగు రాష్ట్రం తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో కూటమి రాజకీయాలు సక్సెస్ కావడంతో తమిళనాడులోనూ అదే ప్రయోగానికి విపక్షం సమాయుత్తమవుతోంది.
By: sanjesh | 11 Aug 2025 6:00 AM ISTపొరుగు రాష్ట్రం తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో కూటమి రాజకీయాలు సక్సెస్ కావడంతో తమిళనాడులోనూ అదే ప్రయోగానికి విపక్షం సమాయుత్తమవుతోంది. దీంతో రాష్ట్రంలో చిన్నాచితకా పార్టీలను కలుపుకోవాలని ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే ఎత్తులు వేస్తోంది. విపక్షానికి కౌంటరుగా డీఎంకే సైతం ఎత్తుకు పైఎత్తులు వేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ రెండు పార్టీ ఆధిపత్య పోరును క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న కొత్త పార్టీ టీవీకే సైతం ఆశ్చర్యకరమైన రీతిలో పావులు కదుపుతోంది. దీంతో ద్రవిడ నాట రాజకీయం సరికొత్త సమీకరణలకు తెరలేపుతోందని అంటున్నారు.
డీఎండీకే కీలకమా?
తమిళనాడులో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. కాంగ్రెస్ తో కలిసి మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదుపుతున్నారు. దీనికి డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో ఆయన ఇటీవల భేటీ కావడాన్ని ఉదహరిస్తున్నారు. డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత విజయకాంత్ భార్య అయిన ప్రేమలత ప్రస్తుతం ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. విజయకాంత్ మరణం తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ప్రేమలత అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో విజయానికి డీఎండీకే మద్దతు కూడా కీలకం కావడంతో అధికార పార్టీతోపాటు విపక్షం అన్నా డీఎంకే, కొత్త పార్టీ టీవీకే కూడా ప్రేమలత మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.
పొత్తుకు డీఎంకే ఓకే
రాజ్యసభ సీటును ఆశించిన ప్రేమలత తన పాత మిత్రపక్షం అన్నాడీఎంకేతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలంగా అన్నా డీఎంకేపై ప్రేమలత ఒత్తిడి చేస్తున్నా, ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఆమె ఇటీవల డీఎంకేతో టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యారని చెబుతున్నారు. 12 అసెంబ్లీ సీట్లు ఇస్తే డీఎంకే కూటమితో చేతులు కలపడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు డీఎంకే సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో డీఎంకే-డీఎండీకే మధ్య ఏ క్షణమైనా పొత్తు పొడవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రేమలతపై అన్నా డీఎంకే ఒత్తిడి
అయితే డీఎండీకే అధికార కూటమితో చేతులు కలపనుందనే ప్రచారంతో విపక్షం అన్నాడీఎంకే అలర్ట్ అయిందని అంటున్నారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శిని బుజ్జగించి 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ సభ్యుల స్థానంలో ఆమెకు సీటు ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రేమలత డీఎంకే శిబిరంలో చేరకుండా ఉండేలా మాజీ మంత్రి కేసీ వీరమణి ద్వారా రాయభారం నెరుపుతున్నారని అంటున్నారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం ప్రేమలతతో చర్చించారని చెబుతున్నారు. రాజ్యసభ స్థానంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల్లో 30 సీట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బంపరాఫర్ నచ్చడంతో డీఎంకే చర్చలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్లు చెబుతున్నారు.
టీవీకే పాచికలు
మరోవైపు డీఎండీకే ను తన వైపు తిప్పుకునేందుకు సినీ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కూడా రంగంలోకి దిగారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు గెలుపు అవకాశాలు ఉన్నచోట సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కెప్టెన్ విజయకాంత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమ పార్టీ కూటమిలో చేరాలని ప్రేమలతను విజయ్ ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ ఆఫర్ కూడా బాగుందనే ఆలోచనతో డీఎండీకే తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. మూడు వైపుల నుంచి ఒత్తిడి ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయమై ప్రేమలత గందరగోళం ఎదుర్కొంటున్నారని అంటున్నారు. విజయ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో ఆయనను వెనకేసుకు వచ్చేలా ఆమె మాట్లాడుతున్నారని అంటున్నారు. దీంతో ప్రేమలత రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. గతంలో డీఎండీకే మద్దతుతోనే అన్నా డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్న నేతలు.. డీఎండీకే మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మూడు వైపుల నుంచి ఒత్తిడి ఉండటంతో జనవరిలో జరిగే పార్టీ మహానాడులోనే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రేమలత భావిస్తున్నారని చెబుతున్నారు.
