ప్రవీణ్ ప్రకాష్ లో అంతర్మథనం ఎందుకు? ఆయన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు?
వైసీపీ హయాంలో రాజకీయ నిర్ణయాలను అమలు చేసేలా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా విడుదల చేసిన వీడియోలో అంగీకరించారు.
By: Tupaki Political Desk | 13 Nov 2025 1:00 AM ISTప్రవీణ్ ప్రకాష్.. ఏపీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్యూరోక్రసిలో పనిచేస్తూ పాపులర్ అయిన కొద్ది మంది అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ పేరు ముందుంటుంది. నిత్యం వివాదాలతో సహవాసం చేసిన ఈ ఐఏఎస్ అధికారి అనూహ్యంగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఏడాది క్రితం ఆయన వలంటరీ రిటైర్మెంటును ప్రభుత్వం ఆమోదించింది. అయితే రిటైర్మెంట్ తర్వాత ఆయనకు ఆలస్యంగా జ్ఞానోదయం అయిందనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. 1994 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాశ్ ఏడేళ్ల సర్వీసు ఉండగానే రిటైర్మెంటు తీసుకున్నారు. ఈ కారణమే ఇప్పుడు ఆయనను తీవ్ర సంఘర్షణకు గురిచేస్తోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కోపంతో రిటైర్మెంటుకు దరఖాస్తు చేసుకున్నానని, తన దరఖాస్తును వెనక్కి తీసుకుంటానని ఆయన వేడుకున్న ప్రభుత్వం అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రవీణ్ ప్రకాష్ లో మారిన మనిషి మీడియా ముందుకు వస్తున్నారు. గతంలో ఓ మీడియా చానల్ అధిపతికి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రవీణ్ ప్రకాష్.. బుధవారం ప్రత్యేకంగా సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, మరో సీనియర్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. అసలు ప్రవీణ్ ప్రకాష్ లో ఈ మార్పు ఎందుకు వచ్చింది? గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించారు. 2004-09 మధ్య విశాఖ కలెక్టరుగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అనుకూలంగా వ్యహరించారన్న ప్రచారం ఉంది. వైఎస్ ప్రోద్బలంతో అనంతర కాలంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పలు జిల్లాలకు కలెక్టర్ గా కొనసాగారు. తూర్పుగోదావరి, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనూ ఆయన కీలక బాధ్యతల్లో పనిచేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నమ్మిన బంటులా నడుచుకున్నారని ప్రవీణ్ ప్రకాష్ పై విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తన హోదాకు మించి అధికారాలు చెలాయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీఏడీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ తనకంటే సీనియర్, ఒక విధంగా బాస్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన బాధితుడిగా మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పలుమార్లు ప్రవీణ్ ప్రకాష్ పై విమర్శలు చేశారు. ఇక 2021లో స్థానిక ఎన్నికలు సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ తోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదానికి దిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి నమ్మిన బంటులా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్.. పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయించడంగా చెబుతారు. వైసీపీ హయాంలో రాజకీయ నిర్ణయాలను అమలు చేసేలా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా విడుదల చేసిన వీడియోలో అంగీకరించారు. తనకంటే సీనియర్ అయిన రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును బాధపెట్టానని, ఆయన తనను క్షమించాలని బహిరంగంగా వేడుకోవడం చూస్తే తాను తప్పు చేసినట్లు ఆయన స్వయంగా అంగీకరించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆయన వ్యవహారశైలి వల్ల అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సైతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని ఇప్పటికీ చెబుతుంటారు. విద్యాశాఖ కమిషనర్ గా కొన్నాళ్లు పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక పర్యటనలతో ఉపాధ్యాయ వర్గాలను హడలెత్తించారు. అర్ధరాత్రులు కూడా పర్యటలకు వెళ్లి టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీంతో ఆ వర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుందని ఎన్నికల తర్వాత అనేక విశ్లేషణల్లో వెల్లడైంది.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై చర్యలు ఉంటాయని భయపడిన ప్రవీణ్ ప్రకాష్.. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సీనియర్ అధికారిని అయిన తనను ప్రభుత్వం పిలిచి మాట్లాడుతుందని, ఆ తర్వాతే రిటైర్మెంటును ఆమోదిస్తుందని ప్రవీణ్ ప్రకాష్ భావించారని అంటున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఆయన విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండానే ఒక్క నెలలోనే వలంటీరీ రిటైర్మెంటుకు ఓకే చేసింది. ఈ పరిణామాన్ని ఊహించని ప్రవీణ్ ప్రకాష్ ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశారు. ఆయనను కలిసేందుకు సీఎం ఏ మాత్రం సానుకూలత చూపలేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా ఒకసారి వెల్లడించారని గుర్తు చేస్తున్నారు.
ఇక తాజాగా ఏబీవీ, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కి క్షమాపణ చెబుతూ, ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు వీడియో రిలీజ్ చేశారనేది చర్చగా మారింది. అనాలోచితంగా రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ తన సర్వీసు పునరుద్ధరించుకునేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. తాను మారాను అని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన కొద్దికాలంగా వీడియోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో ఓ మీడియా సంస్థ అధిపతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఏపీ అంటే తనకెంతో ఇష్టమని ఒకప్పుడు హీరోగా బతికిన తాను విలన్ గా ముద్ర పడాల్సివచ్చిందని చింతిస్తున్నారు.
అదే సమయంలో ఏడేళ్ల సర్వీసు కాలం కూడా ప్రవీణ్ ప్రకాష్ కు నిద్ర పట్టనీయడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. తన సర్వీసు చివరి వరకు కొనసాగి ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాకు వెళ్లేవారని అంటున్నారు. అంతేకాకుండా సర్వీసును సక్రమంగా ముగించి ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో పనిచేసే అవకాశం ఉండేదంటున్నారు. కానీ, ప్రవీణ్ ప్రకాష్ క్షణికావేశంలో ఓ సాధారణ వ్యక్తిలా తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు తీవ్రంగా బాధ పడుతున్నట్లు కనిపిస్తుందని ఆయన వ్యవహారశైలిని చూస్తున్నవారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వకపోతుందా? అని ఎదురుచూస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఏపీకి మళ్లీ వచ్చి సేవ చేస్తానని ‘ఒక్క చాన్స్’ కోసం ఎదురుచూస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
