సున్నితమైన విషయాలపై అనవసరంగా ఎక్కువగా స్పందించడం తప్పే!
జులై 4న ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు అయిన రావణ్ ను పోలీసులు తాజాగా వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు.
By: Tupaki Political Desk | 21 Sept 2026 12:55 PM ISTహిందూ దేవుళ్లపై విద్వేష ప్రసంగాలతోపాటు నక్సలిజాన్ని ప్రోత్సహించేలా యూట్యూబ్ లో ప్రసంగాలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జులై 4న ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు అయిన రావణ్ ను పోలీసులు తాజాగా వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు జైలు నుంచి తీసుకువచ్చిన గన్నవరం పోలీసులు రెండు రోజులుగా రావణ్ ను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తాను తప్పు చేశానని, “సున్నితమైన విషయాలపై అనవసరంగా ఎక్కువగా స్పందించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దూషించిన విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కొంతమంది ప్రోద్బలంతో యూట్యూబ్ లో ప్రశ్న రావణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే విచారణలో మాత్రం తాను ఎవరి ప్రోత్సాహంతోనో వీడియోలు చేయలేదని రావణ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదానికి ప్రధాన కారణమైన ఏలూరు సభలో ప్రసంగంతోపాటు యూట్యూబ్ లో హిందూ దేవతలను కించపరిచేలా చేసిన వీడియోలు విషయంలో రావణ్ తప్పు అంగీకరించాడని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తనకు ఎవరూ కంటెంట్ ఇవ్వలేదని, తానే సొంతంగా కంటెంట్ తయారు చేసుకునేవాడని మొత్తం బాధ్యతను తానే తీసుకుంటున్నానని రావణ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక ప్రశ్న ఛానల్ నిర్వహణలో ఎవరెవరి ప్రమేయం ఉంది? నిధుల సమకూరుస్తున్న వారు? ఎవరు వంటి ప్రశ్నలకు రావణ్ మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. తానే ఛానల్ నిర్వహిస్తున్నానని, తనకు సహాయంగా నిర్వహణ విషయాలను గమన చూసుకునేవారని, ఇక ఇంద్రసేనా నాయకుడికి ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదని రావణ్ వాంగ్మూలమిచ్చినట్లు చెబుతున్నారు. కేవలం ఇంద్రసేన నాయుడికి చెందిన భవనంలో స్టుడియోను నిర్వహించేవారమని, అంతకుమించి ఆయనకు ఛానల్ కు సంబంధం లేదని తెలియజేసినట్లు చెబుతున్నారు.
మరోవైపు వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం, అది పంచుకునే విధానంపైనా పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. కాగా, కేసు విషయంలో రావణ్ ప్రభుత్వంతో రాజీకి ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. జులై 4న ఉపా కేసులో అరెస్టు అయిన తర్వాత రావణ్ తీవ్ర అంతర్మథనానికి లోననట్లు చెబుతున్నారు. తన వ్యవహారశైలి వల్లే ఇంతటి ఇబ్బంది ఎదుర్కొంటున్నానని సన్నిహితుల వద్ద వాపోయిన ఆయన ప్రభుత్వానికి అన్ని చెప్పేయాలని నిర్ణయించుకున్నాడని, ఆ తర్వాతే అతడి విచారణకు పోలీసులు సిద్ధమయ్యారని అంటున్నారు. లేనిపక్షంలో రావణ్ ను మరికొన్నాళ్లు జైలులో ఉంచేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేదని అంటున్నారు. రావణ్ విచారణ తర్వాత ఆయన సహకరిస్తున్నాడని చూపి బెయిలుపై విడుదల చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా ఉపా కేసుల్లో అరెస్టు అయిన వారిని ఎటువంటి విచారణ లేకుండా, చార్జిషీటు వేయకుండా ఆరు నెలల వరకు జైలులో ఉంచొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే రావణ్ విషయంలో రెండు నెలలకే ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు రావణ్ వైపు నుంచి సానుకూల స్పందన ఉండటమే కారణంగా భావిస్తున్నారు. తనకు సహకరించిన వారి పేర్లను చెప్పేస్తానని రావణ్ ముందుకు వచ్చిన తర్వాతే అతడి కేసును పైకి తీసుకువచ్చి విచారణ అనంతరం బెయిలు మంజూరుకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం రావణ్ విచారణ సాగుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. దీంతో రావణ్ కేసు ఇంకే మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
