Begin typing your search above and press return to search.

పీకే ప్రశంసలు...ఇండియా కూటమి వైపు నితిన్ ?

నితీష్ కుమార్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి. దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు ఆయన బీహార్ కి సీఎంగా పాలించారు. ఆయన మాదిరిగా సుదీర్ఘ కాలం సీఎం గా చేసిన నాయకుడు వేరొకరు లేరు.

By:  Garuda Media   |   19 Oct 2026 10:00 AM IST
పీకే ప్రశంసలు...ఇండియా కూటమి వైపు నితిన్ ?
X

నితీష్ కుమార్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి. దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు ఆయన బీహార్ కి సీఎంగా పాలించారు. ఆయన మాదిరిగా సుదీర్ఘ కాలం సీఎం గా చేసిన నాయకుడు వేరొకరు లేరు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ని బీజేపీ బీహార్ పీఠం నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని వచ్చింది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా నెగ్గారు. కేంద్ర మంత్రి పదవి ఇదిగో అదిగో అంటూ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా నితీష్ కుమార్ ఎక్కడ ఉన్నారు అని సొంత పార్టీ జేడీయూలోనే చర్చ సాగుతోంది. బీహార్ లో అయితే జేడీయూ ఈ విషయంలో అసంతృప్తితో ఉంది అని వార్తలు వస్తున్నాయి.

గ్రేట్ లీడర్ అంటూ :

ఈ క్రమంలో నితీష్ కుమార్ ని గ్రేట్ ఒకనాటి ఎన్నికల వ్యూహకర్త. ప్రస్తుతం జన సురాజ్ పార్టీ తరఫున బీహార్ లో గెలిచిన ఎమ్మెల్యే అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కితాబు ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది. ఇదే పీకే ఈ మధ్య దాకా నితీష్ కుమార్ ని పెద్ద ఎత్తున విమర్శించారు అన్న సంగతి గుర్తు పెట్టుకుంటే ఆయన ఈ రోజున కితాబు ఇవ్వడం కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందనే అంటున్నారు. బీహార్ అభివృద్ధి కోసం నితీష్ చిత్తశుద్ధితో కృషి చేశారు అని పీకే పొగడడం కూడా విశేషం. అంతటితో కూడా ఆయన ఆగలేదు బీహార్ చరిత్రలోనే అత్యంత సమర్థవంతమైన నాయకుడని, సమాజం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ నిబద్ధత తో పది మంది ఉత్తమ నేతలలో నితీశ్ ఒకరుగా నిలిచారని పీకే అభివర్ణించారు.

గతంలో నితీష్ జట్టుగా :

ఇక ఒక్కసారి వెనక్కి వెళ్తే గతంలో పీకే నితీష్ కుమార్ విజయానికి కృషి చేశారు. ఆయనకు ఎన్నికల్లో వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు. 2015లో నితీష్ గెలుపు వెనక పీకే ఉన్నారని ప్రచారం సాగింది. ఆ తరువాత జేడీయూలో చేరి కీలక పార్టీ పదవులు కూడా పీకే అందుకున్నారు. కానీ ఇద్దరి మధ్య అనంతర కాలంలో విభేదాలు వచ్చాయి. అక్కడ నుంచి నితీష్ ని సందర్భం వచ్చినపుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటి పీకే ఇపుడు నితీష్ ని పొగుడుతున్నారు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఎందుకంటే పీకే రాజకీయ నేత కంటే ముందు ఒక వ్యూహకర్త. అందుకే ఆయన వ్యూహం ఏమిటి అనే ఇప్పుడు చర్చ సాగుతోంది.

బీజేపీపైనే గురి :

ఒక వైపు నితీష్ ని పొగుడుతున్న పీకే బీహార్ సీఎం బీజేపీ నేత అయిన సామ్రాట్ చౌదరి మీద మాత్రం గట్టిగానే విమర్శలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన ప్రతి ఒక్కరినీ కాల్చివేయాలనే వాదన సరైనదైతే ఆ లెక్కన సామ్రాట్ చౌదరి కూడా నేరస్తుడే అవుతారు అని హాట్ కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే బీహార్ ప్రభుత్వం తనపైన కేసు నమోదు చేయవచ్చు అని పీకే సవాల్ విసిరారు. అంటే బీజేపీ బీహార్ పీఠాన్ని తీసుకుందని అసంతృప్తితో ఉన్న జేడీయూని మంచి చేసుకోవడానికి నితీష్ కుమార్ అభిమానులను తన వైపు తిప్పుకోవడానికి పీకే ఈ రకంగా వ్యూహ రచన చేశారు అని అంటున్నారు.

తిరిగి ఇండియా కూటమిలోకి :

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ అయితే చాలా కాలంగా మౌనమే నా భాష అన్నట్లుగా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది. మరో వైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మీద సీజేపీతో పాటు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. దాంతో కూడా జాతీయ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. ఈ కీలక సమయంలో నితీష్ కుమార్ మళ్లీ ఇండియా కూటమి వైపు చూస్తారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక చూస్తే పీకే కూడా ఎన్డీయే వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. మరి ఆయన నితీష్ ని ఆ వైపు నుంచి ఈ వైపునకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు మొదలెట్టారా అన్నది ఇపుడు సాగుతున్న చర్చ.