Begin typing your search above and press return to search.

ప్రజారాజ్యం పార్టీకి మించి పీకేకు దెబ్బపడింది

తన రాజకీయ వ్యూహాలతో పలువురిని ముఖ్యమంత్రి పదవి వరించేలా చేసిన రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తప్పులో కాలేశారు.

By:  Garuda Media   |   15 Nov 2025 9:44 AM IST
ప్రజారాజ్యం పార్టీకి మించి పీకేకు దెబ్బపడింది
X

తన రాజకీయ వ్యూహాలతో పలువురిని ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాను అని చెప్పుకొనే రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తప్పులో కాలేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే పాత సామెతకు భిన్నంగా రచ్చ గెలిచిన ఈ బిహరీ పెద్ద మనిషి.. తన సొంత రాష్ట్ర రాజకీయాల్లో ఒక మెరుపులా మెరిసి.. తన చుట్టూ బిహార్ రాష్ట్ర రాజకీయం నడవాలన్న పీకే ఆశ మరోసారి ఆడియాశ అయ్యింది. వ్యూహాకర్తకే వ్యూహాల్ని నేర్పించటమా? అన్నట్లుగా తాజా పరిస్థితి ఉంది. తాను కొత్తగా నెలకొల్పిన పార్టీకి ఉన్న విజయవకాశాల్ని గుర్తించే విషయంలో పీకే ఎంతలా ఫెయిల్ అయ్యారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ అనుభవాన్ని గుర్తు చేసుకున్నా కూడా పీకేకు ఇప్పుడు ఎదురైన అవమానం ఉండేది కాదు. ప్రజారాజ్యం పార్టీని పెట్టిన వేళలో అధికార కాంగ్రెస్ తో కాకున్నా.. అప్పటి విపక్షం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తాను గెలవకుండా.. టీడీపీ గెలవకుండా చేసి అధికారం మొత్తం ఉమ్మడి రాజకీయ శత్రువైన వైఎస్ కు రెండోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసిన వైనం అందరికి గుర్తుండేదే.

బిహార్ లోనూ ఇప్పుడు అదే పరిస్థితి. అధికార జనతాదళ్ (యూ), బీజేపీతో పాటు మరికొన్నిపార్టీలు జత కట్టిన వేళ.. విపక్ష ఓటు బ్యాంకు ముక్కలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం విపక్షాల మీద ఉంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఆర్జేడీ.. చివరకు పీకే పార్టీ సైతం తమ శక్తియుక్తుల్ని వాస్తవానికి మించి ఊహించుకోవటమే ఎన్డీయేకు కలిసి వచ్చింది. ఎవరికి వారు తగ్గి..ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ శక్తియుక్తుల్ని పెంచుకోవాలన్న ఓపిక ఉండి ఉంటే బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేది. కానీ.. ఎవరికి వారు.. ఎవరు తగ్గకుండా వ్యవహరించే తీరుతో మొదటికే మోసం వచ్చేలా తెచ్చుకున్నారు.

రాజకీయ వ్యూహకర్తగా పేరున్న పీకే లాంటి పెద్ద మనిషి కూడా తన అడ్దాలో తప్పుల మీద తప్పులు చేయటం చూడొచ్చు. ఆడటం వేరు.. ఆడించటం వేరు. వ్యూహాలు పన్ని ఆడించే నేర్పు ఉన్న పీకే.. తాను సహజసిద్ధంగా ఆటగాడ్ని కాదన్న విషయాన్ని మాత్రం గుర్తించటంలో తప్పు మీద తప్పులు చేయటం కనిపిస్తుంది. మంచి ఆటగాళ్లను ఆడించే సత్తా ఉన్న ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు కూటమితో కలిసి వచ్చే పార్టీలతో కలిసి తాను కూడా ఒక చేయి వేసి ఉండటంతో పాటు.. పోటాపోటీగా సొంత కూటమి పార్టీల అభ్యర్థులు పోటీ పడకుండా నిలువరించి ఉండి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.