రేవంత్ రెడ్డిని ఎవరూ కాపాడలేరు.. మరో బాంబ్ పేల్చిన పీకే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌కు సంబంధించిన వ్యక్తులపై గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 4 Oct 2025 10:49 AM ISTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త, జాన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న PK, రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌కు సంబంధించిన వ్యక్తులపై గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'బీహార్ DNA' వ్యాఖ్యలు దుమారం రేపాయి. 2023 డిసెంబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన తన పూర్వ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై వ్యాఖ్యలు చేస్తూ.. తన DNA తెలంగాణకు చెందినదని, అయితే కేసీఆర్‌ది బీహార్ DNA అని అన్నారు. "తెలంగాణ DNA, బీహార్ DNA కంటే మెరుగైనది" అని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ కుర్మీ సామాజిక వర్గానికి చెందినవారని, వారి వలసలు బీహార్ నుండి జరిగాయని సూచించే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా బీహార్ నాయకులు.. రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
అంతకుముందు 2022లో ఆయన తెలంగాణలోని కొందరు ఉన్నతాధికారులను ఉద్దేశించి 'బీహార్ బ్యాచ్' అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో బీహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
* బిహారీలపై అవమానంపై ఆగ్రహం
“తెలంగాణ ప్రజల DNA బిహార్ ప్రజల కంటే మెరుగ్గా ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బిహారీ ప్రజలపై అవమానకరంగా ఉన్నాయి. అదే నిజమైతే ఆయన TPCC అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నాతో సహాయం కోసం మూడుసార్లు ఎందుకు కలిశారు?” అని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిహారీలను అవమానించడాన్ని PK తీవ్రంగా ఖండించారు.
* వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం: PK హెచ్చరిక
ఇంకా ముందుకు వెళ్లి ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ “రేవంత్ రెడ్డి తన అహంకారంతో, అహంభావంతో నాశనమవుతారు. ఆయనను ఎవ్వరూ కాపాడలేరు. రాహుల్ గాంధీ కూడా ఆయనను రక్షించలేరు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఓడిపోవడం ఖాయం. తెలంగాణ ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతారు” అని వ్యాఖ్యానించారు.
* రాజకీయాల్లో వేడెక్కుతున్న వాతావరణం
ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ నాయకులు PK వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం వీటిని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలకు ఆయుధంగా వాడుకుంటున్నాయి.
రేవంత్ రెడ్డి, PK మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యం, తరువాత ఏర్పడిన విభేదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
