Begin typing your search above and press return to search.

రాజకీయం అంటే రాజకీయ సలహాలు ఇచ్చినంత ఈజీ కాదు రాజా..ఇప్పటికన్నా అర్ధం అయ్యిందా ..

ప్రశాంత్ కిషోర్ రాజకీయ రంగంలో దిగిన తర్వాత స్పష్టమైన అతిపెద్ద తేడా ఏమిటంటే.. వ్యూహ రచన , క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా వేర్వేరు అంశాలు అని నిరూపితమైంది.

By:  A.N.Kumar   |   12 Nov 2025 2:00 PM IST
రాజకీయం అంటే రాజకీయ సలహాలు ఇచ్చినంత ఈజీ కాదు రాజా..ఇప్పటికన్నా అర్ధం అయ్యిందా ..
X

ఉట్టికే ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందట.. ఫాఫం.. ఇప్పుడు మన ‘పీకే’ పరిస్థితి.. బీహార్ లో ఏం ‘పీకే’లేకుండా అయిపోయింది.. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత విజయవంతమైన పేర్లలో ఒకరు ప్రశాంత్ కిషోర్ (పీకే). 2014లో బీజేపీకి, ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి అనేక పార్టీలకు సేవలు అందించి, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. సొంతంగా రాజకీయాల్లోకి దిగి 'జన్ సూరజ్' పేరిట బీహార్‌లో ప్రారంభించిన ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో పీకే పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ పార్టీకి 0-5 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో తేలడంతో పీకే ఖేల్ ఖతమైందని విశ్లేషణనలు మొదలయ్యాయి. వ్యూహకర్త నుండి నాయకుడిగా మారే క్రమంలో ప్రశాంత్ కిషోర్ అట్టర్ ఫ్లాప్ ఓ పాఠం అని అందరూ చెబుతున్నారు. పొలిటికల్ సజేషన్స్ వేరు.. పాలిటిక్స్ వేరు.. అని ఇప్పుడు పీకే కు అర్థమైందని అంటున్నారు.

* వ్యూహకర్త పాత్ర VS రాజకీయ నాయకుడి పాత్ర

ప్రశాంత్ కిషోర్ రాజకీయ రంగంలో దిగిన తర్వాత స్పష్టమైన అతిపెద్ద తేడా ఏమిటంటే.. వ్యూహ రచన , క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా వేర్వేరు అంశాలు అని నిరూపితమైంది.

వ్యూహకర్తగా పీకే ఇంతవరకు చేసిన పని ఏమిటంటే అధికారంలో ఉన్న లేదా అధికారంలోకి రావాలనుకుంటున్న ఒక రాజకీయ పార్టీ యొక్క బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల వ్యూహాలు, ఓటర్ల మనస్తత్వాన్ని విశ్లేషించి దానికి అనుగుణంగా ప్రచార సరళిని, నాయకుడి ఇమేజ్‌ను తీర్చిదిద్దడం. ఈ పాత్ర ఒక కన్సల్టెంట్ లాంటిది. సలహా ఇచ్చి, పర్యవేక్షించి ఫలితం వచ్చాక క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా తానే హైజాక్ చేసినట్టుగా భావించారు, ఇది ఆయన మీడియా మేనేజ్‌మెంట్ సక్సెస్. గెలుపు అనేది ముఖ్యంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో చేసిన అకుంఠిత కృషి ఫలితం.

రాజకీయ నాయకుడిగా పీకే ఫ్లాప్

అదే రాజకీయాల్లోకి దిగితే కేవలం వ్యూహాలు రాస్తే సరిపోదు. ఒక పార్టీని సున్నా నుంచి నిర్మించాలి. క్షేత్రస్థాయిలో నమ్మకమైన కార్యకర్తల నెట్‌వర్క్, ప్రతి నియోజకవర్గంలో బలమైన, స్థానికంగా పేరున్న అభ్యర్థులు, ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకునే వ్యక్తిగత ప్రజా సంబంధాలు అవసరం. ఇది కేవలం మీడియాలో ప్రచారం ద్వారా లేదా భారీ ప్యాకేజీల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదు. రాజకీయాల్లోకి దిగాక, డబ్బులు తీసుకునే సలహాదారు స్థానం నుండి ఓట్లు అడిగే అభ్యర్థి స్థానానికి పీకే మారారు. దీంతో ఇన్నాళ్లు ఆయన క్రెడిట్ తీసుకున్న కష్టం నిజంగా ఎవరిదో బీహార్ ఫలితాలు ఆయనకు కళ్లకు కట్టినట్టు చూపించాయి.

* జన్ సూరజ్ ప్రస్థానం.. సైద్ధాంతిక ప్రయోగం

ప్రశాంత్ కిషోర్ 'జన్ సూరజ్' పేరుతో మొదలుపెట్టిన ఉద్యమం, బీహార్‌లో సుపరిపాలన తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రధానంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి సాంప్రదాయ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయం చేయాలని ప్రయత్నించింది. పీకే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను వినడం స్థానిక ప్రముఖులను తన ఉద్యమంలో భాగస్వాములను చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇది మంచి వ్యూహమే అయినా ఓట్లుగా మారడానికి సరిపోలేదు.

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపికలో 'జన్ సూరజ్' వెనుకబడింది. బీహార్‌లో కులం, మతం, వ్యక్తిగత పరపతి అత్యంత కీలకమైన అంశాలు. ఈ సాంప్రదాయ సమీకరణాలను పీకే సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయడానికి బలమైన, విజయవంతమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ పాయింట్.

* ఎగ్జిట్ పోల్స్ వెల్లడి: పీకేకు ఘోర పరాజయం

తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్, పీకే రాజకీయ ప్రయాణానికి ఒక బలమైన షాక్ ఇచ్చాయి. అనేక సర్వే సంస్థలు 'జన్ సూరజ్' పార్టీకి సున్నా నుంచి అతి తక్కువ స్థానాలు మాత్రమే లభిస్తాయని అంచనా వేశాయి. ఈ అంచనాలు పీకే పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది అనే భావనను బలపరుస్తున్నాయి.

ఈ ఫలితాలు చెప్పే గుణపాఠం

ఎంతటి మేధావి అయినా ఎంత గొప్ప వ్యూహకర్త అయినా ఒక బలమైన రాజకీయ సంస్థను నిర్మించడంలో నిరంతర కృషి, క్షేత్రస్థాయి అనుభవం తప్పనిసరి. పీకేకు ఉన్న మీడియా కవరేజ్, డబ్బు బలం, వ్యూహాత్మక ఆలోచనలు... ఈ మూడూ ఓటర్ల నమ్మకం ముందు నిలబడలేకపోయాయి. పీకే ఇంతవరకు గెలిపించిన పార్టీల విజయానికి ఆయన వ్యూహం ఒక అంశం మాత్రమే తప్ప, అంతిమ కారణం కాదు అని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఆ క్రెడిట్‌ను మొత్తం తన ఖాతాలో వేసుకోవడం కేవలం "ప్రచార ఆర్భాటం" (హైజాక్) మాత్రమే.

* పీకే భవిష్యత్తు

'పీకే బీహార్‌లో వైఫల్యం ఆయనకు రాజకీయ నాయకుడిగా ఒక విలువైన పాఠాన్ని నేర్పింది. రాజకీయ వ్యూహాలు అద్భుతంగా పనిచేయవచ్చు. కానీ అది కేవలం టెంపరరీ ఇంజెక్షన్ లాంటిది. ఒక రాజకీయ పార్టీని స్థాపించడం అనేది ఒక నిరంతర ప్రయోగం, ఇది ప్రజల మనసుల్లో, భూమి స్థాయిలో సంవత్సరాల తరబడి చేసిన కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

* పీకేకు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి..

సొంత రాజకీయ ప్రయోగం విఫలమైతే.. భారీ ప్యాకేజీలతో మళ్లీ కన్సల్టింగ్ ప్రపంచంలోకి వెళ్లడం ముఖ్యం. 'జన్ సూరజ్'ను ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌గా భావించి.. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటూ, ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు సిద్ధమవడం అవశ్యం.

ఏదేమైనా 'పెరట్లో అరటి సొంత వైద్యానికి పనికిరాదు' అనే సామెత, సొంతంగా రాజకీయ ప్రయోగం చేసిన పీకేకు నూటికి నూరు శాతం సరిపోతుందని ఈ ఎన్నికల ఫలితాలు ధృవీకరిస్తున్నాయి.