బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ `ఎఫెక్ట్` ఎంత? ప్రజల సమాధానం ఇదే!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు తలపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ హోరా హోరీగా పోరు సాగిస్తున్నాయి.
By: Garuda Media | 2 Nov 2025 2:00 AM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు తలపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ హోరా హోరీగా పోరు సాగిస్తున్నాయి. రెందు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలు నవంబరు 9, 11 తేదీల్లో జరగనున్నాయి. అయితే.. ఈ ప్రధాన కూటముల సంగతి అలా ఉంచితే.. మరో కీలక పార్టీ జన్‌సురాజ్ కూడా ఇప్పుడు తాము ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తున్నామని చెబుతోంది.
ఈ పార్టీ అధినేత.. మరెవరో కాదు.. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకేగా రాజకీయ వర్గాల్లో పరిచయం ఉన్న ప్రశాంత్ కిషోర్.. బీహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 200 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తన పార్టీ తరఫున విద్యార్థి, ఉద్యమ సంఘాల నాయకులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మేధావులు, మాజీ ఐఏఎస్‌లు కూడా ఒకరిద్దరు పోటీ చేస్తున్నారు. కీలకమైన పార్టీ అధినేతగా ఉన్న పీకే మాత్రం ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడం లేదు.
ఇదిలావుంటే.. తమ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందని పీకే చెబుతున్నా.. బీహార్ ప్రజల్లో ఆమేరకు ఎక్కడా ఆశలు చిగురించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం ప్రకారం.. జన్ సురాజ్ పార్టీ బీజేపీకి`బీ` టీమ్‌గా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో జన్ సురాజ్ పార్టీ విషయాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై పలు సర్వేలు ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే పార్టీ జన్‌సురాజ్ ఏమేరకు ప్రభావం చూపుతుందన్న దానికి ప్రజలు ఆశ్చర్యకరమైన మార్కులు వేశారు.
1) ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు : 21 శాతం మంది ఔను అని సమాధానమిచ్చారు.
2) ప్రభావం చూపదు.. అన్న ప్రశ్నకు: గరిష్ఠంగా 42 శాతం మంది ఔనన్నారు.
3) ఏ విషయాన్ని చెప్పలేం.. అన్న ప్రశ్నకు: 10 శాతం మంది ఓకే అన్నారు.
అంటే.. మొత్తంగా జన్‌సురాజ్ పార్టీతో మార్పు దిశగా బీహార్‌ను ముందుకు నడిపిస్తామని చెబుతున్న పీకేపై బీహారీలకు పెద్దగా విశ్వాసం కనిపించడం లేదన్న విషయం తాజా ఆన్‌లైన్ సర్వేలతో స్పష్టమవుతోంది. ఇక, ఇదే విషయంపై పీకే స్పందించారు. ``ప్రజల నాడిని ఇప్పుడే చెప్పలేం. ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఏదైనా జరగొచ్చు. అయితే.. ఒకటి.. మావైపు గాలి వీస్తే.. 150 సీట్లలో విజయం దక్కుతుంది. లేకపోతే.. కనీసం 5-10 సీట్ల మధ్యే పరిమితం అవుతాం. దేనికైనా రెడీ`` అని పీకే అన్నారు.
