సొంత ఊరిలో ఘోర అవమానం ... ఆయన ఎవరో మాకు తెలియదు... పీకేకి భారీ షాక్!
పీకే ఎవరో తమకు తెలియదు అని ఆయన సొంత ఊరు అంటోంది. ఆయన సొంత ఊరు బీహార్ రాష్ట్రంలోని రోహ్ తాస్ జిల్లా కరహగర్ ఆయన సొంత ఊరు.
By: Satya P | 20 Oct 2025 9:09 AM ISTపీకే అంటే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. ఆయన ఎన్నికల వ్యూహకర్త. అంతకు మించి రాజకీయ విశ్లేషకుడు, మేధావి. ఎప్పటికి ఏది అవసరమో గ్రహించి దానికి తగినట్లుగా రాజకీయ ప్రణాళికలు రూపొందిస్తారు అని పేరు. ఆయన ఎంతో మందిని ముఖ్యమంత్రులను చేశారు. ఎందరికో అందలాలు అందించారు. అయితే ఆయనే రాజకీయ పార్టీ పెట్టి జనాల వద్దకు వెళ్తున్నారు. ఆయన పార్టీ పేరు జనసురాజ్. ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తన పార్టీని దింపారు. చిత్రమేంటి అంటే పీకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
సొంత ఊరు అంటోంది :
పీకే ఎవరో తమకు తెలియదు అని ఆయన సొంత ఊరు అంటోంది. ఆయన సొంత ఊరు బీహార్ రాష్ట్రంలోని రోహ్ తాస్ జిల్లా కరహగర్ ఆయన సొంత ఊరు. ఆ గ్రామం ఆయన పూర్వీకులది. ఆయన సొంత ఇలాకాగా చెప్పాల్సి ఉంది. ఇక పీకే తన సొంత ఊరుకు ఎపుడూ రాలేదని గ్రామస్తులు చెబుతారు. ఎందుకంటే ఆయన బాల్యం, కానీ విద్యాభ్యాసం కానీ అంతా బక్సర్ లో గడచింది. దంతో ఆయన సొంత ఊరికి ఎపుడూ వెళ్ళలేదు. ఆ విధంగా ఆయన బంధాలు ఏవీ ఆ ఊరితో లేవు, పీకే ఎవరు అంటే వారు ఇచ్చే సమాధానం మాకు తెలియదు అని. బీహార్ కి సీఎం కావాలని పార్టీ పెట్టిన పీకేకి సొంత ఊరిలోనే మద్దతు లేదంటే నిజంగా వింతే మరి.
పీకే డీటైల్స్ ఇవే :
చాలా మందికి పీకే గురించి పెద్దగా తెలియదు. ఆయన వ్యూహకర్త అని మాత్రమే అంటారు. కానీ ఆయన కులం ఆయన సొంత ఊరు ఆయన ఫ్యామిలీ డీటైల్స్ కూడా అసలు తెలియదు. కానీ పీకే వివరాలు చూస్తే ఒకింత ఆసక్తిని గొలిపేలా ఉన్నాయి. ఆయన తండ్రి పేరు శ్రీకాంత్ పాండే. ఆయన దివంగతులయ్యారు. అయితే ఆయన బక్సర్ లో ప్రముఖ వైద్యుడిగా పేరు గడించారు. ఆయనకు అక్కడ మంచి పేరు ఉంది. ఆ వారసత్వమే పీకేకు కూడా రాజకీయంగా వాడుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడుతోంది.
సామాజిక సమీకరణలు :
రాజకీయాల్లో సామాజిక సమీకరణలు ఎంతగా ఉపయోగపడతాయో పీకేకు బాగా తెలుసు. అయితే ఇక కులం పరంగా చూస్తే పీకే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. బీహార్ రాజకీయాల్లో బ్రాహ్మణ ముఖ్యమంత్రులు గతంలో ఎంతో మంది చేశారు. చివరిసారిగా చేసింది జగన్నాధ్ మిశ్రా. మరి ఆ తరువాత అధికారం కాస్తా బీసీల చేతులలోకి వెళ్ళింది. ఓబీసీలది రాజకీయంగా ఆధిపత్యంగా ఉంది. ఇవన్నీ తెలిసిన పీకే పార్టీ పెట్టి సీఎం కావాలని అనుకున్నారు అంటే దానికీ ఒక లెక్క ఉంది. అగ్ర వర్ణాల ప్రభావం కూడా అక్కడ ఉంది. బ్రాహ్మిన్స్ కూడా చాలా నియోజకవర్గాలలో ప్రభావం చొపించగలరు, అయితే అధికారానికి వచ్చేటంత అని మాత్రం ఎవరూ చెప్పలేరని అంటారు.
ఆ పార్టీలన్నీ తిరిగి :
ఇక పీకే రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన పార్టీలను చూస్తే చాలానే ఉన్నాయి. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, కాంగ్రెస్, ఆప్, వైఎస్సార్ కాంగ్రెస్ డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటివి ఉన్నాయి. ఈ పార్టీలలో కాంగ్రెస్ తప్పించి మిగిలిన అన్ని పార్టీలని గెలిపించిన క్రెడిట్ పీకేకి ఉంది. ఆయన వ్యూహాలు బాగా పనిచేస్తాయని అంతా చెప్పుకుంటారు. కానీ పీకే ఇపుడు సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా కనీసం పోటీకి కూడా దిగకపోవడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన జాతకం ముందే తెలుసా లేక అందులో కూడా ఏమైనా వ్యూహం ఉందా అని అంతా చర్చించుకుంటున్నారు.
