బెంగాలీవా? బీహారీవా? పీకేకు షాకిచ్చిన ఈసీ
అయితే, ఈ ఆరోపణలపై పీకే బృందం వెంటనే స్పందించింది. “పీకే రెండు చోట్ల ఓటు వేయడం జరగదు. చట్టపరంగా సరైన ప్రక్రియలోనే రిజిస్ట్రేషన్ మార్చుకున్నాం” అని ఆయన టీమ్ సభ్యులు స్పష్టం చేశారు.
By: A.N.Kumar | 28 Oct 2025 7:50 PM ISTరాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన, ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ చీఫ్‌గా బీహార్ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రశాంత్ కిశోర్ (పీకే)కు కేంద్ర ఎన్నికల సంఘం (EC) షాక్ ఇచ్చింది. రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదు అయినందుకు గానూ ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
* ఏమైంది?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విషయం తెరపైకి వచ్చింది. పీకేకు రెండు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ (WB) , బీహార్ లో ఓటు హక్కు ఉండటాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. మొదట ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్‌లో ఓటరుగా నమోదు అయ్యారు. తరువాత ఆయన బీహార్‌లోని కర్‌గహార్ నియోజకవర్గంలో కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు.
ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం చట్ట విరుద్ధం. ఈసీ దీన్ని సీరియస్‌గా తీసుకుని, ఈ ద్వంద్వ నమోదుపై వివరణ ఇవ్వాలని పీకేను ఆదేశిస్తూ నోటీసులు పంపింది.
* పీకే టీమ్ వివరణ
అయితే, ఈ ఆరోపణలపై పీకే బృందం వెంటనే స్పందించింది. “పీకే రెండు చోట్ల ఓటు వేయడం జరగదు. చట్టపరంగా సరైన ప్రక్రియలోనే రిజిస్ట్రేషన్ మార్చుకున్నాం” అని ఆయన టీమ్ సభ్యులు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన వివరణ ప్రకారం.. బీహార్‌లోని కర్గహార్‌లో ఓటరుగా నమోదయ్యాక, పీకే తరఫున పశ్చిమ బెంగాల్ ఓటును తొలగించాలని ఇప్పటికే దరఖాస్తు (అప్లై) చేయడం జరిగింది. రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకోకుండా, నిబంధనల ప్రకారమే ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే ప్రయత్నం చేశామని తెలిపారు.
* రాజకీయ చర్చ
ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బీహార్‌లో జన్ సురాజ్ పార్టీని స్థాపించి, రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఈ ద్వంద్వ ఓటర్ ఇష్యూ ఆయనకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించే అంశంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈసీ నుంచి వచ్చిన నోటీసుపై పీకే ఇచ్చే వివరణతో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా కొత్త మలుపు తిరుగుతుందా అనేది ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
