Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిశోర్ 'ఆడలేక మద్దెలు ఓడు' మాటలేల..!

అయితే.. ఇటీవల ఎన్నికల కమిషన్ పైనా, అధికారంలో ఉన్న వారిపైనా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ కిశోర్ కూడా అదే పాట పాడారు.

By:  Raja Ch   |   24 Nov 2025 11:51 AM IST
ప్రశాంత్ కిశోర్ ఆడలేక మద్దెలు ఓడు మాటలేల..!
X

ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ రాజకీయ నాయకుడు దాదాపుగా ఒకే మాట చెబుతున్నారు! అదే.. ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని! వాస్తవాలు గ్రహించలేకో, ప్రజల పల్స్ పట్టుకోలేకో, అదీగాక.. ఆత్మవంచన తాలూకు ప్రభావమో తెలియదు కానీ... ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని, దొంగ ఓట్లు సృష్టించబడ్డాయని, ఉన్న ఓట్లు తొలగించారని ఆరోపణలు చేస్తున్నారు.

అవును... ఎన్నికల్లో గెలుపోటముల్లో మద్యం, డబ్బు, ఇతరాత్ర ప్రభావం లేదని చెప్పలేం కానీ.. పూర్తిగా తమ ఓటమికి ఇవి మాత్రమే కారణం అని.. తాము గెలిస్తే మాత్రం అది ప్రజాభిప్రాయం అని చెప్పే నాయకులకు కొదవలేదు! అయితే.. ఇటీవల ఎన్నికల కమిషన్ పైనా, అధికారంలో ఉన్న వారిపైనా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ కిశోర్ కూడా అదే పాట పాడారు.

వివరాళ్లోకి వెళ్తే... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఘోర ఓటమి పాలైన తర్వాత జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, (మాజీ) ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా తన మౌనాన్ని వీడారు. తాజాగా జరిగిన ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆరోపిస్తూ.. ప్రస్తుతం తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అంగీకరించారు.

ఇదే సమయంలో... రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి పోటీచేసిన పార్టీ అధినేత పీకే... ఈ ఓటమి బాధాకరంగా ఉందని చెబుతూ, క్షేత్రస్థాయిలో మాత్రం తన ప్రచారం బలంగా ఉందని చెప్పుకొచ్చారు. నెలల తరబడి తన బృందం సేకరించిన అభిప్రాయాలతో ఓటింగ్ ట్రెండ్లు సరిపోలడం లేదని చెబుతూ.. ఏదో తప్పు అరిగిందని తాను నమ్ముతున్నానంటూ సన్నాయినొక్కులు నొక్కారు!

ఇదే క్రమంలో... ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఓటింగ్ రోజు వరకూ రాష్ట్రంలో మహిళలకు పదివేల రూపాయలు అందజేశారని.. వాస్తవానికి మహిళలకు మొత్తం రూ. రెండు లక్షలు అందుతాయని.. మొదటి విడతగా రూ.10వేలు అందాయని.. దీంతో.. ఎన్డీయే, నితీశ్ కు ఓటు వేస్తే మిగిలినది వారికి లభిస్తుందని భావించారని పీకే చెప్పుకొచ్చారు!

ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ కూ తన ఓటమి కారణాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు పీకే. ఇందులో భాగంగా... ప్రచారం చివరి దశ నాటికి చాలా మంది ఓటర్లు జన సురాజ్ గెలిచే స్థితిలో లేదని భావించారని.. ఈ నేపథ్యంలో అది ఏదో విధంగా లాలూ జంగిల్ రాజ్యం తిరిగి రావడానికి మార్గం సుగమం అని భావించి, భయంతో కొంతమందిని దూరం చేసిందని తనదైన విశ్లేషణ చేశారు.

కాగా... ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ జన్ సురాజ్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు గెలవలేని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెజారిటీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే... ఓటు బ్యాంక్ మాత్రం 3.50 శాతం లోపు వచ్చిందని ఈసీ తెలిపింది. దీనిపై పీకే పై విధంగా స్పందించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... తాజా పీకే విశ్లేషణ, వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ ఆయా పార్టీల విజయంలో తన పాత్ర అత్యంత కీలకంగా పనిచేసిందని చెప్పుకునే పీకే.. తన సొంత పార్టీ అభ్యర్థులకు మాత్రం డిపాజిట్లు తెచ్చుకోలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. సాకులు ఇతరులపైకి నెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

యూట్యూబ్ లో పాటలు విడుదల చేసి, పోస్టర్లు అంటించి, ఫ్లెక్సీలు డిజైన్ చేసి, సర్వేలు చేసి.. ఇది ఎన్నికల వ్యూహం అని చెప్పుకోవడం చాలా సులువే కానీ... నిజంగా ప్రజాక్షేత్రంలోకి దిగి, ప్రజల నాడి పట్టుకుని, వారి మనసులు గెలుచుకోవడమే అసలైన రాజకీయమని పీకే కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా తెలుసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు!