కింగూ కాదూ కింగ్ మేకరూ కాదా...ఏంటి పీకే ?
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అన్న ఆయన గురించి రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే.
By: Satya P | 12 Nov 2025 8:00 PM ISTప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అన్న ఆయన గురించి రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. వ్యూహాలను సైతం కార్పోరేట్ స్టైల్ లో సెట్ చేసి రాజకీయాల తల రాత మార్చేవిగా డిజైన్ చేయడంతో పీకే సిద్ధహస్తుడిగా పేరు గడించారు. దాదాపు దశాబ్దం క్రితం పీకే ఈ విధంగా ఎన్నికల వ్యూహకర్తగా మారి దేశ రాజకీయాలలో కొత్త ట్రెండ్ ని తీసుకుని వచ్చారు. ఇక ఆయన వల్ల ఎంతో మంది ఉన్నత స్థానాలను అందుకున్నారు అని ప్రచారం కూడా ఉంది. అందులో కొంత నిజం ఉంది. ఏపీలో జగన్, బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్, బీహార్ లో నితీష్ కుమార్ ఇంకా బీజేపీ కాంగ్రెస్ వంటి అగ్ర సంస్థలతో పాటు తెలుగు నాట బీఆర్ఎస్ టీడీపీలకు కూడా పీకేఅ వ్యూహాలతో సలహాలతో సేవలు అందించారు అని చెబుతారు.
పొలిటికల్ హీరో కావాలని :
తన వల్లనే ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కీలక స్థానాలలో ఉన్నారు తాను మాత్రం ఎందుకు కాకూడదు అని ఒక ఫైన్ మార్నింగ్ పీకేకి తట్టిందో ఏమో జన సురాజ్ పార్టీని తన సొంత రాష్ట్రం బీహార్ లో స్థాపించి గత మూడేళ్ళుగా అక్కడ ప్రజలతో మమేకం అయ్యారు. జనంలో ఉంటూ కార్యక్రమాలు చేశారు. పర్యటనలు చేశారు. ముఖ్యంగా యూత్ అర్బన్ ఓటర్లలో కొంత చేంజ్ ని తీసుకుని వచ్చారు అని కూడా ప్రచారం సాగింది. తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయకుండా తన వారిని బరిలోకి నిలబెట్టడం ద్వారా పీకే ఒక బిగ్ ట్విస్ట్ ని ఇచ్చారు.
సర్వేలు చూస్తే అలా :
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు వచ్చేందుకు ఒక రోజు ఆగాలి. ఈలోగా ఎగ్జిట్ పోల్స్ అయితే వార్ వన్ సైడ్ అని తేల్చేసింది. అది కూడా ఎన్డీయేకు అనుకూలంగా పేర్కొంది. మళ్ళీ అధికారం ఎన్డీయేదేనని కూడా స్పష్టం చేసింది. ఇక వెనక్కి వెళ్తే ప్రీ పోల్ సర్వేలు కానీ పోస్ట్ పోల్ సర్వేలు కానీ ఎక్కడా పీకే పార్టీ జన సురాజ్ గురించి ఏమంత గొప్పగా చెప్పలేదు. బీహార్ లో రాజకీయం మొత్తం మారుతుందని పీకే భావించి బరిలోకి దిగినా ఆయన పార్టీ ప్రభావం ఏమీ ఉండదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. వస్తే గిస్తే ఒక్క సీటు దక్కుతుందని కూడా చెప్పేశాయి. ప్రీ పోల్ సర్వేలే నయం కనీస సింగిల్ డిజిట్ సీట్లు అయినా ఇచ్చాయి. ఏవి ఇచ్చినా ఏ నంబర్ వచ్చినా ఒక్కటి మాత్రం స్పష్టం అంటున్నారు. కింగ్ కావాలని పార్టీ సొంతంగా పెట్టి బీహార్ రాజకీయాలను మారుతాను అని కత్తి ఝళిపించిన పీకేకి ఇపుడు తన పార్టీ కింగ్ కాదని కింగ్ మేకర్ కూడా కాదని అర్ధమవుతోంది అంటున్నారు.
హంగ్ అయితే నో :
బీహార్ లో హోరా హోరీ పోరుగా సీన్ కనిపించినా సర్వేలు చూస్తే ఎన్డీయే అంటున్నాయి అది కూడా గుడ్ నంబర్ తో భారీ సీట్లతో ప్రభుత్వం స్థాపిస్తుంది అని అంటున్నారు. అలాగే ఏ ఒక్క సర్వే కూడా హంగ్ అని చెప్పలేదు. హంగ్ వస్తే కనీసం వస్తాయనుకున్న కొన్ని సీట్ల కింగ్ మేకర్ అవతారం ఎత్తవచ్చు అని పీకే భావిస్తూ ఉండొచ్చు అని అంటున్నారు. కానీ ఆ ఆశలూ తీరడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా నాలుగు గోడల మధ్యన కూర్చుని మైండ్ గేం తో వ్యూహాలు రచించడం కాదు పొలిటికల్ ఫీల్డ్ లో నిలబడి కలబడడం అన్నది పీకేకి అర్ధమయ్యేసరికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమని అంటున్నారు.
