దుకాణం మూసేయాల్సిందేనా? ప్రశాంత్ కిషోర్ వాట్ నెక్ట్స్
అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహాగట్ బంధన్ మధ్య జరిగిన పోరులో మహామహులే చిత్తుగా ఓడిపోయారు. ఎన్డీఏ ఏకపక్ష విజయంతో ప్రశాంత్ కిషోర్ వంటి వారు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
By: Tupaki Political Desk | 15 Nov 2025 2:00 AM ISTఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భవితవ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన ఎన్నికల వ్యూహాలతో మాయ చేస్తానని, ప్రభుత్వాలను మార్చేసేటంతటి ఘనుడిని అంటూ ప్రచారం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ కు తన సొంత రాష్ట్రమైన బిహార్ ప్రజలు గట్టి షాకిచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి దాదాపు రెండేళ్లపాటు జనం మధ్యే ఉన్న జనసురాజ్ పార్టీ అధినేత అయిన ప్రశాంత్ కిషోర్ ను నాయకుడిగా ఎవరూ అంగీకరించలేదని ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తన పార్టీ పరిస్థితిని ముందే ఊహించి ఆయన ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండగా, ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు. ఇక ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఓ వాగ్దానం ఇప్పుడు విస్తృత చర్చకు కారణమవుతోంది. ఈ ఎన్నికల్లో జేడీయూ 25 సీట్లు తెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రచారంలో సవాల్ చేశారు ప్రశాంత్ కిషోర్.
బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ పార్టీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రయాణం, పార్టీ మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012లో వ్యూహకర్తగా ప్రజలకు పరిచయమైన ప్రశాంత్ కిషోర్.. ఒకానొక దశలో దేశంలో శక్తిమంతుడుగా ప్రచారం దక్కించుకున్నారు. ఆయన వ్యూహాలతో తమ ప్రభుత్వాలు కూలిపోతాయేమోనన్న కొందరు ముఖ్యమంత్రులు భయపడేలా పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపలేవని బిహార్ ఎన్నికలు తేల్చిచెప్పాయి. గెలిచే వారి పక్షాన చేరి.. వారి బలాన్ని తన సమర్థతగా చాటుకోవడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ బిహార్ లో నిశ్చేష్టుడిగా చూస్తూ ఉండిపోవాల్సివచ్చింది.
అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహాగట్ బంధన్ మధ్య జరిగిన పోరులో మహామహులే చిత్తుగా ఓడిపోయారు. ఎన్డీఏ ఏకపక్ష విజయంతో ప్రశాంత్ కిషోర్ వంటి వారు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఇక జేడీయూకీ 25 సీట్లు రావని ప్రశాంత్ కిషోర్ చెబితే ఆ పార్టీ అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్నడూ లేనట్లు 83 చోట్ల విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ 92 చోట్ల, జేడీయూ 83 చోట్ల విజయం సాధించాయి. ఈ కూటమిలోని లోక్ జనశక్తి పార్టీ 29 చోట్ల పోటీ చేస్తే 26 చోట్ల గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇలా బిహార్ ఎన్నికల్లో అత్యధిక అంచనాలతో బరిలో దిగి అతి చెత్త రికార్డును ప్రశాంత్ కిషోర్ సొంతం చేసుకున్నారు. 243 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ కనీసం ఒక్కచోట కూడా చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ లెక్కన చూస్తే ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ రాజకీయ ప్రయాణం సందిగ్ధంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు. కాగా, తమ ఓటమిని అంగీకరిస్తూనే ప్రశాంత్ కిషోర్ పార్టీ నేతలు ఆశ్చర్యకరమైన ప్రచారాన్ని తలకెత్తుకుంటున్నారు. బిహార్ లో ప్రశాంత్ కిషోర్ వల్లే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా స్వరాష్ట్రంలో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిశోర్ వ్యూహాలకు ఇక విలువ ఉంటుందా? ఆయనను నమ్మి ఎవరైనా కోట్ల కొద్ది డబ్బు ఖర్చు చేస్తారా? అన్నదే ఇప్పుడు చర్చగా మారింది.
