ఈ మాత్రం దానికి రాజకీయాలెందుకు ‘పీకే’
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయలేదు, అయితే తన రాజకీయ అరంగేట్రానికి జనస్వరాజ్ పార్టీని వేదికగా చేసుకున్నారు.
By: A.N.Kumar | 22 Oct 2025 9:00 PM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతున్న వేళ, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆయన తన పార్టీ అభ్యర్థులను నామినేషన్ల ఉపసంహరణకు ప్రేరేపించారనే ఆరోపణలతో, "ఈ మాత్రం దానికి రాజకీయాలెందుకు?" అంటూ అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ వెనుక రాజకీయం
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయలేదు, అయితే తన రాజకీయ అరంగేట్రానికి జనస్వరాజ్ పార్టీని వేదికగా చేసుకున్నారు. ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు ఉండదన్న కారణంగానే, ఆయన అభ్యర్థులను నిలబెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా దానాపూర్, బ్రహంపూర్, గోపాల్‌గంజ్ స్థానాలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చింది.
ప్రశాంత్ కిషోర్ దీనికి భారతీయ జనతా పార్టీ (BJP) ఒత్తిడిని కారణంగా చూపారు. తమ అభ్యర్థులను బెదిరించి, బలవంతంగా నామినేషన్లు విత్‌డ్రా చేయించారని ఆయన బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోపాల్‌గంజ్ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవడం వెనుక కూడా బీజేపీ కుట్ర ఉందని పీకే మండిపడ్డారు.
'పీకే' వ్యూహంపై విమర్శలు
ఒకవైపు ఎన్నికల్లో పోటీ చేయిస్తూ, మరోవైపు అభ్యర్థులను విత్‌డ్రా చేయించడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. "స్వయంగా పోటీ చేయకుండా, అభ్యర్థులను నిలబెట్టి, మళ్లీ వారిని ఉపసంహరించుకునేలా చేయించడం కేవలం పబ్లిసిటీ స్టంట్ లేదా వెనుకడుగు వేసే వ్యూహం" అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. "ఈ మాత్రం దానికి బీహార్‌లో పార్టీ పెట్టడం, పోటీ చేయించడం ఎందుకు?" అని ప్రశ్నిస్తూ, ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రణాళికపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై ఆరోపణలు చేసినా, తమ పార్టీని బెదిరిస్తే, అభ్యర్థులను కాపాడుకోలేని బలహీనత పార్టీకి ఉందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ప్రశాంత్ కిషోర్ తనపై వచ్చిన ఈ విమర్శలను "బీహార్‌లో ఓటమి భయంతో బీజేపీ చేస్తున్న కుయుక్తులు"గా అభివర్ణించారు.
*బీహార్ ఎన్నికల ముఖచిత్రం
ప్రశాంత్ కిషోర్ అంశం పక్కన పెడితే, బీహార్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది, ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఎన్డీఏ కూటమి (NDA) మినహా, మిగతా పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండడం ప్రధానాంశం.నిన్నటివరకు కలిసి ఉన్న ఇండియా కూటమి పార్టీలు విభేదాల కారణంగా చివర్లో ఎవరి దారి వారు చూసుకోవడం ఎన్డీఏకు కలిసి వస్తుందనే అభిప్రాయం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించి, రాష్ట్రంలో పలు ర్యాలీలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు.
సమరం రసవత్తరంగా మారుతున్న ఈ తరుణంలో, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహం ప్రజల్లో ఎలాంటి చర్చకు దారి తీస్తుందో, ఆయన పార్టీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందో వేచి చూడాలి.
