కవిత పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ దిగుతున్నారా ?
బీహార్ లో సొంత పార్టీ పెట్టి ఏకంగా మూడేళ్ల ముందు నుంచే జనంలో తిరిగి ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న వారు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. ఆయన జన సూరజ్ పార్టీ రాజకీయంగా చతికిలపడింది.
By: Satya P | 21 Jan 2026 9:45 AM ISTబీహార్ లో సొంత పార్టీ పెట్టి ఏకంగా మూడేళ్ల ముందు నుంచే జనంలో తిరిగి ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న వారు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. ఆయన జన సూరజ్ పార్టీ రాజకీయంగా చతికిలపడింది. ఆ మీదట ఏమి చేయాలో ఆయనకు తెలియడం లేదని సెటైర్లు పేలాయి. అయితే ఇపుడు మళ్ళీ ఆయన పేరు తెలుగు రాష్ట్రాలలోనే మారుమోగుతోంది. ఆయన పూర్వాశ్రమం అయిన ఎన్నికల వ్యూహకర్త పాత్రలోకి వస్తున్నారని అంటున్నారు. అది కూడా తెలంగాణాలో కొత్తగా పార్టీ పెట్టాలని చూస్తున్న కల్వకుంట్ల వారి ఇంటి ఆడబిడ్డ కవిత కోసం ఆయన పనిచేయబోతున్నారు అని అంటున్నారు.
తొందరలోనే పార్టీ :
జాగృతి పేరుతో ఇప్పటికే జనంలో ఉన్న కవిత సాధ్యమైనంత తొందరలో పార్టీ పెట్టాలని చూస్తున్నారు. ఆమె పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యాభై కమిటీలను కూడా ఏర్పాటు చేశారు అని అంటున్నారు. రాజకీయంగా బలంగా మారాలని తెలంగాణాలో ఆల్టర్నేషన్ గా నిలవాలని కవిత చూస్తున్నారు అని అంటున్నారు. కవిత అయితే తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టి 2028లో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆమె ఆలోచనగా చెబుతున్నారు.
పీకే సీన్ లోకి :
సరిగ్గా ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కవితతో సమావేశం అయ్యారని అంటున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే కవితతో ఆయన వరస భేటీలు వేశారని అంటున్నారు. తన సొంత పార్టీని జనంలోకి ఎలా తీసుకుని వెళ్ళాలి ఎలా విధానాలు రూపొందించాలి. జనాన్ని ఆకట్టుకునే విధంగా స్లోగన్స్ ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాల మీద కవితకు పొలిటికల్ అడ్వైజర్ గా పీకే సూచనలు చేశారు అని అంటున్నారు.
ఆయనతో అయ్యేనా :
బీహార్ లో తన సొంత పార్టీనే జనంలో ఉంచి గెలిపించుకోలేకపోయిన పీకే తెలంగాణాలో కవిత పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లగలని అంటున్నారు. ఆయనతో అయ్యే పనేనా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇదే పీకే గతంలో కేసీఆర్ తోనూ పనిచేశారు అని గుర్తు చేస్తున్నారు బీఆర్ ఎస్ ని జాతీయ స్థాయిలో విస్తరించే విషయంలో సలహా సూచనలు ఇచ్చారని అంటున్నారు అయితే జాతీయ స్థాయి సంగతి పక్కన పెడితే తెలంగాణాలోనే బీఆర్ ఎస్ ఓడిందని కూడా అంటున్నారు. మరి పీకే సలహాలు కవితకు ఇస్తున్నారా ఆమె పాటిస్తున్నారా ఆయన మరోసారి స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తుతున్నారు అంటే ఈ ప్రచారానికి జవాబులు ఇప్పటికి అయితే దొరకవంతే. ఏది ఏమైనా పీకే మళ్ళీ తెలంగాణా వైపు చూస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
