మిడ్ టర్మ్ ఎఫెక్ట్ .. సర్ పై అమెరికా ఎంపీ !
ప్రమీలా జయపాల్ పోస్టుల నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్ వేదికగానే ఆమెకు సమాధానం ఇచ్చాడు.
By: Garuda Media | 16 Oct 2026 11:01 AM ISTఅమెరికాలో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికల ప్రభావం భారతదేశంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ మీదకు మళ్లింది. ‘భారత ప్రభుత్వం ఓటర్ల జాబితా నుండి 13 కోట్ల మంది పేర్లను తొలగించిందని, ఇది అమెరికాలో ట్రంప్ పరిపాలన ఓటింగ్ హక్కులను బలహీనపరిచే పద్దతికి సమానమని’ పేర్కొంటూ భారత సంతతి మూలాలు కలిగిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆమె వాషింగ్టన్ స్టేట్ నుండి ఎన్నికైన డెమోక్రాట్ ఎంపీ.
దీంతో పాటు ‘ప్రజాస్వామ్యాలను రక్షించడం అవసరమని, భారతీయులకు కూడా స్వేచ్చ, న్యాయమైన ఎన్నికలు కావాలని, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిణామాలకు జరిగే అహింసాయుత నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రమీలా జయపాల్ తన మరో ఎక్స్ పోస్ట్ లో వెల్లడించింది. అమెరికాలోని ఓటింగ్ హక్కుల చర్చను ఆమె భారతదేశంలో జరుగుతున్న సర్ ప్రక్రియతో పోల్చింది.
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ మీద దేశంలోని కాంగ్రెస్, ఆప్ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ ఓట్ల తొలగింపులు మైనారిటీలు, పేదలు లక్ష్యంగా ఉన్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో భారతీయ మూలాలు ఉన్న అమెరికా ఎంపీ తొలిసారి ఇలా స్పందించడం చర్చకు దారితీసింది.
ప్రమీలా జయపాల్ పోస్టుల నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్ వేదికగానే ఆమెకు సమాధానం ఇచ్చాడు. ‘ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని, భారత్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు, స్వేచ్చ, న్యాయమైన ఎన్నికల చరిత్ర ఉన్న ప్రజాస్వామ్యం’ అని పేర్కోన్నాడు.
తప్పుడు అవగాహనలు తొలగించేందుకు ఆమెతో చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఈసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్ ప్రక్రియ పారదర్శకంగా, రాజకీయ పార్టీల పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు ఆమోదంతో నడుస్తున్నదని, అర్హత ఉన్న వారిని తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని ఆయన తన ఎక్స్ ఖాతాలో వెల్లడించడం గమనార్హం.
