Begin typing your search above and press return to search.

‘నన్నే తీసేస్తారా..? ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు నగరంలో దాదాపు 65 లక్షల ఓట్లను ఊడదీశారని వార్తలు వస్తుంటే అందులో తన ఓటు కూడా ఉండటం చూసి ప్రకాశ్ రాజ్ అవాక్కయ్యారు.

By:  A.N.Kumar   |   11 Aug 2026 1:15 PM IST
‘నన్నే తీసేస్తారా..?  ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
X

ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా విచిత్రమైన మలుపులు తిరుగుతుంటుంది. నిన్నటిదాకా సామాన్యుల ఓట్లే గాల్లో కలిసిపోతున్నాయని అనుకుంటే ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీల ఓట్లకు కూడా స్కెచ్ పడిపోతోంది. బెంగళూరు నగరం సాక్షిగా జరుగుతున్న 'ప్రత్యేక సమగ్ర సవరణ' మహోత్సవంలో భాగంగా ఏకంగా వర్సటైల్ నటుడు, కేంద్ర ప్రభుత్వంపై నిత్య విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ఓటుకే ఎసరు పడింది. ఓటు పోయిందని బాధపడటం పక్కన పెడితే నాకే ఓటు లేకపోవడం ఏంట్రా బాబూ అని ఆయన నవ్వుకుంటూ వదిలిన సెల్ఫీ వీడియో ఇప్పుడు పొలిటికల్ సర్క్యూట్‌లో సరికొత్త సెటైర్ల వర్షం కురిపిస్తోంది.

బెంగళూరు నగరంలో దాదాపు 65 లక్షల ఓట్లను ఊడదీశారని వార్తలు వస్తుంటే అందులో తన ఓటు కూడా ఉండటం చూసి ప్రకాశ్ రాజ్ అవాక్కయ్యారు. అసలు ఈ నగరంతో తనకున్న బంధం ఎలాంటిదో ఆయన చాలా సరదాగా విడమరిచి చెప్పారు. బెంగళూరులోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదువుకున్నాను.. ఆఖరికి యాక్టింగ్ నేర్చుకుని.. మొన్నటికి మొన్న ఇదే ఊరి నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను సార్.. అలాంటి నాకే బెంగళూరులో ఓటు లేదంటే.. నాకంటే పెద్ద ఎన్ఆర్ఐ లేదా విదేశీయుడు ఇంకెవడైనా ఉంటాడా అని ఆయన వేసిన సెటైర్లు మామూలుగా లేవు. మళ్లీ ఓటు తెచ్చుకోవడానికి ఏమేం సర్టిఫికెట్లు అడుగుతారో ఏ క్యూలో నిలబెడతారో చూద్దాం, నేను దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు.

అక్కడితో ఆగితే ఆయన ప్రకాశ్ రాజ్ ఎందుకవుతారు? అసలైన పంచ్ డైలాగ్ ప్రధాని మోదీ వైపే విసిరారు. "మీకు ఓటు వేయరు అని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితా నుంచి తుడిచేసే పవర్ మీ దగ్గర ఉండుండొచ్చు. కానీ అసలు మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా?" అంటూ మోదీజీకి నేరుగా 'గేమ్ ఆన్' మెసేజ్ ఇచ్చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఓట్లను గాల్లో కలిపేస్తే.. ప్రజలు తమ ఆలోచనలను మార్చుకుంటారని అనుకోవడం అమాయకత్వమేనని ఆయన మార్కు వ్యంగ్యంతో ఎండగట్టారు.

అయితే నాణేనికి ఇంకో వైపు చూస్తే లీగల్ కష్టాలు కూడా తక్కువేమీ లేవు. గతంలో ప్రకాశ్ రాజ్‌కి ఒక్క రాష్ట్రంలో కాదు.. ఏకంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు ఉన్నాయంటూ పెద్ద రగడే నడిచింది. ఈ నాలుగు కార్డుల వ్యవహారంలో బెంగళూరు కోర్టు నుంచి నోటీసులు వస్తే స్పందించలేదని.. ఆమధ్య నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. చివరికి జులైలో కోర్టు మెట్లు ఎక్కి.. లాయర్ల వాదనలు వినిపించాక గానీ ఆయనకు బెయిల్ దక్కలేదు.

ఒకే మనిషికి నాలుగు రాష్ట్రాల్లో ఓటు ఉంటే తీసేయడం విధి నిర్వహణా? లేక నిజంగానే ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేసినట్టు ప్రతిపక్షాల, విమర్శకుల ఓట్ల ఏరివేతా? అనేది పక్కన పెడితే.. ప్రకాశ్ రాజ్ వదిలిన ఈ సెల్ఫీ బాంబు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా పేలుతోంది. అధికారులు దీనిపై ఎలాంటి కవరింగ్ ఇస్తారో ఈ 'ఓటు తీసివేత' ఎపిసోడ్ ఇంకెన్ని పొలిటికల్ ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.