దేశభక్తి మాటల్లో కాదు.. మన మార్కెట్‌లో కనిపించాలి
దీపావళి వేళ దేశవ్యాప్తంగా మార్కెట్లు వెలుగుల్తో మెరిసిపోతున్నా, ఆ వెలుగుల వెనుక “దేశభక్తి”కు సవాలు విసిరే ప్రశ్నను నటుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తారు.
By: A.N.Kumar | 21 Oct 2025 2:58 PM ISTదీపావళి వేళ దేశవ్యాప్తంగా మార్కెట్లు వెలుగుల్తో మెరిసిపోతున్నా, ఆ వెలుగుల వెనుక “దేశభక్తి”కు సవాలు విసిరే ప్రశ్నను నటుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తారు. ఆయన తనదైన “జస్ట్ ఆస్కింగ్” శైలిలో ఈసారి ‘మేడిన్ ఇండియా’ నినాదం వెనుక ఉన్న విరోధభాసాన్ని ఎత్తిచూపారు.
*దీపావళి మార్కెట్– స్వదేశీ నినాదం
ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పంచుకున్న దీపావళి మార్కెట్ వీడియోలో “గోబీ ఉంటే గుమ్మడికాయ కూడా ఉంటుంది” అంటూ తన ప్రత్యేకమైన హాస్యంతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాడు. ఆయన అభిప్రాయం ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రజలకు “విదేశీ వస్తువులను కొనవద్దు”, “స్వదేశీని ప్రోత్సహించండి” అని చెబుతూనే, మరోవైపు దేశీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తుల ఆధిపత్యం పెరుగుతుండడాన్ని చూసి మౌనం పాటిస్తోందని విమర్శించారు.
చైనా ఉత్పత్తుల మోజు కొనసాగుతోందా?
ప్రకాష్ రాజ్ ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళి కూడా మినహాయింపుగా లేదు. టపాసులు, లైట్లు, దీపాలంకరణలు.. దాదాపు 70 శాతం వరకు ఇప్పటికీ చైనాలో తయారు అవుతున్నాయని ఆయన ఆరోపించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెబుతూనే ఇంతటి దిగుమతి అనుమతించడంలో చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు.
*ప్రభుత్వం నిజంగా స్వదేశీ భావనతో ఉందా?
ప్రకాష్ రాజ్ అభిప్రాయం ప్రకారం మాటలకే గాక, ఆచరణలో కూడా “మేడిన్ ఇండియా”ను నిరూపించాల్సిన సమయం వచ్చింది.
అందుకోసం ఆయన సూచించినవి.. చైనాలోనుంచి దిగుమతి అయ్యే దీపావళి ఉత్పత్తులపై నిషేధం విధించాలని కోరారు. దేశీయ తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, మద్దతు ఇవ్వాలని.. స్వదేశీ బ్రాండ్లను ప్రోత్సహించేందుకు మార్కెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలతోనే “మేడిన్ ఇండియా” నినాదం అర్థవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
తయారీ శక్తి ఉన్న దేశం అయితే...
“మన దేశం తన సాంకేతికతతో రాకెట్లు, క్షిపణులు, యుద్ధ నౌకలు, రైళ్లు తయారు చేయగలుగుతోంది. అయితే సాధారణ అగ్గిపెట్టెలు, దీపావళి టపాకాయలు మాత్రం ఎందుకు తయారు చేయలేకపోతోంది?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలో ఆయన వ్యంగ్యం మాత్రమే కాదు. దేశీయ తయారీ విధానాలపై లోతైన ఆలోచనకు ఆహ్వానం కూడా ఉంది.
* నిజమైన స్వయం సమృద్ధి అవసరం
స్వదేశీ నినాదం కేవలం రాజకీయ ప్రచార నినాదంగా కాకుండా, ఆర్థిక స్వయం సమృద్ధి సాధనానికి దారితీయాలని ప్రకాష్ రాజ్ ఈ సెటైర్ ద్వారా చెప్పిన పాఠం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన “జస్ట్ ఆస్కింగ్” ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఒక చిట్టి హెచ్చరికనిచ్చారు. దేశభక్తి మాటల్లో కాదు, మన మార్కెట్‌లో కనిపించాలి.
