ప్రకాష్ రాజ్ చిలిపి సందేహం...చంద్రబాబు పవన్ గురించేనా ?
కేంద్రం అయితే 30 రోజులు వరుసగా జైలు జీవితం అనుభవించిన వారి పదవి పోతుంది అని పేర్కొంటూ ఒక బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.
By: Satya P | 22 Aug 2025 1:18 PM ISTవర్సటైల్ ఆర్టిస్ట్ కం రాజకీయ ఆసక్తిపరుడు అయిన ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన ఫిలాసఫీ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు హీటెక్కించే పొలిటికల్ ట్వీట్లు వేస్తూంటారు. కొన్ని సార్లు అవి సంచలనంగా సైతం మారుతూంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చాలానే చెబుతారు. అవి ఎవరికి తగలాలో వారికి సూటిగానే తగులుతుంది. తాజాగా ఆయన జస్ట్ ఆస్కింగ్ అనలేదు. తనకో చిలిపి సందేహం అన్నారు అంటూనే ఏపీ పాలిటిక్స్ లో ఒక చిన్నపాటి రాజకీయ మంటనే పెట్టేశారు.
30 రోజులు అంటే అర్థం అదేనా :
కేంద్రం అయితే 30 రోజులు వరుసగా జైలు జీవితం అనుభవించిన వారి పదవి పోతుంది అని పేర్కొంటూ ఒక బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మీదనే సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ బిల్లు బీహార్ లో నితీష్ కుమార్ ని ఏపీలో చంద్రబాబుని కట్టడి చేయడానికే అని ఇప్పటికే విపక్షాలు దేశవ్యాప్తంగా విశ్లేషిస్తున్నాయి. దానికి కాస్తా కొనసాగింపు అన్నట్లుగా కేవలం ఏపీ పాలిటిక్స్ మాత్రమే పరిమితం చేస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా వేసిన ట్వీట్ అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది. పైగా ఆయన తెలుగులో ఈ ట్వీట్ చేయడంతో చంద్రబాబు పవన్ ల గురించేనా అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది.
ఒక సీఎం ఒక మాజీ సీఎం అంటూ :
మాజీ సీఎం కానీ ప్రస్తుత సీఎం కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి తమ మాట పూర్తిగా వినే ఉప ముఖ్యమంత్రిని సీఎం గా చేసే కుట్ర ఏమైనా ఈ 30 రోజుల జైలు బిల్లు వెనక ఉందా అని తన చిలిపి సందేహాన్ని ప్రకాష్ రాజ్ రాజకీయ సెటైర్ మిళాయిస్తూ మరీ వ్యక్తం చేశారు. ఇక్కడ మాజీ సీఎం అంటే జగన్ అని ప్రస్తుత సీఎం అంటే చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ అని అర్థం చేసుకుంటే ప్రకాష్ రాజ్ చిలిపి సందేహం వెనక ఉన్న పొలిటికల్ ట్విస్ట్ ఆయన వేసిన ట్వీటూ బోధపడతాయని అంటున్నారు.
బీజేపీని గుచ్చుతూనే అలా :
తన సిద్ధాంతాలకు పడని బీజేపీని ఒక వైపు గుచ్చుతూనే మరో వైపు ఏపీ పాలిటిక్స్ లో కూడా కొత్త ట్విస్టులు చూపించే ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేశారు అనుకోవాలి. 30 రోజుల బిల్లు వెనక కుట్ర ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించిన తీరుతో అన్ని పార్టీలను కలిపి మరీ పెద్ద డౌట్లే పెట్టేసారు అని అంటున్నారు. బీజేపీకి చూస్తే ఏపీ రాజకీయాల్లో బలం అత్యల్పం. పవన్ మీద ఆధారపడింది అని అంటారు. సమయానుకూలంగా చంద్రబాబుని జగన్ ని వాడుకుంటూ ఏపీలో తన రాజకీయ ఆలోచనలను అమలు చేయాలని బీజేపీ ఎదురుచూస్తోంది అని అంటారు
బహుశా ఈ విషయాలు అన్నీ కూడా కేవలం ఒక చిన్న ట్వీట్ ద్వారా ప్రకాష్ రాజ్ వ్యక్తపరచారా అన్నదే చర్చ. మొత్తానికి ఏపీ మీద బీజేపీకి ఉన్న రాజకీయ అభిప్రాయం కానీ అవగాహన కానీ ఇదీ అని ప్రకాష్ రాజ్ తేటతెల్లం చేశారు అని అంటున్నారు. ఏపీలో అంతిమంగా బీజేపీ తన విస్తరణ చూసుకుంటుందని అంతా అంటున్నదే. అందుకే ప్రకాష్ రాజ్ ట్వీట్ లో కూడా తన మాట వినే ఉప ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు. మొత్తం మీద 30 రోజుల జైలు బిల్లుకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో చర్చకు దారి తీసే లాగానే ఉంది. చూడాలి మరి ఆయన చిలిపి సందేహాలే నిజం అవుతాయా లేక ఏమవుతుంది అన్నది.
