Begin typing your search above and press return to search.

ధర్మస్థల వివాదం: 200 కోట్ల కుట్ర కోణంపై విచార‌ణ‌.. త‌న‌పై కుట్ర జ‌రిగింద‌న్న‌ ప్రకాష్ రాజ్!

ప్రముఖ పుణ్యక్షేత్రం `ధర్మస్థలి`కు వ్యతిరేకంగా కుట్ర జ‌రుగింద‌ని, దీనిలో భాగంగా 200కోట్ల డీల్ కుదిరింద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   17 Jun 2026 9:02 PM IST
ధర్మస్థల వివాదం: 200 కోట్ల కుట్ర కోణంపై విచార‌ణ‌.. త‌న‌పై కుట్ర జ‌రిగింద‌న్న‌ ప్రకాష్ రాజ్!
X

ప్రముఖ పుణ్యక్షేత్రం `ధర్మస్థలి`కు వ్యతిరేకంగా కుట్ర జ‌రుగింద‌ని, దీనిలో భాగంగా 200కోట్ల డీల్ కుదిరింద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా బ‌య‌ట ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. తాజాగా ఈ కుట్రలో ప్ర‌కాష్ రాజ్ కూడా ఉన్నార‌ని ఆరోపిస్తూ ధ‌ర్మ‌స్థ‌లి పారిశ్రామిక కార్మికుడు కోర్టు పిటిష‌న్ లో పేర్కొన‌డంతో ఇది పెద్ద ర‌చ్చ‌వుతోంది.

అయితే ఇదంతా చూస్తుంటే త‌న‌పై ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని, త‌న‌ను హిందూ వ్య‌తిరేకిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌త్యారోప‌ణ‌లు చేసారు. ఈరోజు ఆయ‌న మీడియా ఎదుట‌కు వ‌చ్చి.. అస‌లు ధ‌ర్మ‌స్థ‌లి వివాదంతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో కోర్టులో పిటిష‌న్ వేసిన‌ చిన్న‌య్య గిరీష్ అనే వ్య‌క్తి మాట‌లు విని త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని ప్ర‌త్యారోప‌ణ‌లు చేసారు. సిట్ ద‌ర్యాప్తు త‌ర్వాత చిన్న‌య్య మాట మార్చార‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. నాతో చిన్న‌య్య ఫోన్ లో మాట్లాడారు. ఈ విష‌యాన్ని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చీఫ్‌తో మాట్లాడాన‌ని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడ‌తాన‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.

వివాదం ఎలా మొదలైంది?

ఈ వివాదం కొన్ని నెలల క్రితం చిన్న‌య్య అనే వ్యక్తి చేసిన సంచలన ఆరోపణలతో మొదలైంది. కర్ణాటకలోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల పరిసర ప్రాంతాలలో గతంలో కొందరు మహిళలు, మైన‌ర్ల‌ను దారుణంగా హత్య చేసి, వారి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టారంటూ చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న ధర్మస్థల క్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

ఈ దర్యాప్తు ప్రక్రియలో భాగంగా చిన్నయ్య చూపించిన కొన్ని ప్రాంతాలలో అధికారులు తవ్వకాలు కూడా జరిపారు. అయితే ఆ తవ్వకాల సమయంలో చిన్నయ్య ముఖానికి మాస్క్ ధరించి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్ప‌దంగా ప్రవర్తించడం వివాదాన్ని రేపింది. అతడికి తెరవెనుక నుండి ఎవరో ఫోన్ ద్వారా సూచనలు ఇస్తున్నారని.. ఈ కేసు వెనుక ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులైన వీరేంద్ర‌ హెగ్గడే ప్రతిష్ఠను దెబ్బతీసే పెద్ద కుట్ర దాగి ఉందని పుణ్య‌క్షేత్ర సంర‌క్ష‌ణ స‌మితి ఆరోపించింది.

చిన్నయ్య ఈ కేసులో ప్రాథమిక ఫిర్యాదుదారుడు. ధర్మస్థల పరిసరాల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టులను, పోలీసులను ఆశ్రయించింది ఇతడే. అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ చిన్నయ్య ఫిర్యాదుదారుడి స్థానం నుండి ప్రధాన అనుమానితుడిగా మారాడు.

ఆరోపణలు - డీల్ రూమర్స్:

చిన్నయ్య స్వతంత్రంగా ఈ ఆరోపణలు చేయడం లేదని, ధర్మస్థలకు వ్యతిరేకంగా మసిపూసేందుకు కొందరు పన్నిన కుట్రలో అతడు కేవలం ఒక ముసుగు మేన్ మాత్రమేనని ఆరోపణలు వచ్చాయి. ఈ కుట్ర కోసం చిన్నయ్యకు కొందరు శక్తుల నుండి దాదాపు రూ.50 లక్షల రూపాయల డీల్ కుదిరినట్లు దర్యాప్తులో సమాచారం బయటకు వచ్చింది.

హైకోర్టు పిటిషన్ - ప్రకాష్ రాజ్ పేరు:

ఇటీవ‌ల ఎస్‌ఐటి దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని కోరుతూ చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ లోనే నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ధ‌ర్మ‌స్థ‌లిపై 200కోట్ల కుట్ర కోణం గురించి ప్ర‌స్థావించిన చిన్న‌య్య ప్ర‌కాష్ రాజ్ పేరును చేర్చ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనితో చిన్నయ్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.