Begin typing your search above and press return to search.

'మ‌హిళా ప‌క్ష' మాజీ ప్ర‌ధాని కుటుంబంలో విష‌పు మొక్క‌.. ప్ర‌జ్వ‌ల్‌!

అలాంటి కుటుంబంలో పుట్టిన యువ నాయ‌కుడు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌. వ‌య‌సు 38 సంవత్స‌రాలే. అయితేనేం.. తాత‌, తండ్రి ప‌రువుతో పాటు.. కుటుంబ ప‌రువును కూడా రోడ్డుకు లాగిన యువ నాయ‌కుడిగా పేరు మోశారు.

By:  Garuda Media   |   3 Aug 2025 3:00 AM IST
మ‌హిళా ప‌క్ష మాజీ ప్ర‌ధాని కుటుంబంలో విష‌పు మొక్క‌.. ప్ర‌జ్వ‌ల్‌!
X

దేశానికి 11 మాసాల పాటు ప్ర‌ధానిగా(1 జూన్‌ 1996 నుంచి 21 ఏప్రిల్‌ 1997 వ‌ర‌కు) ప‌నిచేసిన హ‌రిహ‌ద‌న హ‌ళ్లి దొడ్డిగౌడ(హెచ్ డీ) దేవెగౌడ‌.. విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన ప్ర‌ధానిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసినా.. దేశానికి ప్ర‌ధాన మంత్రిగా ప‌నిచేసినా.. ఆయ‌న మ‌హిళా పక్ష‌పాతిగా పేరు తెచ్చుకున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న హ‌యాంలోనే మ‌హిళ‌ల‌కు సంబంధించి పెండింగులో ఉన్న అనేక బిల్లులు చ‌ట్టాలుగా మారాయి. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో 30 శాతం హ‌క్కుతోపాటు.. స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకునే హ‌క్కును కూడా క‌ల్పించారు.

అంతేకాదు.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ప్ర‌సాదించిన ఏకైక ముఖ్య‌మంత్రిగా కూడా దేవెగౌడ రికార్డు సృష్టించారు. సుమారు 60 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న దేవెగౌడ‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అవినీతి, అక్ర‌మాలే కాదు.. మ‌హిళ‌ల‌పై వేధింపులు వంటి ఆరోప‌ణ‌లు మ‌చ్చుకు కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. ఆయ‌న‌ను 'మ‌హిళా ప‌క్ష' నేత‌గా అభివ‌ర్ణిస్తారు. అలాంటి కుటుంబంలో పుట్టిన యువ నాయ‌కుడు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌. వ‌య‌సు 38 సంవత్స‌రాలే. అయితేనేం.. తాత‌, తండ్రి ప‌రువుతో పాటు.. కుటుంబ ప‌రువును కూడా రోడ్డుకు లాగిన యువ నాయ‌కుడిగా పేరు మోశారు.

ఇంట్లో వంట మ‌నిషిపై ప‌లు మార్లు అత్యాచారం చేయ‌డంతో పాటు.. వాటిని వీడియోలు తీసి.. పో*ర్న్ సైట్‌ల‌లో పెట్టార‌న్న ఆరోపణ‌లు రుజువు కావ‌డంతో బెంగ‌ళూరులోని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల కేసులు విచారించే కోర్టు.. ప్ర‌జ్వ‌ల్‌కు జీవిత ఖైదును విధించింది. ఈ ఘ‌ట‌న రాజ‌కీయాల‌నే కాదు.. రాష్ట్రాన్ని సైతం కుదిపేసింది. త‌దుప‌రి వార‌సుడిగా.. రాజ‌కీయాల్లో మేలిమి భ‌విత‌వ్యం ఉన్న ప్ర‌జ్వ‌ల్‌.. ఇప్ప‌టికే 15 నెల‌లుగా జైల్లో ఉన్నారు. ఒకానొక సంద‌ర్భంలో బెయిల్ కూడా ద‌క్క‌లేదు. అలాంటి నేరాలు చేసిన వ్య‌క్తిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

దేవెగౌడ క‌న్నీరు!

''రాజ‌కీయంగా వివాదాలు ఉండొచ్చు.. కానీ, వ్య‌క్తిగ‌తంగా మాత్రం వివాదాలు ఉంటే రాజ‌కీయాల‌కు ప‌నికిరారు.'' అంటూ.. ఒక‌ప్పుడు ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ను ఉద్దేశించి.. దేవెగౌడ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు అధికార ప‌క్షం వైర‌ల్ చేస్తోంది. దీనికి కారణం.. సొంత ఇంటి నుంచే విష‌పు మొక్క వెలుగు చూడ‌డం. ఇక‌, దేవెగౌడ ప్ర‌స్థానంలో అనేక మంది యువ నాయ‌కులు వెలుగులోకి వ‌చ్చారు. ఎంతోమందికి ఆయ‌న రాజ‌కీయ భిక్ష పెట్టారు. కానీ, విచ్చ‌ల‌విడి స్వేఛ్ఛ‌, అధికార దుర్వినియోగం.. చిన్న ‌వ‌య‌సులోనే మితిమీరిన వ్య‌వ‌హార శైలికి అడ్డుక‌ట్ట వేయ‌లేని దైన్యం.. వంటివి ఇప్పుడు అదే దేవెగౌడ‌ను 94 సంవ‌త్స‌రాల వ‌య‌సులో క‌న్నీరు పెట్టుకునేలా చేశాయి.