ప్రజ్వల్ ఫోన్‌లో 140కి పైగా అశ్లీల వీడియోలు.. ఫోరెన్సిక్‌లో సంచలన విషయాలు
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
By: A.N.Kumar | 12 Sept 2026 11:00 PM ISTఅత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌పై నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో 140కి పైగా అశ్లీల వీడియోలు, ఓటీటీ కంటెంట్ ఉన్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఈ పరిణామం కర్ణాటక రాజకీయ, జైలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో క్రైం బ్రాంచ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత నెల 11న సర్‌ప్రైజ్ చెకప్‌లో భాగంగా జైలులోని బ్యారక్‌లను తనిఖీ చేస్తుండగా ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో పాటు చార్జర్, పెన్‌డ్రైవ్, నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి సాంకేతికంగా పరిశీలించారు.
ఫోరెన్సిక్ పరిశీలనలో మొబైల్ ఫోన్‌లో 140కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అదే విధంగా పెన్‌డ్రైవ్‌లో ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కంటెంట్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు అధికారులు మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే జైలులో ఉన్న ప్రజ్వల్‌కు మొబైల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే అంశం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఫోన్ తనది కాదని.. ఇతర ఖైదీలు దానిని విడతల వారీగా ఉపయోగించేవారని ప్రజ్వల్ గతంలో అధికారుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అతని వద్దే ఫోన్ లభించడం, అందులో భారీగా అశ్లీల వీడియో కంటెంట్ బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా చేరాయన్న అంశంపై జైలు అధికారుల పాత్రపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఓ జైలు అధికారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. జైల్లో భద్రతా నిబంధనల అమలు ఖైదీలకు నిషేధిత వస్తువులు చేరకుండా తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చ మొదలైంది.
- రేప్ కేసులో జైలుపాలైన ప్రజ్వల్ రేవణ్ణ
హాసన్ జిల్లా హొళెనర్సిపురలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫాంహౌస్‌లో 48 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి దృశ్యాలను చిత్రీకరించిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధించడంతో ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు వంటి అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి వద్ద మొబైల్ ఫోన్ లభించడం, ఫోరెన్సిక్ పరిశీలనలో పెద్ద మొత్తంలో అభ్యంతరకర డిజిటల్ కంటెంట్ బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఫోన్ వినియోగం వెనుక మరెవరైనా ఉన్నారా? నిషేధిత పరికరం ప్రజ్వల్‌కు ఎలా చేరింది? డిజిటల్ కంటెంట్ ఎప్పుడు, ఎలా ఫోన్‌లోకి వచ్చింది? అనే అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది.
