మోడీ పాలన గురించి సోదరుడు సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోడీ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మోడీ పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 4 March 2026 8:49 PM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏకంగా పుష్కర కాలం నుంచి పాలన సాగుతోంది. ఒక కాంగ్రెసేతర ప్రధాని వరుసగా మూడు సార్లు గెలవడం ఒక రికార్డు అయితే మూడు పర్యాయాలు ప్రధాని గా కొనసాగడం ద్వారా తొలి ప్రధాని పండిట్ నెహ్రూ రికార్డుని సమం చేయడం మరో ఎత్తు. ఇక 2029 వరకూ మోడీ ప్రధానిగా కొనసాగుతారు కాబట్టి 15 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ఉన్నత పదవిలో ఉన్న నేతగా మరో రికార్డు ని కైవశం చేసుకుంటారు. ఇక నాలుగవ సారి ప్రధాని కావాలని మోడీ అండ్ టీం ఇప్పటి నుంచే గట్టిగానే కసరత్తు చేస్తోంది.
ఏపీకి వచ్చిన సోదరుడు :
మోడీ పాలన సంగతి ఎలా ఉంది అంటే వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అన్నదే కొలమానంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. విపక్షాలు అయితే విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి సొంత కుటుంబ సభ్యుడు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఎపుడూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీకి వచ్చిన నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సైతం చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం ఆయనకు అందించారు. అలాగే ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రం తో సత్కరించారు.
కుటుంబ సభ్యుడి రియాక్షన్ :
ఇక ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోడీ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మోడీ పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది అని అన్నారు. భారతదేశం అతి తక్కువ సమయంలోనే విశ్వగురువు స్థానాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్ధించాను అని ప్రహ్లాద్ మోడీ చెప్పడం విశేషం. అదే విధంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా పూర్తిగా సమసి పోవాలని అంతటా శాంతియుత వాతావరణం రావాలని స్వామివారిని ప్రార్థించినట్టు ప్రహ్లాద్ మోడీ చెప్పారు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వెంటనే ముగిసిపోవాలని ఆయన కోరుకున్నారు.
తమ్ముడుగా అన్న కోసం :
ఇదిలా ఉంటే ప్రహ్లాద్ మోడీ నరేంద్ర మోడీకి తమ్ముడు.నరేంద్ర మోడీకి నలుగురు సోదరులు ఉన్నారు, వారిలో ఇద్దరు అన్నయ్యలు సోమాభాయ్ మోడీ, అమృత్ మోడీ, మూడవ వారిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఇక ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వారిలో పెద్ద తమ్ముడే ఈ ప్రహ్లాద్ మోడీ. అలాగే చివరి తమ్ముడు పంకజ్ మోడీ. ఇక అమృత్ మోడీ రిటైర్డ్ లాత్ మెషిన్ టెక్నీషియన్గా ఉంటే. పంకజ్ మోడీ గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
