సీఎం సిద్దూ...డీసీఎం డీకే....ఇద్దరికీ నోటీసులు...
కర్ణాటకలో సీఎం సీటు కోసం సాగుతున్న పోరు మంచి టీవీ సీరియల్ ను తలపిస్తోంది.
By: Tupaki Political Desk | 8 Dec 2025 5:04 PM ISTకర్ణాటకలో సీఎం సీటు కోసం సాగుతున్న పోరు మంచి టీవీ సీరియల్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి ఉపముఖ్య మంత్రి ఇద్దరూ హోరాహోరీగా సీటు కోసం పోరాడుతున్నారు. కిస్సీ కుర్చీకా అని సాగుతున్న ఈ ఆసక్తికర ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లా సీఎం సిద్దరామయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.2023లో అసెంబ్ల ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఎన్నికను సవాల్ చేస్తూ కె.శంకర్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ కు సమాధానం ఇవ్వాల్సిందిగా సీఎం సిద్ధరామయ్యకు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వారిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చేతికి కట్టుకున్ వాచీపైనా కూడా ఆరోపణలు ఆగలేదు. అది ఖరీదైనదని...క్విడ్ ప్రోకో కిందే అతనికి ఇచ్చారని కొందరు విమర్శించారు. మొదట్లో అలాంటి విమర్శ వస్తే సిద్ధరామయ్య తన వాచీని అసెంబ్లీ మ్యూజియంకు ఇచ్చేశారు. ఇపుడు ఏకంగా సుప్రీం నోటీసులిచ్చింది. అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని...ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారి ఎన్నిక చెల్లదని ప్రకటించాల్సిందిగా సదరు వ్యక్తి పిటిషన్లో పెర్కొన్నారు. మొదట ఫిర్యాదుదారుడు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆ పిటిషన్ ను తిరస్కరించారు. కానీ అంతటితో ఆగకుండా...సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
మరోవైపు డిప్యూటీసీఎం డీకే శివకుమార్ కు నోటీసులు అందాయి. అయితే ఈ నోటీసుల్ని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈవోడబ్ల్యూ జారీ చేసింది. ఈనెల 19లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఆర్థిక విషయాలు, లావాదేవీలకు సంబంధించి వివరణ కోరుతూ ఆర్థిక నేర విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ ఐర్ కట్టారు.
సీఎం సీటులో కొనసాగాలని సిద్దరామయ్య పట్టుబడుతుండగా...ఒప్పందం ప్రకారం పవర్ షేరింగ్ ఉండితీరాలని తనకు సీఎం సీటు దక్కాలని డిసీఎం డీకే శివకుమార్ అంతే బెట్టుగా ఉంటున్నారు. వీరి మధ్య విందురాజకీయాల పరంపర కొనసాగుతునే ఉంది. ఇరు నేతల మద్దతుదారులు రెండు క్యాంపులుగా వీడిపోయి బాహాబాహీ అన్నట్లు వ్యవహరం సాగుతుంటే...సందట్లో సడేమియాలా ఇద్దరు నేతలకు నోటీసులు రావడంతో మద్దతుదారులు సైలంట్ అయిపోయారు. అటు సుప్రీం కోర్టు సీఎంకు, ఇటు ఈవోడబ్ల్యూ డీసీఎం డీకే శివకుమార్ కు నోటీసులు ఇవ్వడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
