Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాతో రెండు రోజులలో నలుగురు పీఎంలు రాజీనామా !

సోషల్ మీడియా పవర్ ఏంటో తెలుస్తోందా లేక దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలం చెందుతున్నారా తెలియదు కానీ ఇది అక్షరాల నిజం

By:  Satya P   |   12 Sept 2025 5:00 AM IST
సోషల్ మీడియాతో రెండు రోజులలో నలుగురు పీఎంలు రాజీనామా !
X

సోషల్ మీడియా పవర్ ఏంటో తెలుస్తోందా లేక దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలం చెందుతున్నారా తెలియదు కానీ ఇది అక్షరాల నిజం. ఏకంగా రెండు రోజుల వ్యవధిలో నలుగురు ప్రధాన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు అంటే సోషల్ మీడియా పదునైన కత్తి అని అర్ధం అవుతూనే ఉంది. నిజానికి సోషల్ మీడియా అంటే లైట్ తీసుకున్న వారికి సైతం ఇపుడు అది ఎంత శక్తివంతమైనదో పూర్తిగా బోధపడింది అని అంటున్నారు.

నేపాల్ ని వణికించేలా :

ప్రభుత్వాలు పాలకులు కనుక ఉదాశీనంగా వ్యవహరించినా లేక చూసీ చూడనట్టుగా నిర్లక్ష్యంగా పోయినా కూడా అసలు ఊరుకునే తరం ఈ రోజు లేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సైన్యం ఏ మాత్రం స్పేర్ చేయదు అని అంటున్నారు. జనరేషన్ జెడ్ ముందు ఎవరైనా ఎంతటి వారు అయినా కుప్ప కూలిపోతారు అని చెప్పడానికి తాజా ఉదాహారణ నేపాల్ లో ప్రభుత్వం నేలమట్టం కావడం. ఏకంగా దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశమే విడిచిపోవడం. సలసల మండే నెత్తురు లాంటి జనరేషన్ జెడ్ తో పెట్టుకుంటే ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లుగా నేపాల్ ఉదంతంతో ప్రపంచం చూసింది అని అంటున్నారు

ప్రధానులనే తరిమి కొడుతున్నారు :

ఇది వింత పోకడ లేక కొత్త దూకుడా అన్నది కనుక కాస్తా పక్కన పెడితే జనరేషన్ జెడ్ వీర ప్రతాపం ఇది అని చెప్పక తప్పదు. తరాల మధ్య అంతరాలు ఎంత ఉన్నా ఇంత స్పీడ్ ని చూసిన తరం అయితే ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ తొలిసారి చూసింది. దేశ ప్రధానులనే తరిమి కొట్టిన అరుదైన సందర్భాన్ని కూడా కళ్ళారా చూసింది. అసలు ఈ విధంగా ప్రపంచంలో పరిస్థితులు కానీ పరిణామాలు కానీ మారాయి అంటే ఏమి జరుగుతోంది సోషల్ మీడియా జనరేషన్ ఎంత బలమైనది అన్నది ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

యువత ఒక సునామీ :

యువతరాన్ని తక్కువ అంచనా వేయరాదు. అందునా జనరేషన్ జెడ్ అంటేనే కొత్త ప్రపంచం. ఏలికలకు వారితో కనెక్షన్ ఎంత వరకూ ఉంది అన్నది కూడా తెలియదు. అంతే కాదు ఒక బిగ్ గ్యాప్ అన్నది ఉంది. ఈ వ్యత్యాసాల మధ్య తరాల అంతరాల మధ్య వారి భావనలను కనుక సరిగ్గా అర్ధం చేసుకోకపోతే మాత్రం ఏకంగా కొంపలు కావు, దేశాలే అంటుకుపోతాయి. దానికి నిట్ట నిలువు ఉదాహరణయే నేపాల్ మారణ కాండ.

వీటి విషయంలో అలెర్ట్ :

ఇక నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఉంది. అయితే ఎక్కువ తక్కువలు చూసుకోవాలి. యువతలో అశాంతికి ఇక్కడే బీజం పడుతుంది. ఖాళీగా ఉన్న వారు చేసే పనులు ఎవరూ ఊహించలేరు సమాజానికి ఎంతో శక్తిగా ఉండాల్సిన యువత కనుక ఏ పనీ లేకుండా ఉంటే ఆ పాపం నేరం సమాజానిదే. అంతే కాదు ఏలిన వారిదే ఆ నేరం అవుతుంది. అందుకే ఏ దేశంలో పాలకులు అయినా పూర్తిగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం యువతరం ఆగ్రహం కట్టలు దాటుతుంది. అది సునామీనే తలపిస్తుంది అని చెప్పాలి అంతే కాదు అవినీతి అక్రమాలను ఆ తరం అసలు ఊహించలేదు, ఏ మాత్రం సహించలేదు, తట్టుకోలేదు కూడా. దాంతో దాని మీద కూడా అంతా బాగానే ఉంది ఎవరూ ఏమీ అనుకోరులే అని విచ్చలవిడితనం చేస్తే తగిన శాస్తి చేసేందుకు నవతరం ఎపుడూ సిద్ధంగా ఉంటుంది.

తిరగబడితే బడిత పూజే :

యువత పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలోని బడబాగ్ని లాంటి వారు. అది ఎపుడు ప్రజ్వరిల్లుతుందో ఎవరికీ తెలియదు. ఆ నిప్పుని ఏ నీరూ ఆపలేదు సరికాదా లావా మాదిరిగా విరుచుకుపడే ఆ అగ్ని కీలక ముందు మాడి మాసి అయిపోతారు. ఇపుడు నేపాల్ లో అదే జరుగుతోంది. ఇక చూస్తే కేవలం రెండు రోజుల వ్యవధిలో నేపాల్, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్ ఇలా నలుగురు ప్రధానులు తమ పదవులు వదులుకున్నారు. ఇదంతా సోషల్ మీడియా అధికార పీఠాల మీద కసిగా కొట్టిన అతి పెద్ద చావు దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా రానున్న రోజులలో ఎన్ని దేశాలలో ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తాము పై నుంచి దిగి వచ్చిన దేవతలమని ఎవరూ భావించుకోకూడదు, తాము ప్రజలకు సేవ చేసే వారమని గుర్తించి మంచి పనులు చేయాలి, అభివృద్ధికి అంకితం కావాలి. లేకపోతే పీఠాలే కాదు దేశాలనే తెచ్చి అగ్గిలో కడిగేస్తుంది జనరేషన్ జెడ్. తస్మాత్ జాగ్రత్త.