అమరజీవికి అదే అసలైన నివాళి
పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తామని అంటోంది. అమరావతి రాజధానిలో ఆయన 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తోంది.
By: Satya P | 16 March 2026 10:08 AM ISTఅమరజీవి పొట్టి శ్రీరాములు లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ అన్న రాష్ట్రమే లేదు. ఆనాడు 58 రోజుల పాటు ఆయన సుదీర్ఘమైన ఉపవాస దీక్ష చేసి ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఆయన పట్టుదల అకుంఠిత దీక్ష, అంకితభావం ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి పెట్టాయి. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు మరణిస్తే 1953 అక్టోబర్ 1 న కర్నూల్ రాజధానిగా ఏపీ రాష్ట్రం ఆవిర్భవించింది. నాటి దేశ ప్రధాని పండిట్ నెహ్రూ స్వయంగా కర్నూల్ కి వచ్చి ఆంధ్ర రాష్ట్ర తొలి ఆవిర్భావ ఉత్సవాలలో పాల్గొన్నారు.
విలీనం అలా జరిగింది :
అయితే మూడేళ్ళు తిరక్కుండానే 1956 లో ఆంధ్ర రాష్ట్రం ఆనాటి హైదరాబాద్ స్టేట్ లో విలీనం అయింది. అపుడు ఆంధ్ర రాష్ట్రం పేరు కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. అయితే 58 ఏళ్ళకు తిరిగి విభజన కూడా జరిగింది. అలా 2014 జూన్ 2న తెలంగాణా స్టేట్ ఆవిర్భవించింది. దాంతో పాటే ఉమ్మడి ఏపీకి ఉన్న ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1 తీపి గురుతులు కూడా చెరిగిపోయాయి. తెలంగాణా ప్రతీ ఏడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఒక్క తెలంగాణా మాత్రమే కాదు దేశంలోని మొత్తం అన్ని రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. కానీ ఏపీ మాత్రం ఆవిర్భావ దినోత్సవాలు లేకుండా అలా ఉండడం అయితే బాధాకరం అని చెప్పాల్సి ఉంది.
ఆయన ఆశయాల కోసం :
పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తామని అంటోంది. అమరావతి రాజధానిలో ఆయన 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తోంది. ఆ విధంగా మార్చి 16 ని పొట్టి శ్రీరాములు 125వ జయంతిగా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ అంతా హర్షించే కార్యక్రమాలే. అమరజీవికి ఇది దక్కాల్సిన గౌరవమే. అందుకు గానూ కూటమి ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో ఆయన అసలైన ఆశయాల కోసం ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
ఆ రోజునే ప్రకటించాలి :
ఏపీ ఆవిర్భావ దినోత్సవంగా అక్టోబర్ 1 ని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర అభిమానులు అంతా కోరుకుంటున్నారు. మహానుభావుడు ఏకంగా 58 రోజులు దీక్ష పూని తాను బలిదానం చెంది రాష్ట్రాన్ని అందించారు. అందుకే ఆయనని నిరంతరం స్మరించే విధంగా ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాలను అక్టోబర్ 1 నుంచి చేసుకోవాలి. ఈ ఏడాదే దానికి శ్రీకారం చుట్టాలి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అంతా ఆశిస్తున్నారు.
