Begin typing your search above and press return to search.

జంపింగుల జంఝాటం.. ఏం జ‌రుగుతోంది ..!

గత ఎన్నికల‌కు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నేతల వరకు అనేకమంది పలు పార్టీల్లో చేరారు.

By:  Garuda Media   |   20 Nov 2025 6:00 AM IST
జంపింగుల జంఝాటం.. ఏం జ‌రుగుతోంది ..!
X

గత ఎన్నికల‌కు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నేతల వరకు అనేకమంది పలు పార్టీల్లో చేరారు. కొందరు జనసేన, మరికొందరు బిజెపి, ఇంకొందరు టిడిపి బాటా పట్టారు. అయితే ఇలా వచ్చిన వారిలో ఒకరు ఇద్దరు మాత్రమే టికెట్ తెచ్చుకున్నారు. అదేవిధంగా మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. వీరి సంగతి పక్కన పెడితే ఎన్నికల త‌ర్వాత కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేరిన వారిలో చాలామంది ఇప్పటికీ ప్రాధాన్యం లేకుండా ఉన్నారు అన్నది వాస్తవం.

ముఖ్యంగా విశాఖపట్నంకి చెందిన కొంతమంది నాయకులు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అన్నది వారి అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. వైసీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన అవంతి శ్రీనివాస్ కానీ బాలినేని శ్రీనివాస రెడ్డి గానీ ఆమంచి కృష్ణమోహన్ గాని ఇట్లా అనేకమంది నాయకులు పార్టీలు మారారు. పార్టీలు మారిన తర్వాత వారికి ఉన్న అనుచరుల సంఖ్య కూడా తగ్గింది అన్న వాదన వినిపించింది. అయితే ఇది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారి ప్రభావం నియోజకవర్గాల్లో వారి హవా అంత ఆశించినంతగా అయితే కనిపించడం లేదన్నది కూడా వాస్తవం.

పార్టీ అధికారంలో ఉన్నా.. పార్టీ అధికారంలో లేకపోయినా నాయకులు ప్రజలకు చేరువ అవ్వాలి. ఈ విషయంలో జంపింగ్ చేసిన నాయకులకు ప్రజల నుంచి ఆశించిన మేరకు ఆదరణ లభించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల సమయానికి ప్రజలు మూడ్‌ ఎలా ఉంటుందనేది చెప్పలేకపోయి నా ప్రస్తుతం జంపింగ్ చేసిన నాయకుల పట్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బహుశా ఈ విషయం గ్రహించారో ఏమో తెలియదు.

కానీ, ఈ నాయకులు సైతం ప్రజలను కలుసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నేతలు పార్టీలు మారినా కూడా రాజకీయంగా ఉన్న పరిస్థితులు మాత్రం మార్పు రాలేదన్నది వాస్తవం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి మ‌రికొన్నాళ్లు ఇలానే కొన‌సాగితే.. నాయ‌కుల ప్ర‌భావం త‌గ్గుతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. దీంతో పార్టీలు మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌మ‌కు ఏదైనా ప‌ద‌వి ఇవ్వాలంటూ.. నాయ‌కులు ప‌రోక్షంగా పార్టీల‌కు సంకేతాలు పంపుతున్నారు. మ‌రి వారిని ఆయా పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.