తత్వం బోధ పడ్డాక పోసాని అడుగులు అటు వైపు !
పుట్టలో పాముందని చెబితే ఎక్కువ మంది ఆ వైపు వెళ్ళరు, కొంతమంది మాత్రం కుతూహలం ఆపుకోలేక పుట్టలోకి నేరుగా చేయి పెడతారు.
By: Satya P | 11 Sept 2025 8:07 AM ISTపుట్టలో పాముందని చెబితే ఎక్కువ మంది ఆ వైపు వెళ్ళరు, కొంతమంది మాత్రం కుతూహలం ఆపుకోలేక పుట్టలోకి నేరుగా చేయి పెడతారు. అది ఉత్త బెదిరింపు అయితే సేఫ్ అవుతారు. కాకపోతే మాత్రం ప్రాణాలకే రిస్క్. అనకూడదు కానీ పాలిటిక్స్ కూడా రిస్క్ తో కూడుకున్నవే అని చెప్పాలి మొత్తం సమాజమే నిట్టనిలువుగా చీలిపోయిన నేపథ్యం ఉందిపుడు. ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక సాధారణ మనిషి కూడా నోరు తెరచి నిర్భయంగా తమ మనసులో మాటను చెప్పలేని రోజులు వచ్చేశాయి. తాము అభిమానించే వారు అధికారంలో ఉంటే ఫర్వాలేదు, వారు దిగిపోయారు అంటే వేధింపులు మామూలుగా ఉండవు. అందులోనూ నోరు జాస్తీ చేసి మైకు ముందు పూనకాలు పోయే నాయకులకు అయితే ఇక చెప్పాల్సింది ఏముంది. చుక్కలే కనిపిస్తాయి.
జైళ్ళన్ని చుట్టేసి వచ్చారు :
ఇక మ్యాటర్ లోకి వస్తే సినీ రచయితగా హాయిగా ఉన్న పోసాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పోనీ అది ఆయన అభిరుచి అనుకున్నా ఓకే కానీ ఆయన వైసీపీలో చేరి ప్రతిపక్షాల మీద ఒక్క లెక్కన విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుని పవన్ ని ఆయన గట్టిగానే విమర్శించేవారు. దాంతో వైసీపీ ఓటమి తరువాత పోసానికి అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయనను అరెస్ట్ చేసిన తరువాత రాష్ట్రంలోని సగం పైగా జైళ్ళలో తిప్పించారు. ఆయన నాడు పడిన వేదన అయితే అంతా ఇంతా కాదు. మొత్తానికి బెయిల్ మీద బయటపడ్డ పోసాని కొన్నాళ్ళ పాటు సైలెంట్ గానే ఉన్నారు. ఇపుడు మళ్ళీ బయటకు వస్తున్నారు.
కలం పట్టి మళ్ళీ :
సినిమా పరిశ్రమకు పోసాని రచయితగా వచ్చారు. ఆయన వందలాది సినిమాలకు కధలు మాటలు సమకూర్చారు. ఆ తరువాత నటుడిగా కూడా బాగా రాణించారు. అయితే రాజకీయాల్లో పడి తన ప్రొఫేషన్ ని ఫణంగా పెట్టారు. సినిమాల్లో అవకాశాలు పోయాయి. అలాగే రచయితగా కూడా ఏమీ లేకుండా పోయింది. ఇపుడు జైలు జీవితం తరువాత పూర్తిగా తత్వం బోధపడిన పోసాని తన సినీ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారుట.
దసరాతో ముహూర్తం :
ఆయన ఈ నెల 22న నవరాత్రుల వేళ ముహూర్తం షాట్ తీసి కొత్త సినిమాను మొదలెడుతున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ లో మంచి సబ్జెక్ట్ ని ఆయన రెడీ చేసుకున్నారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు సినిమాలో ఒక పాత్ర కూడా వేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కనీసంగా కూడా రాజకీయ వాసనలు లేకుండా జాగ్రత్త పడుతున్నారుట. రాజకీయాలు లేవన్నా ఏ నాయకుడి గురించి ఈ మూవీలో ఉండదు అని గట్టిగానే చెబుతున్నారు అంటే రాజకీయాల్లో చేదు అనుభవాలు ఆయనను ఎలా వెంటాడేవో అర్ధం అవుతోంది కదా రాజా అని అంటున్నారు. ఏది ఏమైనా పోసానిని తత్వం బోధపడింది అని అంటున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఆయన కెరీర్ సక్సెస్ ట్రాక్ లోకి మళ్ళుతుందా అన్నది చూడాలని అంటున్నారు.
