Begin typing your search above and press return to search.

22ఏ మీద పొంగులేటి 227 నిమిషాల సుదీర్ఘ వివరణ

అవునన్నా.. కాదన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంబంధం లేని అంశం నెత్తికి చుట్టుకొని చివరకు రేవంత్ ప్రభుత్వానికి ఒక తలనొప్పిలా మారింది.

By:  Garuda Media   |   13 Sept 2026 2:07 PM IST
22ఏ మీద పొంగులేటి 227 నిమిషాల సుదీర్ఘ వివరణ
X

అవునన్నా.. కాదన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంబంధం లేని అంశం నెత్తికి చుట్టుకొని చివరకు రేవంత్ ప్రభుత్వానికి ఒక తలనొప్పిలా మారింది. నిషేధిత జాబితా (22ఏ)లోకి పెద్ద ఎత్తున భూములు, ఆస్తులు చేరటం.. వాటిని అమ్మాలనుకున్న వారు.. అమ్ముకోలేని దుస్థితి ఏర్పడటం.. ఈ సమస్య తీవ్రతను గుర్తించే విషయంలో జరిగిన ఆలస్యానికి రేవంత్ సర్కారు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. చివరకు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం కంటే ప్రజలు.. వారి ఆగ్రహాం వెరసి ప్రభుత్వానికి వారే ప్రధానప్రతిపక్షంగా మారారు. రేవంత్ సర్కారు పాలనలో ఇప్పటివరకు ఒక అంశం మీద ప్రజల్లో ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోని ప్రభుత్వం.. నష్టనివారణకు అసెంబ్లీని వేదికగా చేసుకుంది. రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శనివారం 227 నిమిషాల (మూడు గంటల 47 నిమిషాలు) సుదీర్ఘ వివరణను ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక అంశానికి సంబంధించి ఒక మంత్రి ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చిన సందర్భం ఇదేనన్న మాట అసెంబ్లీ లాబీల్లో వినిపించింది. ఆ మాటకు వస్తే దేశంలోనే మరే రాష్ట్ర మంత్రి కూడా ఇంత భారీ వివరణ ఇచ్చిన దాఖలాలు లేవన్న మాట రాజకీయ నేతల మాటల్లో వినిపించటం గమనార్హం.

అసెంబ్లీలో తన సుదీర్ఘ వివరణ సందర్భంగా మంత్రి పొంగులేని.. తమ వైపు పొరపాటు జరిగిందని ఒప్పుకుంటూనే.. అందుకు కారణం గత ప్రభుత్వంగా పేర్కొంటూ బీఆర్ఎస్ అగ్రనేతలకు సంబంధించిన చిట్టాను విప్పి.. సరికొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. 22ఏ నిషేధిత జాబితాలో అధికారికంగా ఉండాల్సిన దానికి బదులుగా కొన్ని వందల రెట్లు ఎక్కువగా (సుమారు కోటి ఎకరాల భూమి) ఉండటానికి దారి తీసిన పరిస్థితులను వివరించి.. వాటిని సరిదిద్దుతున్నట్లుగా చెప్పారు. అదే సమయంలో సమస్య లేకున్నా.. సమస్య ఉన్నట్లుగా హరీశ్ తదితర నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఉదాహరణలతో సహా వివరిస్తూ.. ఉతికి ఆరేసే ప్రయత్నం చేశారు.

అంతేకాదు.. ధరణి పోర్టల్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అంటూ సరికొత్త ఆరోపణలు చేసి..రాజకీయ అగ్గిని రాజేశారు. నిషేధిత జాబితాలోని భూములను కొద్దిసేపు తొలగించి.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని తిరిగి ఆ జాబితాలో పెట్టేవారని.. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లుగా పేర్కొంటూ.. గత ప్రభుత్వం చేపట్టిన దోపిడీకి సంబంధించి తమకు భయంకరమైన ఆధారాలు లభించినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 13 వేల ఖాతాలకు 23 లక్షల ఎకరాల ఆస్తిని బదిలీ చేసినట్లుగా చెప్పి.. పెద్ద బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన అంశాలు రానున్న రోజుల్లో భారీ రాజకీయ రగడకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీ నుంచే 22ఏ నిషేధిత భూముల వ్యవహారం అమల్లో ఉందన్న పొంగులేటి.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జాబితాలోని పేదల భూములు తొలగించలేదన్నారు. హైకోర్టు ఆదేశాలతో 2025లో ప్రభుత్వం 22ఏ జాబితాను అప్ లోడ్ చేసినట్లు చెప్పారు.

అప్ లోడ్ చేయటానికి తెలంగాణ హైకోర్టు 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వటంతో ధరణి.. అంతకు ముందు మార్పులు చేయని జాబితాను కలెక్టర్లు అప్ లోడ్ చేయటంతోనే సమస్య ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. ఆ పొరపాటును సరిదిద్దామని చెప్పారు. అయినప్పటికి.. క్షేత్రస్థాయిలో మాత్రం మంత్రి పొంగులేటి చెప్పిన పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. 22ఏ మీద అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఇచ్చిన సుదీర్ఘ వివరణ సందర్భంగా అసలు 22ఏ నిషేధిత జాబితా పుట్టుక ఎలా జరిగిందన్న అంశాన్ని కూడా వివరించటం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసేందుకు అవసరమైన ముడి పదార్థాల్ని డేటా రూపంలో మంత్రి పొంగులేటి బాగానే సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. ఇక్కడ ఆయన్ను అభినందించాల్సిన అంశం ఒకటి ఉంది. 22ఏ నిషేధిత జాబితాలో పొరపాట్లు జరిగాయన్న అంశాన్ని రెండు మూడు సార్లు ఒప్పుకోవటం. తప్పు జరగలేదని బుకాయించకుండా.. తప్పు జరిగిందని పేర్కొంటూ అందుకు అధికారుల తప్పిదంగా ఆయన పేర్కొన్నప్పటికి.. అంతకు మించిన డ్యామేజ్ తమ ప్రభుత్వానికి జరిగిందన్న విషయాన్ని లోలోనే దాచేసుకున్నారు. అయితే.. సమస్య పుట్టుక.. దానికి కారణాలు.. దాని తీవ్రత.. దానిమీద జరుగుతున్న రాజకీయ రచ్చల గురించి చెప్పిన మంత్రి పొంగులేటి.. సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించామన్న విషయాన్ని చెప్పలేదు. అంతేకాదు.. ఎప్పటికి సమస్య పూర్తిగా తొలగి.. మునుపటి పరిస్థితికి వస్తుందన్న విషయాన్ని చెప్పలేదన్న విమర్శ వినిపిస్తోంది.

తాజా ఇష్యూలో ప్రధాన ప్రతిపక్షాన్ని బాధ్యుల్ని చేసేందుకు చూపించిన శ్రద్ధ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద పెట్టి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. తమకు తిప్పలు తెచ్చి పెట్టిన 22ఏ ఇష్యూను.. ప్రధాన ప్రతిపక్షం మీదకు ఒక అస్త్రంగా సంధించేందుకు అవసరమైన గ్రౌండ్ ను అసెంబ్లీ సాక్షిగా సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. చూస్తుంటే.. 22ఏ ఇష్యూ రాజకీయ వేడిని మరింత రగల్చటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రజలకు ఇక్కట్లు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే రేవంత్ సర్కారుకు తిప్పలు తప్పవు. మరేం జరుగుతుందో చూడాలి.