వ్యూహకర్తలా...ఊహాగానాలా ?
ఎన్నికలు ఇపుడు కార్పొరేట్ స్టైల్ ని సంతరించుకున్నాయి. దాంతో పాటుగానే రాజకీయ వ్యూహకర్తలు అని ఒక కొత్త వ్యవస్థ రంగంలోకి దిగింది.
By: Satya P | 8 May 2026 10:15 AM ISTఎన్నికలు ఇపుడు కార్పొరేట్ స్టైల్ ని సంతరించుకున్నాయి. దాంతో పాటుగానే రాజకీయ వ్యూహకర్తలు అని ఒక కొత్త వ్యవస్థ రంగంలోకి దిగింది. దేశంలో గడచిన రెండు దశాబ్దాలుగా ఇది నెమ్మదిగా మొదలై ఈ రోజున ఒక అతి ముఖ్యమైన వ్యవస్థగా మారిపోయింది. నిజానికి వ్యూహకర్తలు చేసేది ఏమిటి అని ఆలోచిస్తే అది బ్రహ్మ పదార్థం లాంటిదే. వారికి రాజకీయ పార్టీల పెద్దలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తమ పార్టీ సభలలోకి ఆహ్వానించి ముఖ్య అతిధిలుగా చేసి ఉచితాసనం ఇస్తున్నారు. వారి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తూ వారు ఇచ్చే సలహా సూచనలతో పార్టీలను నడుపుతున్నారు. మిడతంభొట్లు జోస్యం మాదిరిగా ఆయా పార్టీలు గెలిస్తే అంతా వారి క్రెడిట్ ఖాతాలోకి పోతోంది. ఓడితే మాత్రం వారికి పోయేది ఏమీ లేదు పార్టీల నెత్తిన తెల్ల గుడ్డ పడుతోంది. ఆ పార్టీలను నమ్ముకున్న నాయకులు, లక్షలాది మంది క్యాడర్ అంతా కూడా దిక్కు తెన్నూ లేకుండా పోతున్నారు.
బ్యాడ్ కల్చర్ అంటూ :
రాజకీయ పార్టీలు తమ వారిని నమ్మడం మానేస్తున్నాయి. తమ పార్టీకి పట్టు కొమ్మలుగా వెన్ను దన్నుగా జీవగర్ర గా ఉన్న కార్యకర్తలతో దూరం పాటిస్తున్నాయి. సొంత పార్టీలో నాయకులకు అధినాయకత్వానికి మధ్య అతి పెద్ద అగాధం ఏర్పడుతోంది. అధినేతను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యూహకర్తలకు మాత్రం డోర్స్ ఎపుడూ తెరచే ఉంటున్నాయి. వారు ఇచ్చే సలహాలే పార్టీలను విజయ తీరాలకు చేరుస్తాయన్న గుడ్డి నమ్మకంతో నాయకులు తాము ఉన్న గదుల నుంచి బయటకు రాకుండా కీలకమైన నిర్ణయాలనే కాదు అభ్యర్థుల ఎంపిక నుంచి అన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సంప్రదాయ రాజకీయానికి భిన్నంగా సాగుతున్న ఈ పోకడ ఒక బ్యాడ్ కల్చర్ గా మారింది అని అంటున్నారు.
అసలైన బలం వారే :
ఏ రాజకీయ పార్టీకి అయిన అసలైన బలం బలగం క్యాడర్ మాత్రమే అని అంటున్నారు. వారికి నేరుగా ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. వారు నిత్యం జనంతో మమేకం అవుతారు, వారికి కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు ఏ నిర్ణయం వెనక జనాలు ఏమనుకుంటున్నారో తెలుసు. అందుకే వారిని దగ్గరకు తీసి సమావేశాలు అపుడపుడైనా పెడితే అసలు వాస్తవాలు వారే చెబుతారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారి నుంచే వస్తాయి. తమ పార్టీ తప్పులు ఎదుటి పార్టీ తప్పులు అలాగే తమ బలాలు ప్రత్యర్ధి బలాలు అన్నీ కార్యకర్తలే చెబుతారు. వారికి తెలిసిన దానిలో పదవ వంతు కూడా వ్యూహకర్తలకు తెలియదు, వారి ద్వారా అపాయింట్ అయిన బృందాలకూ తెలియదు అంటున్నారు.
అట్టర్ ఫ్లాప్స్ తోనే :
దేశంలో వరసగా వ్యూహకర్తల పధకాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తాజా ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో వ్యూహకర్తలను నమ్మిన బడా నాయకులు ఇపుడు ఫలితం చేదుగా రావడంతో కుమిలిపోతున్నారు. ఈ విషయం తెలిసి మరో పెద్ద రాష్ట్రానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న చోట ఒక కీలక పార్టీ తాము నియమించుకున్న సదరు సంస్థను వ్యూహకర్తలను తప్పించి భారీ షాక్ ఇచ్చేసిన ఉదంతం తెలుస్తోంది. ఇపుడిపుడే రాజకీయ పార్టీల నాయకులలో కూడా అంతర్మధనం కనిపిస్తోంది. వ్యూహకర్తల వల్ల అయ్యేది ఏమీ లేదని కూడా అర్ధం అవుతోంది. అద్దం లో తాము ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది తప్ప కొత్త అందం రాదూ అని కూడా అర్ధం అవుతోంది.
మేలుకోవాల్సిందే :
అభిమానంతో పనిచేసే క్యాడర్ ని అలాగే పార్టీ మీద నమ్మకంతో పనిసే నాయకులను వదులుకుని ఎండమావుల లాంటి వ్యూహకర్తల వ్యవస్థ వెంట పడి చేతి ఫలితాలను తెచ్చుకోవడం వారికి వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అన్న చర్చ కూడా చాలా పార్టీలలో జరుగుతోంది. ఏ పార్టీకైనా వేవ్ ఉంటే ప్రజలలో సానుకూలత ఉంటే కచ్చితంగా గెలుస్తుంది. ఆ పార్టీ క్యాడర్ ఓట్లను జనం ద్వారా పోలింగ్ బూత్ ల దాకా తీసుకెళ్ళి వేయిస్తారు. అంటే నెట్ వర్క్ పార్టీది అయితే నిర్ణయం జనాలది. అలా ప్రజలలో తమ పార్టీ పట్ల అనుకూలత పెంచుకోవాలి, క్యాడర్ ని దగ్గరకు తీసి పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఈ రెండు విషయాలని అత్యంత ముఖ్యమైన వాటిని పక్కన పెట్టి పొలిటికల్ కన్సల్టెంట్లు చేతిలో సక్సెస్ ఉందని భావించి అన్నీ వారితోనే అన్నట్లుగా అధినాయకులు చేస్తే నేల విడిచి సాము అవుతుంది అని అంటున్నారు. ఎక్కడైనా వేవ్ లేకపోతే గెలిపించిన ఒక్క ఎన్నికల వ్యూహకర్తను చూపించమని కూడా అంతా అంటున్నారు. సో రాజకీయ పార్టీలు ఊహాగానాలకు వ్యూహకర్తలకు ఎపుడైతే స్వస్తి చెబుతారో అపుడే వారికి విజయం దక్కుతుందని అంటున్నారు.
