పవన్ కళ్యాణ్ OG సినిమాపై అంబటి, మరో వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. వైరల్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'OG' (ఓజస్ గంభీర) విడుదల కాకముందే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
By: A.N.Kumar | 24 Sept 2025 2:20 PM ISTపవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'OG' (ఓజస్ గంభీర) విడుదల కాకముందే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ సినిమాపై, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
*వైసీపీ ఎమ్మెల్యేల సెటైర్లు
వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ 'OG' అనే పదంపై వ్యంగ్యంగా స్పందిస్తూ "OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ జనసైనికుల ఆగ్రహానికి కారణమైంది. గత ఎన్నికలలో తాము వందశాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామని, వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితం అయిందని జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారింది.
*అంబటి రాంబాబు వ్యాఖ్యలు
మరో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ జి... "OG" సూపర్ డూపర్ హిట్టై దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నాను !’ అని సెటైరికల్ గా చెప్పారు. పవన్ నటించిన గత రెండు సినిమాలు విజయం సాధించకపోవడంతో ఈ సినిమా కోసం పవన్ కసిగా పనిచేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి పదవిని పక్కనపెట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొనడంపై ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఇటీవల సినిమా టికెట్ ధరను రూ.1,000గా నిర్ణయించడంపై అంబటి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాల గురించి మాట్లాడిన పవన్, ఇప్పుడు టికెట్ ధర పెంచడం అవినీతి, అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు.
*సినిమా హైప్ పెంచే వ్యాఖ్యలు
రాజకీయ నాయకుల ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు 'OG' సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. ఈ వివాదం సినిమా హైప్‌ను పెంచడానికి ఒక రకంగా సహాయపడింది. అభిమానులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూనే, రాజకీయ విమర్శలకు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటనను, సినిమా విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఈ పరిణామాలు సినిమాకు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
