Begin typing your search above and press return to search.

అరెస్టులు జైలూ కాదు...జనం కోర్టు బోనులోనే !

రాజకీయం ఎప్పటికపుడు మారుతోంది. వ్యూహాలు సైతం మారుతున్నాయి. ఇది వరకు చూస్తే తప్పు చేసిన వారిని జైలు పాలు చేసేవారు.

By:  Satya P   |   12 Aug 2025 8:15 AM IST
అరెస్టులు జైలూ కాదు...జనం కోర్టు బోనులోనే !
X

రాజకీయం ఎప్పటికపుడు మారుతోంది. వ్యూహాలు సైతం మారుతున్నాయి. ఇది వరకు చూస్తే తప్పు చేసిన వారిని జైలు పాలు చేసేవారు. వారిని జైలు గోడల మధ్యన ఉంచేవారు. ఇక ఆ కేసులు తేలేసరికి ఎంతకాలం అవుతుందో అన్నది వేరే చర్చ. ఈ లోగా జైలులో ఉన్న వారికి చెప్పలేని సింపతీ దక్కుతోంది. బయటకు వచ్చిన వెంటనే వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ మీదట వారి విజయాలు ఖాయమైపోయి అందలాలు అద్భుతంగా అందుతున్నాయి. అందుకే జైలుకి వెళ్ళి చెడిపోయిన రాజకీయ నాయకుడు లేడు అని ఒక కొత్త సామెత అయితే పుట్టుకుని వచ్చింది.

అధినేతలకు అదే శిక్ష :

శిక్షలు బహు రకాలు. చట్టబద్ధంగా వేసే శిక్షల కంటే అయిన వారు దగ్గర వారు చూసే చూపులే అసలైన శిక్షలు. తప్పో ఒప్పో తేలనంతవరకూ ఆ మనస్సు పడే క్షోభ పడిన వారికే తెలుస్తుంది. ఇక రాజకీయాల్లో చూస్తే అధినేతల విషయం కూడా అలాగే ఉంటోంది. నేరకపోయి కేసులలో ఇరుక్కోవాలి కానీ వారికి కోర్టులు వేసే శిక్షల కంటే జనం కోర్టు లో బోనులో నిలబెట్టి ప్రత్యర్ధులు వేసే శిక్షలే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ కొత్త వ్యూహాన్ని రాజకీయ వ్యూహకర్తలు ఎంచుకుంటున్నారు.

కేసీఅర్ విషయంలో అదేనా :

తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఈ నివేదికను ప్రభుత్వం అందుకుంది. ఇక ఇందులో ఎవరేమిటి చేశారు అని ఉంది. దానిని బట్టి చర్యలు ఉంటాయని ప్రభుత్వం పెద్దలు అంటున్నారు. అయితే కేసీఆర్ ని జైలుకు పంపిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెబుతూ కేసేఅర్ ప్రస్తుతం ఉంటున్న ఎర్రవెల్లి ఫాం హౌజ్ కి చర్లపల్లి జైలుకు తేడా ఏముందని ప్రశ్నించారు. పోలీసులు మాత్రమే ఉండరు తప్ప దాదాపుగా ఆయన ఒంటరిగా అక్కడ జనాలకు దూరంగానే ఉంటున్నారు కదా అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. దీనిని బట్టి చూస్తే కేసీఅర్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జైలుకు పంపించే ఆలోచన ప్రభుత్వానికి లేదా అన్న చర్చ బయల్దేరింది.

జనం ముందు పెట్టి మరీ :

అయితే కాంగ్రెస్ పెద్దల వ్యూహం మరోలా ఉంది అని అంటున్నారు. కాళేశ్వరం అవినీతి మీద జనం ముందు అంతా పెట్టి ఆ కోర్టులోనే కేసీఆర్ అండ్ కోని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. లక్షల కోట్ల ప్రాజెక్ట్ ప్రజాధనం వృధా అన్నది జనం ముందే చెప్పి వారినే న్యాయ నిర్ణేతలుగా ఉంచి మరీ ఈ కేసులో ప్రత్యర్ధి బీఆర్ఎస్ కి తగిన శిక్ష ప్రజా కోర్టులోనే వేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా చేస్తేనే మేలు జరుగుతుందన్నది కాంగ్రెస్ ప్లాన్ అయి ఉండొచ్చు అని అంటున్నారు.

తెలుగు నాట ఇదే అమలు :

ఇక తెలుగు నాట ఈ విధానం ఇప్పటికే అమలు లో ఉంటోంది. ప్రత్యర్థుల మీద జనంలోనే ఆరోపణలు చేయడం వాటిని పదే పదే ప్రస్తావించడం ద్వారా వారిని దోషులుగా చేయడంతో చర్చకు ఆస్కారం కల్పించడం చేస్తూ పోతున్నారు. ఇలా జరిగే ప్రచారంలో ప్రత్యర్థులు ఎంత అఫెన్సివ్ గా వాదించుకున్నా కేసులలో ఆరోపణలు ఎదుర్కొన్న వారి గొంతు ఎపుడూ బలహీనంగానే ఉంటుంది. దాంతో వారి మాటలు పెద్దగా జనాలకు చేరవు. మా నాయకుడు పులి కడిగిన ముత్యంగా బయటకు వస్తారు అని ఎన్ని అయినా చెప్పుకోవచ్చు. ఒక వేళ వారి మాటలో నిజమే ఉందనుకున్నా అది బయటకు వచ్చేలోగా అబద్ధం ప్రపంచం చుట్టేస్తుంది. ఈ లోగా రాజకీయ పబ్బం కూడా పూర్తిగా గడుస్తుంది. అందుకే షార్ట్ కట్ మెదడ్స్ నే నేతాశ్రీలు ఎన్నుకుంటున్నారు. ఇదే తీరు అందరూ ఫాలో అయితే ఇక అధినాయకుల అరెస్టులు జైళ్లూ అన్నవి ఉండవి, జనంలోనే అంతా జరుగుతూంటుంది.