జగన్ ని చంద్రబాబు కేసీఆర్ ని రేవంత్ అరెస్ట్ చేయరు...ఎందుకంటే ?
రాజకీయాల్లో చాలా లెక్కలు ఉంటాయి. ఎక్కడ ఏ లెక్క కలిపితే ఏది ప్లస్ అవుతుంది లేదా ఏది మైనస్ అవుతుంది అన్నది పొలిటికల్ మేథమెటిక్స్ లో అవగాహన ఉన్న వారికే అర్థం అవుతుంది.
By: Satya P | 15 Sept 2025 8:00 PM ISTరాజకీయాల్లో చాలా లెక్కలు ఉంటాయి. ఎక్కడ ఏ లెక్క కలిపితే ఏది ప్లస్ అవుతుంది లేదా ఏది మైనస్ అవుతుంది అన్నది పొలిటికల్ మేథమెటిక్స్ లో అవగాహన ఉన్న వారికే అర్థం అవుతుంది. అందుకే ఒకటి ని ఒంటరి అంకెగానే ఉంచాలని చాలా మంది చూస్తారు. పొరపాటున మరొకటి చేరితే అది రెండు కావచ్చు ఇరవై రెండు కూడా కావచ్చు. అలాగే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని ఏ మాత్రం టచ్ చేసినా రివర్స్ లోనే కొడతాయి. అందుకే అన్ని విషయాలను బాగా పరిశీలించిన మీదటనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఇపుడు చూస్తే సరికొత్త రకం స్ట్రాటజీ కూడా అమలులో పెడుతున్నారు. అది బాగా వర్కౌట్ అవుతోంది కూడా
ఆ ఇద్దరికీ నో అరెస్ట్ :
అవుని తెలుగు నాట రాజకీయాలు చూస్తే ఆ ఇద్దరి అరెస్ట్ అన్నది అసలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అదెలా అంటే దానికే పొలిటికల్ మేథమెటిక్స్ అడ్డం పడుతోంది అని అంటున్నారు. అందుకే జగన్ ని చంద్రబాబు కానీ కేసీఆర్ ని రేవంత్ రెడ్డి కానీ అరెస్ట్ చేసే చాన్స్ అసలు లేనే లేదని అంటున్నారు. ఇక రాజకీయ లెక్కలు చూస్తే గతంలో రేవంత్ రెడ్డి ని కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దాంతో ఆయనకు అమాంతం సింపతీ పెరిగింది. ఏకంగా సీఎం అయిపోయారు. అలాగే చంద్రబాబుని ఎన్నికలు ఆరు నెలల వ్యవధిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కూటమి మునుపెన్నడూ లేని విధంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. బాబు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిపోయారు.
సెంటిమెంట్ మహిమ :
ఇదంతా సెంటిమెంట్ మహిమ అని అంటున్నారు. భారత దేశంలో సెంటిమెంట్ పొలిటికల్ గా సూపర్ హిట్ అవుతుంది. జైలుకు ఎవరైనా వెళ్తే చాలు ఎక్కడ లేని సానుభూతి వస్తుంది. అయ్యో పాపం అని కూడా జనాలు అనుకుంటారు. దాంతో జైలుకు వెళ్ళి వస్తే కనుక ఏకంగా సీఎం పీఠానికే గురి పెడతారు. అందుకే ఎప్పటికీ ఈ తప్పు రాజకీయ గణితం బాగా చదువుకున్న వారు ఎవరూ చేయరనే అంటారు.
వారంతా గెలిచారు :
జైలుకు వెళ్ళి వచ్చి సీఎంలు అయిన వారు భారత దేశ రాజకీయ చరిత్రలో చాలా మంది ఉన్నారు. తమిళనాడులో జయలలితను జైలులో చాలా కాలం పెట్టారు. అంతే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి ఒక్కసారి కాదు రెండు సార్లు వరసగా గెలిచి డీఎంకే భారీ షాక్ ఇచ్చారు. దాని కంటే ముందు కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఆయన కూడా అప్పటి అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని పేక మేడ మాదిరిగా కూల్చేసి మొత్తం అసెంబ్లీ సీట్లను ఊడ్చేశారు. బీహార్ లో చూస్తే ఆర్జేడీ లీడర్ గా ఉన్న లాలూ యాదవ్ ని జైలుకు పంపించిన తర్వాత ఆయన పార్టీ మరింతగా పుంజుకుని గ్రాస్ రూట్ లెవెల్ లోకి వెళ్ళి పాతుకుపోయింది. ఆయన సతీమణి అనేక ఏళ్ళ పాటు సీఎం గా పనిచేయడానికి లాలూ జైలు జీవితం ఇంధనంగా మారింది.
జార్ఖండ్ లో సీన్ అదే :
ఇక ఆ మధ్య జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయన పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచి మరోసారి హేమంత్ సీఎం అయిపోయారు. దాంతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ ఆశలు అన్నీ అడియాశలు గా మారాయి. ఇలా తరచి చూస్తే దేశంలో ఎన్నో అరెస్టుల వెనక ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పాల్సి ఉంది.
జగన్ ని స్ట్రాంగ్ గా చేసింది :
ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ని జైలు పాలు చేసింది. పదహారు నెలల పాటు జగన్ జైలు జీవితాన్ని అనుభవించారు ఆయన జైలులో ఉండడం ఆయన పార్టీకి బాగా కలసి వచ్చింది. వైసీపీ ఒక బలమైన ఫోర్స్ గా ఏపీలో స్థిరపడడానికి జగన్ అరెస్ట్ అన్నది ఎంతగానో ఉపకరించింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ చూసిన వారు ఎవరూ జగన్ ని కేసీఆర్ ని ఏరి కోరి మరీ అరెస్ట్ చేయాలని అనుకోరని అంటారు.
ప్రజా కోర్టులోనే :
ఇపుడు కొత్త రకం స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. అదేంటి అంటే జైలు దాకా పంపించి ప్రత్యర్థికి సానుభూతిని కోరి మరీ అందించకుండా ప్రజా కోర్టులోనే వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి చేశారని రాష్ట్ర ఖజానా దోచబెట్టారని ప్రజా ధనం లూటీ చేశారని ఇలా ఆయా సందర్భాలలో జనాల ముందు అదే పనిగా ఏకరువు పెట్టడంతో జనంలో బలమైన ముద్ర వేయ్డానికి చూస్తున్నారు. దాని వల్ల ఆ పార్టీ వస్తే అవినీతి చేస్తారు అని ఆ నాయకుడికి అధికారం ఇస్తే అరాచక పాలన తెస్తారని జనాలలో కనుక ఒక బలమైన అభిప్రాయం పడితే వారి ఇమేజ్ వారి పాలిటిక్స్ రెండూ మసకబారిపోతాయి. అందుకే అరెస్టులూ జైళ్ళూ అని హడావుడి చేయకుండా ఈ సరికొత్త స్ట్రాటజీనే పొలిటికల్ మాస్టర్లు ఎంచుకుంటున్నారు అని అంటున్నారు.
