'పీపీపీ' వైసీపీ మరో వ్యూహం.. హైకోర్టులో పిల్!
ఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 7 Jan 2026 5:50 PM ISTఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి చాలినన్ని నిధులు లేవని.. అదే ప్రైవేటు-పబ్లిక్-పార్టనర్‌షిప్ అయి తే.. వేగంగా వీటి నిర్మాణం పూర్తికావడంతోపాటు.. మెరుగైన సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. అయితే.. పీపీపీ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడమేనని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టింది.
ఇక, రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఈ వ్యవహారం దుమారంగా కూడా మారింది. ఎట్టి పరిస్థితిలోనూ పీపీపీ ని ముందుకు తీసుకువెళ్తామని.. అధికార పార్టీ, అలా తీసుకువెళ్లకుండా అడ్డుకుంటామని వైసీపీ రెండూ కూడా పంతం-నీదా-నాదా.. అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్.. కాంట్రాక్టర్లను జైలు కు కూడా పంపిస్తామని వ్యాఖ్యానించారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇలా సాగుతున్న పీపీపీ వ్యవహారంలో మరో వ్యూహానికి వైసీపీ తెరదీసింది.
తాజాగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేసింది.
1) 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని.. వీటిలో ప్రైవేటు జోక్యం ఉండడానికి వీల్లేదని పేర్కొంటూ ఒక పిల్‌ను దాఖలు చేసింది. తద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని తెలిపింది. అంతేకాదు.. పీపీపీ విధానం అంటే.. ప్రైవేటుకు అప్పగించడమేనని తేల్చి చెప్పింది. దీనిని హైకోర్టు విచారణ కు తీసుకుంది.
ఇక, 2) ప్రస్తుతం ఐదు కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలిచేందుకు రెడీ అయింది. దీనిపై స్టే ఇవ్వాలని కోరుతూ.. వైసీపీ మరో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఇప్పటికే టెండర్లు పిలిచారని.. దీనిని నిలువరించాలని.. తుది తీర్పు వచ్చే వరకు టెండర్లు పిలవకుండా స్టే ఇవ్వాలని కోరింది. కాగా.. ఇప్పటికే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయా పిటిషన్లతో కలిపి వీటిని కూడా విచారించనున్నట్టు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
