బంగ్లాదేశ్ లో అల్లర్లకు భారత్ పై విద్వేషమే కారణం
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య ఉదంతం బంగ్లాదేశ్ లో కార్చిచ్చులా మారింది. ఈ హత్యకు పాల్పడిన వారు భారత్ కు పారిపోయారన్న పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి.
By: A.N.Kumar | 21 Dec 2025 9:00 PM ISTబంగ్లాదేశ్ లో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న అల్లర్లు, ఉద్యమాల వెనుక కేవలం విద్యార్థుల ఆగ్రహం మాత్రమే కాదు.. దానికి ఇంధనం పోస్తున్నది స్పష్టమైన భారత్ వ్యతిరేక భావజాలం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ప్రసంగాలు చూస్తే ఇది సహజస్ఫూర్తిగా వచ్చిన నిరసన కాదని.. వ్యూహాత్మకంగా రెచ్చగొట్టిన ఉద్యమమని అర్థమవుతోంది. భారత్ నుంచి కరెంట్ కొనకపోతే భారత్ ఆర్థికంగా కూలిపోతుందన్నట్టు బంగ్లాదేశ్ పై భారత్ మొత్తం ఆధారపడి ఉందన్నట్టు యువతను తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలు చూసి భారత్ లోని ప్రజలు ఆశ్చర్యపోతుండగా.. బంగ్లాదేశ్ లోని యువత మాత్రం ఆ మాటలకు ప్రభావితమవుతోంది.
హసీనాను అప్పగించలేదనే భారత్ పై కుట్రలు
బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్యమం అంతా రాజకీయ ప్రేరణతోనే సాగుతున్నదనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ప్రధాని ‘షేక్ హసీనా’ను అధికారంలో నుంచి తప్పించడానికి జరిగిన పరిణామాల తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ కీలక పాత్ర పోషించిందన్న చారిత్రక నిజాన్ని విస్మరించి, భారత్ ను శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.హసీనాకు ముప్పు ఏర్పడినప్పుడు భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. అయితే ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలన్న డిమాండ్లకు భారత్ సుమఖంగా లేకపోవడంతో అదే అంశాన్ని అడ్డుపెట్టుకొని భారత్ పై నిందల వర్షం కురిపిస్తున్నారు.
షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యపై తప్పుడు ప్రచారాలు
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య ఉదంతం బంగ్లాదేశ్ లో కార్చిచ్చులా మారింది. ఈ హత్యకు పాల్పడిన వారు భారత్ కు పారిపోయారన్న పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. ఆధారాలు లేకపోయినా.. ఈ ప్రచారమే యువతను రోడ్లపైకి తెచ్చింది. భారత్ బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న కథనాలను కొంతమంది కావాలనే ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు హసీనా పతనం తర్వాత ఏర్పడిన అధికార శూన్యతను పూరించేందుకు జమాతే ఈ ఇస్లాం వంటి ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తులు యువతలో ఉన్న జాతీయవాదాన్ని భారత్ వ్యతిరేకతతో ముడిపెట్టి భారత్ కు అనుకూలం అంటే దేశద్రోహమే అన్న ముద్ర వేస్తూ తమ వైపు తిప్పుకుంటున్నాయి. రాబోయే 2026 ఎన్నికల నాటికి తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి భారత్ వ్యతిరేకతను ఒక సులభమైన ఆయుధంగా వాడుకుంటున్నారు.
బంగ్లాదేశ్ ను నాశనం చేస్తున్న యూనస్ మోడల్
ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో ప్రభావం పెంచుకోవాలని చూస్తున్న బయటి శక్తులు కూడా ఈ గందరగోళానికి కారణమవుతున్నాయి. భారత్ ప్రభావం తగ్గితే తమకు లాభమని భావించే చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల్లో, తీస్తా నది జలాల వివాదం వంటి సున్నితమైన అంశాలను కావాలనే హైలెట్ చేస్తూ భారత్ ను ఒక విలన్ గా చిత్రీకరిస్తున్నారు. ఇదంతా కేవలం విద్యార్థుల ఉద్యమంగా కనిపించినా.. వాస్తవానికి ఇది ఒక వ్యూహాత్మక రాజకీయ వ్యూహం. ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన మహ్మద్ యూనస్ చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రయోగాలు దేశాన్ని స్థిరత్వం వైపు కాకుండా అస్థిరత వైపు నెడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లు, ఉద్యమాలు సహజంగా పుట్టినవి కావు. యువత ఆవేశాన్ని ఆయుధంగా చేసుకొని భారత్ వ్యతిరేకతను రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్న శక్తులే వీటి వెనుక ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బంగ్లాదేశ్ కు మాత్రమే కాదు. దక్షిణాసియా ప్రాంతం మొత్తం స్థిరత్వానికి ప్రమాదకరమైన సంకేతంగా మారుతోంది.
