ఎన్టీఆర్ కంటే ముందే అక్కినేని రాజకీయ ఎంట్రీ ?
తెలుగు సినిమాలు రెండు కళ్ళుగా అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావులను చెప్పాలి. వారిద్దరూ తెలుగు సినిమాకు నడకలు నేర్పారు పరుగులు తీయించారు.
By: Satya P | 20 Sept 2025 10:00 PM ISTతెలుగు సినిమాలు రెండు కళ్ళుగా అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావులను చెప్పాలి. వారిద్దరూ తెలుగు సినిమాకు నడకలు నేర్పారు పరుగులు తీయించారు. తెలుగు సినిమాను ప్రతీ ఇంటికీ తీసుకెళ్ళారు. ప్రతీ వారి హృదయాలను ఆకర్షించారు. వెండి తెర వేలుపులుగా అనిపించుకున్నారు. ఆ ముందూ తరువాత ఎంతో మంది ప్రతిభావంతులు రావచ్చు. కానీ ఎన్టీఆర్ కి అక్కినేనికి సరిసాటి మాత్రం ఎవరూ లేరు అని కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులుగా మారి :
దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ఈ ఇద్దరు మహా నటుల ప్రభావం తెలుగు సమాజం మీద అంతా ఇంతా కాదు. ప్రతీ తెలుగింటి లోగిలిలో ఈ ఇద్దరూ ఒక కుటుంబ సభ్యుడు మాదిరిగా ఉండేవారు అంటే అతిశయోక్తి లేదు. వారిని పరవారుగా చూడలేదు. తమ సొంత వారుగా చూసుకుని మురిసిపోయారు. కేవలం తెర బంధంతో ఇంతటి చిక్కని రక్తబంధం పెనవేసుకున్నారు అంటే అది ఆ ఇద్దరు మేటి నటుల గొప్పతనం అని చెప్పాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన సమాజం కోసం :
అక్కినేని ఎన్టీఅర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు కళాకారులుగా ఉంటూనే ఉత్తమ సమాజం కోసం పనిచేశారు. కుటుంబ పెద్దగా ఏది మంచి ఏది చెడు అన్న అద్భుతమైన సందేశాన్ని వెండి తెర వేదిక మీద నుంచే అందించారు. మంచి సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించారు. ఉత్తర పౌరులుగా సమాజం నుంచి ఎంతో మంది ఎదిగేందుకు తమ సినిమాలు అనే టానిక్ ని అందించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరితపించారు. వారు చేసిన సినిమాలలో అత్యధికం అవే కావడం విశేషం.
బుద్ధిమంతుడుగా :
ఇక చూస్తే నాగేశ్వరరావు నిజంగా బుద్ధిమంతుడు అనే చెప్పాలి. ఆయన సినిమాల టైటిల్స్ నుంచి కూడా మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు అందుకే ఆయన సినిమాల టైటిల్స్ బుద్ధిమంతుడు మంచివాడు అందాల రాముడు ఇలా ఎక్కువగా వచ్చాయి. అఫ్ కోర్స్ దొంగ రాముడు వంటివి ఉన్నా వాటిలో కూడా అద్భుతమైన సందేశం నింపే సినిమాలు అందించారు. ఇక తన సినిమాలలో పాటలు మాటలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నాగేశ్వరావు చూసుకునేవారు. తాను హీరో కాబట్టి తను చేసే ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని ఆడియన్స్ దానిని ఫాలో అవుతారు అని నాగేశ్వరావు భావించి ఎంతో బాధ్యతగా వ్యవహరించేవారు అని చెప్పేవారు.
రాజకీయాల పట్ల పూర్తి అవగాహన :
ఇక తెలుగు సినిమాల్లో దిగ్గజ నటులుగా ఉన్న అక్కినేని ఎన్టీఆర్ లకు సినిమాలతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా అంతా అదే గౌరవం మర్యాద ఉండేవి అయితే మద్రాస్ లోనే తన మొత్తం సినీ కెరీర్ పూర్తి చేసిన ఎన్టీఆర్ కంటే కూడా అక్కినేనికి రాజకీయాల మీద అవగాహన ఆసక్తి కూడా ఎక్కువే అని చెబుతారు. ఆయన 1960 దశకంలో మొదట్లో హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ రావాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఈ రోజు టాలీవుడ్ హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పునాది అక్కినేని అని కచ్చితంగా చెప్పాలి. అందుకు గానూ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను సదా తలచుకోవాల్సిన అవసరం ఉంది
అక్కినేని మీదే ఒత్తిడి :
అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరితో మంచి పరిచయాలు కలిగి ఉన్న అక్కినేని మీద రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఆయన కూడా లౌక్యంగా వ్యవహరిస్తూ రాజకీయాల పట్ల సాధికారితను సాధించారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆనాటి ప్రముఖులు కోరుకునే వారు అని అంటారు. అయితే 1974లో అక్కినేనికి గుండె ఆపరేషన్ జరిగింది. దాంతో ఆయన ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాల్సి వచ్చింది. దాంతో ఎంతో ఒత్తిడి కలిగిన రాజకీయ రంగంలోకి వచ్చేందుకు ఆయన ఇష్టపడలేదు అని అంటారు.
ఎన్టీఆర్ కి నో చెప్పిన అక్కినేని :
ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టాలనుకున్నపుడు తొలిసారిగా కలిసింది అక్కినేనినే. బ్రదర్ ఇద్దరమూ రాజకీయాల్లోకి వెళ్దాం, ప్రజలకు సేవ చేద్దామని కోరారని స్వయంగా అక్కినేని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. అయితే తన హెల్త్ గురించి ఫోకస్ పెట్టిన కారణంగానే ఎన్టీఆర్ ఆహ్వానాన్ని కూడా అక్కినేని సున్నితంగా తిరస్కరించాడు. నిజానికి అక్కినేనికి డెబ్బై దశకంలో ఉన్న పాపులారిటీకి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఎన్నో పెద్ద పదవులు అలంకరించేవారు అని కూడా అంటారు. కానీ ఆయన పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయారు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉన్నారు. దటీజ్ అక్కినేని అనిపించారు కూడా.
